భారత్-పాక్‌ల మధ్య ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్‌పై ఏప్రిల్ 2న జరిగే సమావేశానికి భారత్ హాజరుకావడం లేదని సమాచారం. ఈ మేరకు దిల్లీలో పాక్ హై కమిషనర్‌కు భారత్ తమ అభ్యంతరాలను తెలియజేసినట్లు తెలుస్తోంది. కర్తార్‌పూర్ నిర్మాణంపై పాక్ నియమించిన కమిటీలో ఖలిస్థాన్ వేర్పాటువాద నేతలు ఉండడమే దీనికి అసలు కారణం. కారిడార్ నిర్మాణ ప్రక్రియపై పది మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని పాక్ March 27 న ప్రకటించింది.
*దీనిలో ఖలిస్థాన్ వేర్పాటువాద నేత గోపాల్ సింగ్ చావ్లా పేరు కూడా చేర్చింది. గోపాల్ కమిటీలో ఉండడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘‘పాక్ నియమించిన కమిటీలో వివాదాస్పద వ్యక్తుల్ని చేర్చడం పట్ల భారత్ వివరణ కోరింది. దీనిపై పాక్ స్పందించిన తర్వాతే కారిడార్ నిర్మాణ విధివిధానాలపై తదుపరి సమావేశం ఉంటుంది. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని భారత్ కూడా కోరుకుంటోంది. అలా అని దేశ శాంతి, భద్రతలను పణంగా పెట్టలేం’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
*కారిడార్ నిర్మాణంపై జరిగిన చివరి సమావేశంలో భారత్ కొన్ని అంశాల్లో స్పష్టత కోరిందని, వాటికి పాక్ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని ప్రకటనలో పేర్కొన్నారు. గత నవంబర్‌లో అమృత్‌సర్‌లోని నిరంకారీ భవన్‌పై జరిగిన దాడిలో గోపాల్ సింగ్ ప్రధాన నిందితుడు. అలాగే లాహోర్‌లోని గురుద్వారాలోకి భారత అధికారులు ప్రవేశించడాన్నీ ఆయన అడ్డుకున్నారు.
*కారిడార్ నిర్మాణంలోని సాంకేతిక అంశాలపై చర్చించడానికి నిపుణుల సమావేశం ఏప్రిల్ రెండో వారాంతంలో నిర్వహించడానికి భారత్ ప్రతిపాదనలు పంపింది. ఈ అంశంపై ఇరు దేశాలకు చెందిన అధికారులు మార్చి ఆరంభంలో ఇప్పటికే ఓసారి సమావేశమయ్యారు.
**భారత్, పాకిస్థాన్ మధ్య స్నేహ వారధిగా ‘కర్తార్‌పూర్ కారిడార్’ను అభివర్ణిస్తున్నారు. ఈ మార్గం ద్వారా మన సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి పాక్‌లోని కర్తాపూర్‌కు నేరుగా రాకపోకలు సాగించడానికి వీలు కలుగుతుంది. కర్తార్‌పూర్ సాహిబ్ అనేది పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో రావి నది ఒడ్డున ఉన్న ఓ ప్రముఖ గురుద్వారా. సిక్కులు దీన్ని పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. సిక్కుల మతగురువు గురునానక్ తన జీవితంలోని చివరి 18 ఏళ్లు ఇక్కడే గడిపారు. ఇక్కడే తుదిశ్వాస విడిచారు.
views: 756