సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్‌గా జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. సుప్రీంకోర్టుకు వచ్చే కేసుల్లో పేదలకు అవసరమైన న్యాయ సాయం చేసే బాధ్యతను ఈ కమిటీ చూస్తుంది. *సర్వోన్నత న్యాయస్థాన జడ్జీల్లో 3వ అత్యంత సీనియర్ న్యాయమూర్తికి ఈ కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించడం అనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు జస్టిస్ ఎన్వీ రమణను ఛైర్మన్‌గా నియమించారు.
*పేద కక్షిదారులకు ఉచిత న్యాయ సాయం చేయడం, వారికి తగిన న్యాయం జరిగేలా చట్టాలు, పథకాలు, అవకాశాలపై అవగాహన కల్పించడం లాంటి వాటిని ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
*తమకు న్యాయ సాయం కావాలని ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారికి తొలుత డైరీ నెంబర్ ఇస్తారు. వారు సమర్పించిన దస్తావేజులన్నీ సరిగా ఉంటే సదరు వ్యక్తికి అర్హత ఉందా? లేదా? అన్న బాధ్యతను స్క్రీనింగ్ కమిటీకి అప్పగిస్తారు. అర్హత ఉందని కమిటీ తేలిస్తే, సదరు వ్యక్తి న్యాయ సాయం పొందకముందు సుప్రీంకోర్టులో ఎలాంటి కేసు దాఖలు చేయలేదని నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి లీగల్ సర్వీసెస్ కమిటీ ఒక ధ్రువపత్రం తీసుకుంటుంది.
*ఒక వేళ దరఖాస్తుదారుడు అప్పటికే సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసి ఉంటే అతని దస్తావేజులన్నీ కమిటీ వెనక్కు ఇచ్చేస్తుంది. ఒక వేళ చేయకపోతే ఈ లీగల సర్వీసెస్ కమిటీ పిటిషన్ దాఖలు చేయడానికి అడ్వొకేట్ ప్యానల్‌ను నియమిస్తుంది. ఆ అడ్వొకేటే పిటిషన్ దాఖలు చేస్తారు. కేసు వివరాలను లీగల్ సర్వీసెస్ కమిటీ ఎప్పటికప్పుడు దరఖాస్తుదారుడికి అందజేస్తుంది.
*సుప్రీంకోర్టులో ఆ కేసు ఎప్పుడు విచారణకు వస్తుంది, విచారణ ఏ స్థాయిలో ఉందన్నది ఎప్పటికప్పుడు చెబుతుంది. విచారణ ముగిసేంత వరకూ సదరు దరఖాస్తుదారుడి కేసు పర్యవేక్షణ బాధ్యతను ఈ లీగల్ సర్వీస్ కమిటీయే పర్యవేక్షిస్తుంది.
views: 792