Current Affairs Telugu Daily

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉగ్రవాదులను కట్టడి చేసే 1267 తీర్మానానికి భారత్ రెడీ

బాలాకోట్‌లోని జైషే మహమ్మద్‌ ఉగ్రశిబిరంపై దాడి చేసిన భారత్‌ ఇప్పుడు పాక్‌పై దౌత్య ఒత్తిడి పెంచుతోంది. ఇందుకోసం భారత్‌ తిరుగులేని వ్యూహాన్ని అమలు చేస్తోంది. అన్నీ ప్రణాళిక ప్రక్రారం సాగితే జైషేను ఐరాస ఆంక్షల చట్రంలో బంధించవచ్చు. ఈ దిశగా భారత్‌ అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ వెతుకుతోంది. చాకచక్యంగా దౌత్యనీతిని ప్రయోగిస్తూ ముందుకెళుతోంది.
భారత్‌ ఎంచుకొన్న మార్గాలు ఇవే..
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉగ్రవాదులను కట్టడి చేసే 1267 తీర్మానాన్ని జేఈఎం, మసూద్‌కు వ్యతిరేకంగా ప్రతిపాదించారు. ఈ తీర్మానం మార్చి 13న భద్రతా మండలి ఎదుటకు రానుంది. 1267 కమిటీలోని 15 సభ్యదేశాలు భద్రతా మండలిలో కూడా ఉంటాయి. ఇప్పటికే భారత్‌ కీలకమైన అన్ని దేశాలతో భేటీ అయింది. ఈ సందర్భంగా యూఎన్‌ఎస్‌సీలోని ఆ దేశాల ప్రతినిధులు 1267 తీర్మానానికి మద్దతు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కమిటీలో అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, రష్యా,చైనాతో పాటు బెల్జియం, ఐవరీ కోస్ట్‌, డొమినికన్‌ రిపబ్లిక్‌, ఈక్వెటోరియల్‌ గునియా, జర్మనీ, ఇండోనేషియా, కువైట్‌, పెరూ, పోలండ్‌, దక్షిణాఫ్రికాలు ఉన్నాయి. వీరందరి మద్దతుతో తీర్మానాన్ని నెగ్గించుకునే ప్రయత్నాల్లో ఉంది భారత్‌. ఇదికాకుండా, ఎఫ్‌ఏటీఎఫ్‌లోనూ పాక్‌కు చుక్కెదురయ్యేలా చేయాలని నిశ్చయించుకుంది.  
1267 తీర్మానంలో ఏముందంటే..
యూఎన్‌ఎస్‌సీలో ఫ్రాన్స్‌, యూకే, అమెరికాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. జైషే మహమ్మద్‌కు ఆర్థికంగా అండదండలనందిస్తున్న వ్యక్తిగా మసూద్‌ పేరును పేర్కొన్నారు. దీంతోపాటు అఫ్గానిస్థాన్‌లో పశ్చిమదేశాల సేనలతో పోరాడుతున్నట్లు, జీహాదీలను నియమించుకొంటున్నట్లు, ఫిబ్రవరి 14 పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడికి కారణమైనట్లు జైషేపై అభియోగాలను నమోదు చేశారు.
భారత్‌ ఏం చేస్తోంది..
ఇప్పటివరకూ ఐరాస భద్రతా మండలిలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని  మూడు సార్లు తీర్మానాలు ప్రవేశపెట్టారు. కానీ పాక్‌కు సన్నిహిత దేశం చైనా సాంకేతిక కారణాలు చూపి వాటిని అడ్డుకొంది. పాక్‌ను ఆంక్షల చట్రంలో పడిపోకుండా కాపాడింది. కానీ ఈసారి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తీర్మానం ప్రవేశపెట్టనున్న కొద్ది రోజుల ముందు చైనాను సందర్శించారు. అక్కడి నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ ‘ఈసారి సానుకూలత కనబడొచ్చు. పాకిస్థాన్‌ భారీ మూల్యం చెల్లిస్తుంది’ అంటూ నర్మగర్భంగా మాట్లాడారు. సుష్మా ఇటీవలి పర్యటనతో చైనా సమీకరణాల్లో మార్పు చోటు చేసుకోవచ్చన్నది భారత్‌ ఆశ. ఇదే సమయంలో గతంలో అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలోకెక్కిన హఫీజ్‌ సయీద్‌పై ఆంక్షలనూ కూడా పక్కాగా అమలు చేయాలని భద్రతామండలి పాక్‌ను అడిగే అవకాశం ఉంది.  
అక్కరకొస్తున్న భారత్‌ పరపతి..
భారత్‌ అతిపెద్ద ఆయుధ దిగమతిదారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, యూకే వంటి దేశాలకు ఆయుధ వ్యాపారం అత్యంత కీలకమైంది. భారత్‌ వీటికి మంచి కస్టమర్‌. ఆయా దేశాలకు కావల్సిన మార్కెట్‌ భారత్‌లో ఉన్నప్పుడు అవి పాక్‌కు మద్దతివ్వడం చాలా కష్టం. ఇప్పటికే వాణిజ్య యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న చైనా, కొత్తగా భారత్‌తో లేనిపోని వైరం కొనితెచ్చుకొనే పరిస్థితిలో లేదు. అదే జరిగితే భౌగోళిక రాజకీయాల్లోనూ, వ్యాపారంలోనూ చైనా మరింత దెబ్బతినే అవకాశం ఉంది. గతంలో హఫీజ్‌ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే సమయంలో కూడా చైనా ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గింది.
మరోపక్క పాక్‌కు మద్దతుగా సౌదీ అరేబియా ఇప్పటి వరకు స్పందించలేదు. దీనికి ప్రధాన కారణం ఉంది. భారత్‌ కొనుగోలు చేసే చమురులో అత్యధిక భాగం సౌదీ నుంచే వస్తోంది. కానీ ఇటీవల ఇరాన్‌ వైపు భారత్‌ మొగ్గు చూపడంతో సౌదీకి గిరాకీ తగ్గింది. మరోపక్క అమెరికా కూడా స్వయంగా చమురు ఉత్పత్తి చేస్తుండటంతో సౌదీ ఆదాయంపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో భారత్‌ వ్యతిరేక చర్యలకు మద్దతిచ్చే సాహసం సౌదీ అరేబియా కూడా చేయకపోవచ్చు. ఇప్పటికే ఇరాన్‌, అఫ్గాన్‌లు కూడా పాక్‌కు వ్యతిరేకంగా కారాలు మిరియాలు నూరుతున్నాయి.
వేలాడుతున్న ఎఫ్ఏటీఎఫ్‌ కత్తిః
ఇప్పటికే పాకిస్థాన్‌ ఎఫ్‌ఏటీఎఫ్‌ (ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ ) గ్రే లిస్ట్‌లో ఉంది. ప్రస్తుతం పాక్‌ చర్యలను టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ వాచ్‌డాగ్‌ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. పాక్‌కు సూచించిన 27 అంశాలను అమలు చేయడంలో ఏమాత్రం విఫలమైనా బ్లాక్‌ లిస్ట్‌లో చేరిపోతుంది. ఇప్పటికే ఆర్థికంగా చితికి పోయిన పాకిస్థాన్‌కు ఇది కచ్చితంగా శరాఘాతమే. భారత్‌ కూడా పాక్‌ ఉల్లంఘనలను జాగ్రత్తగా ఏర్చికూర్చి ఎఫ్‌ఏటీఎఫ్‌కు అందజేస్తే బ్లాక్‌లిస్ట్‌ను తప్పించుకోవచ్చనే పాక్‌ కలలు కల్లలుగానే మిగిలిపోతాయి. 
ఏదేమై, ఉగ్రవాదాన్ని పెంచి పోషించి, పొరుగుదేశం శాంతిని హరించే పాక్‌కు.. 1267 తీర్మానం తగిన బుద్ధి చెబుతుందా, లేదా అన్నది మరో వారంలో తేలిపోతుంది. అదే జరిగితే, ఉగ్రవాదం ఆర్థిక మూలాల్ని కుప్పకూల్చే ప్రక్రియకు బలమైన పునాది పడినట్టు అవుతుంది.


views: 863

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams