Current Affairs Telugu Daily

ఆరు నెలలు సర్వీసు మిగిలి ఉన్న అధికారులను కూడా డీజీపీ పోస్టు కోసం పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశం 

పోలీసు సంస్కరణలకు సంబంధించి గత ఏడాది ఇచ్చిన తీర్పునకు సుప్రీం కోర్టు మర్చి 13న సవరణ చేసింది. కనీసం ఆరు నెలలు సర్వీసు మిగిలి ఉన్న అధికారులను కూడా డీజీపీ పోస్టు కోసం పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.
*ఈ హోదా కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) చేసే సిఫార్సులు, నియామక ప్యానల్‌ కూర్పు మొత్తం ప్రతిభ ఆధారంగా సాగాలని స్పష్టంచేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ డీజీపీ ప్రకాశ్‌ సింగ్‌ వేసిన పిటిషన్‌ ఆధారంగా సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కనీసం రెండేళ్లు సర్వీసు ఉన్నవారిని మాత్రమే డీజీపీ పోస్టులో నియామకం కోసం యూపీఎస్‌సీ పరిగణనలోకి తీసుకోవాలని గత ఏడాది జులై 3న ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.
*ఒక అధికారిని తొలుత తాత్కాలిక డీజీపీగా నియమించి, ఆయన పదవీవిరమణ చేసే రోజున పూర్తిస్థాయి బాధ్యతలు ఇచ్చే పద్ధతిని కొన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని కేంద్రం అప్పట్లో తెలిపింది. దీంతో డీజీపీకి కనీసం రెండేళ్ల పదవీకాలం ఉండాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సదరు అధికారి పదవీ విరమణ తర్వాత కూడా రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులెవ్వరినీ తాత్కాలిక డీజీపీలుగా నియమించరాదని సుప్రీం కోర్టు నాడు స్పష్టంచేసింది. ప్రతిభ, సీనియార్టీకి వెయిటేజీ ఇస్తూనే రెండేళ్ల పాటు సర్వీసు ఉంటేనే డీజీపీలుగా నియమించాలని తీర్పు చెప్పింది.
*అయితే సుప్రీం కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రకాశ్‌ సింగ్‌ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నిబంధన పేరుతో సమర్థత, నిజాయతీ ఉన్న అనేక మంది సీనియర్‌ అధికారులను పరిగణనలోకి తీసుకోవడంలేదని ఆరోపించారు. రెండేళ్ల కన్నా తక్కువ సర్వీసు మిగిలి ఉందన్న సాకుతో యూపీఎస్‌సీ కూడా ఈ అధికారుల పేర్లను పరిశీలనకు తీసుకోవడంలేదన్నారు. బిహార్‌ డీజీపీ ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పారు. కొన్నేళ్ల కిందట ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి, భాజపాలో చేరారని చెప్పారు. ఆయనను తర్వాత పోలీసు శాఖలోకి తిరిగి తీసుకొన్నారని, ఇప్పుడు డీజీపీగా నియమించారని తెలిపారు.


views: 810



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams