Current Affairs Telugu Daily

కవి శివారెడ్డికి ‘సరస్వతీ సమ్మాన్‌’ 
ప్రముఖ కవి, రచయిత, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్‌ కె.శివారెడ్డి ప్రతిష్ఠాత్మకమైన ‘సరస్వతి సమ్మాన్‌’ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ సంస్థ కేకే బిర్లా ఫౌండేషన్‌ ఏటా అందజేసే ఈ అవార్డును 2018 సంవత్సరానికిగాను శివారెడ్డిని ఎంపిక చేసింది.
*2016లో ఆయన రాసిన ‘పక్కకు ఒత్తిగిలితే’ అనే కవితా సంపుటిని పురస్కారానికి ఎంపిక చేశారు. ‘సరస్వతి సమ్మాన్‌’ను ప్రారంభించిన 28 ఏళ్లలో ఈ అవార్డును అందుకున్న తొలి తెలుగు కవి శివారెడ్డినే.
*అవార్డు కింద ఆయనకు పతకం, ప్రశంసాపత్రంతో పాటు రూ.15లక్షల నగదును అందజేస్తారు.
*లోక్‌సభ సచివాలయం పూర్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సుభాష్‌ సి. కశ్యప్‌ నేతృత్వంలోని 13 మంది సభ్యులు గల ఎంపిక కమిటీ దేశవ్యాప్తంగా 22 భాషల్లోని ఎంతోమంది కవుల రచనలను పరిశీలించి శివారెడ్డిని ఎంపిక చేసింది.
*ఏపీలోని గుంటూరు జిల్లా కారమూరివారిపాలెంలో 1943 ఆగస్టు 6న జన్మించారు. ఐదు దశాబ్దాలుగా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. అక్కడి వివేకవర్థిని కాలేజీలో అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. 1973లో సాహితీ సేద్యాన్ని ప్రారంభించిన ఆయన.. రక్తం సూర్యుడుతో మొదలుకొని 20 కవితా సంకలనాలను వెలువరించారు. చర్య, ఆసుపత్రిగీతం, నేత్ర ధనస్సు, మోహనా ఓ మోహనా, బారమితి, శివారెడ్డి కవిత, అజేయం, నా కలల నది అంచున, వర్షం.. వర్షం, జైత్రయాత్ర, కవి సమయం, అంతర్జనం, వృత్తలేఖిని, పోసగనీవన్నీ, ఆమె ఎవరైతే మాత్రం వంటివి ఆయన కవితల్లో ప్రధానమైనవి.
*1990లో ఆయనకు సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. 2015 సెప్టెంబరులో వరంగల్‌ జిల్లా మొద్దుగుట్టలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరులైన ఇంజనీరింగ్‌ విద్యార్థిని శ్రుతి అలియాస్‌ మహిత, విద్యాసాగర్‌రెడ్డి అలియాస్‌ సాగర్‌లకు అంకితం ఇస్తూ కూడా కవిత రాశారు. పలు పుస్తకాలను ఆయన అనువాదం చేశారు.
*మధ్యప్రదేశ్‌ సర్కారు తరఫున అందజేసే ప్రతిష్ఠాత్మకమైన కబీర్‌ సమ్మాన్‌ అవార్డును 2017లో రాష్ట్రపతి కోవింద్‌ నుంచి శివారెడ్డి అందుకున్నారు.

views: 993

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams