Current Affairs Telugu Daily

రఫేల్‌ కేసులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం
రఫేల్‌ ఒప్పందానికి సంబంధించి పిటిషన్లు సమర్పించిన దస్త్రాల్లో దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. దేశ భద్రతను ప్రమాదంలో పడేసి ఈ దస్త్రాలను బహిర్గతం చేశారని పిటిషనర్లపై కేంద్రం దుయ్యబట్టింది. రఫేల్‌ పత్రాల చోరీపై కేంద్రం  సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.
*ప్రభుత్వ అనుమతి లేకుండా కీలక దస్త్రాల నకళ్లను సంపాదించడం చోరీతో సమానమని అఫిడవిట్‌లో ఆరోపించింది. ఈ చర్య దేశ భద్రత, సార్వభౌమత్వం, విదేశాలతో సత్సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఇందుకు గానూ పిటిషనర్లు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, ప్రశాంత్‌ భూషణ్‌లపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. 
*రఫేల్‌ ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుందంటూ దాఖలైన వ్యాజ్యాలను గత డిసెంబరు 14న సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును పునః సమీక్షించాలంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరి, సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌లు సంయుక్త పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
*రఫేల్‌ ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుందంటూ ఎనిమిది పేజీల నివేదికను ప్రశాంత్‌ భూషణ్‌ న్యాయస్థానానికి అందజేశారు. పాత్రికేయుడు, ద హిందూ పబ్లిషింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.రామ్‌ రాసిన కథనాలను ఊటంకిస్తూ ఆయన వాదనలు వినిపిస్తుండగా అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ స్పందించారు. ‘రక్షణశాఖ నుంచి రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన రహస్య పత్రాలు చోరీకి గురయ్యాయి. సరిగ్గా వాటిలోని వివరాల ఆధారంగానే ఈ కథనాలు ఉన్నాయి. భూషణ్‌ వాదనలు కూడా తస్కరణకు గురైన డాక్యుమెంట్ల ఆధారంగా ఉన్నాయి’ అని వేణుగోపాల్‌ అన్నారు.

views: 661

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams