పురావస్తు ప్రదర్శనశాలల్లో కళాఖండాల ఫొటో, వీడియో చిత్రీకరణకు రుసుము
పర్యాటక ప్రసిద్ధి చెందిన ప్రాంతాల వద్ద ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శనశాల్లోని కళాఖండాల ఫొటోలు, వీడియోలను వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవాలంటే ఇకపై డబ్బులు చెల్లించాలని భారత పురావస్తు అధ్యయన సంస్థ(ASI) నూతన ఛాయాచిత్ర, చిత్రీకరణ విధానాన్ని తీసుకొచ్చింది. పురావస్తు ప్రదర్శనశాలల్లోని కళాకృతుల ఫొటోలను వాణిజ్య అవసరాలకు వినియోగించుకునేందుకు సందర్శకులు ఒక్కో ఫొటోకు రూ.750 చొప్పున చెల్లించాలని అందులో పేర్కొంది. రుసుము చెల్లించిన అనంతరం సంబంధిత ఫొటోలను తామే వినియోగదారులకు ఈ-మెయిల్ ద్వారా పంపిస్తామని వెల్లడించింది. వాటి ప్రచురణ, ప్రదర్శన సమయంలో ASIకి వినియోగదారులు తప్పనిసరిగా సమాచారం అందించాలని సూచించింది. ఆయా పురావస్తు ప్రదర్శనశాలల ప్రాంగణాల్లో చిత్రీకరణకు రోజుకు రూ.50 వేల చొప్పున వసూలు చేయనున్నట్లు ASI వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సొంత వనరులతో చిత్రీకరణ జరిపితే వాటి నుంచి రుసుములు వసూలు చేయబోమని తెలిపింది. దేశవ్యాప్తంగా పర్యాటక ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లోని 46 పురావస్తు ప్రదర్శనశాలల్లో సెల్ఫీస్టిక్ వినియోగాన్ని ASI నిషేధించింది.
ASI-Archaeological Survey of India
views: 1134