Current Affairs Telugu Daily

అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్‌

 అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. మధ్యవర్తి నియామకంపై ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌లో పెడుతున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.
‘ఇది కేవలం భూ వివాదం మాత్రమే కాదు. మత విశ్వాసానికి, భావోద్వేగానికి సంబంధించిన అంశం. గతాన్ని మనం మార్చలేం. ఎవరు కూల్చారు.. ఎవరు రాజు.. ఆలయమా.. మసీదా అన్నది ఇప్పుడు అప్రస్తుతం. ప్రస్తుత వివాదాన్ని మాత్రమే మేం పరిగణనలోకి తీసుకుంటాం. ఆ వివాదాన్ని పరిష్కరించాలని చూస్తాం. సమస్య పరిష్కారానికి ఒకరి కంటే ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరం అని భావిస్తున్నాం’ అని జస్టిస్‌ బోబ్డే అన్నారు.
కాగా మధ్యవర్తిని ఏర్పాటు చేయడంపై హిందూ సంఘాలు వ్యతిరేకత చూపిస్తుండగా ఇస్లాం వర్గీయులు సుముఖత తెలియజేస్తున్నారు. ‘మధ్యవర్తిని నియమించడం మాకు అంగీకారమే. పరిష్కారమేదైనా అది ఇరు వర్గాలను కలిపి ఉంచాలి’ అని ముస్లిం పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ కోర్టుకు తెలిపారు. అటు యూపీ ప్రభుత్వం కూడా మధ్యవర్తి నియామకాన్ని వ్యతిరేకించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదని పేర్కంది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ఈ అంశంపై తీర్పును న్యాయస్థానం రిజర్వ్‌లో పెట్టింది. అయితే ఒకవేళ సమస్యను మధ్యవర్తికి అప్పగించేలా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటే గనుక ఇరు పక్షాలు మధ్యవర్తుల పేర్లు సూచించాలని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ స్పష్టం చేశారు.  
2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వ్యక్తులు, ధార్మికసంస్థల తరఫున 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి 


views: 832Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams