Current Affairs Telugu Daily

24 పాక్‌ యుద్ధ విమానాలకు 8 జెట్‌లతో భారత్‌ జవాబు

తమ దేశంలోని ఉగ్రవాద శిబిరంపై భారత్‌ జరిపిన వైమానిక దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాక్‌ ఏకంగా 24 యుద్ధవిమానాలను పంపింది. నియంత్రణ రేఖ దాటి మనదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఆ జెట్‌లను మన దేశానికి చెందిన 8 లోహ విహంగాలు అడ్డుకున్నాయి. ఇందులో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ పైలట్‌గా వ్యవహరిస్తున్న మిగ్‌-21 బైసన్‌ కూడా ఉంది. ఈ విమానమే ముందుగా పాకిస్థాన్‌ యుద్ధవిమానాలను వెంబడించింది. ఆ దేశ ఎఫ్‌-16 జెట్‌ను కూల్చేసింది. ఇందుకోసం ఆర్‌-73 క్షిపణిని ఉపయోగించింది. కూలిన పాక్‌ యుద్ధవిమానాన్ని ఈ ఎఫ్‌-16కు సంబంధించిన ‘డి’ వెర్షన్‌గా భావిస్తున్నారు. ఇందులో రెండు సీట్లు ఉంటాయి.
*పాకిస్థాన్‌ వైమానిక దాడి బృందంలో ఎనిమిది ఎఫ్‌-16లు, నాలుగు మిరాజ్‌-3, జెఎఫ్‌-17 యుద్ధవిమానాలు ఉన్నాయి. మిగతా జెట్‌లు వాటికి రక్షణగా వచ్చాయి. ఇవన్నీ ఒక ‘ఫార్మేషన్‌’లో బయలుదేరాయి.
గుర్తించిన భారత బలగాలు
*వీటిని అడ్డుకునేందుకు భారత్‌కు చెందిన 8 యుద్ధవిమానాలు రంగంలోకి దిగాయి. అందులో నాలుగు సుఖోయ్‌-30, రెండు మిరాజ్‌-2000లు, రెండు మిగ్‌-21 బైసన్‌లు ఉన్నాయి.
దాడికి యత్నంః
దాడి అనంతరం వెనుదిరుగుతున్న పాక్‌ వైమానిక సమూహాన్ని భారత జెట్‌లు వెంబడించాయి. అందులో అభినందన్‌ నడుపుతున్న మిగ్‌-21 కూడా ఉంది. ఆయన తన విమానంలోని రాడార్‌కు పాక్‌ ఎఫ్‌-16ను లక్ష్యంగా నిర్దేశిస్తూ ‘లాక్‌’ చేశారు. సమీపంలోనే పాక్‌కు చెందిన మరిన్ని యుద్ధవిమానాలు ఉన్నాయని ఆయన సహచర పైలట్లు హెచ్చరించినా అభినందన్‌ వెరవలేదు. తన విమానం నుంచి ఆర్‌-73 క్షిపణిని ప్రయోగించారు. అది తగిలి పాక్‌ ఎఫ్‌-16 కూలింది.

  • మిగ్‌-21లను ఎందుకు పంపారు?

భారత్‌ వద్ద సుఖోయ్‌-30, మిరాజ్‌-2000 వంటి మెరుగైన యుద్ధవిమానాలు ఉండగా అధునాతనమైన ఎఫ్‌-16ను ఎదుర్కోవడానికి పాతబడిపోయిన మిగ్‌-21ను ఎందుకు పంపారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే మిగ్‌-21 పాతదే అయినప్పటికీ దానిలో వేగంగా స్పందించే లక్షణం ఉందని వైమానిక దళ వర్గాలు చెబుతున్నాయి. పైగా పాక్‌ చొరబాటు జరిగిన ప్రదేశానికి చేరువలో శ్రీనగర్‌ వైమానిక స్థావరం ఉంది. అందువల్ల అక్కడి నుంచి బయలుదేరిన మిగ్‌-21లే మొదట పాక్‌ విమానాలకు చేరువయ్యాయి.
*పాక్‌ ఈ దశలో అభినందన్‌ విమానంతోపాటు ఆయనకు ‘వింగ్‌మ్యాన్‌’గా వ్యవహరిస్తున్న మరో యుద్ధవిమానం ప్రమాదంలో పడింది. శత్రుదాడికి అవి తేలిక లక్ష్యాలయ్యాయి. ఈ అవకాశాన్ని  ఉపయోగించుకుంటూ పాక్‌ ఎఫ్‌-16లు రెండు ఏఎంఆర్‌ఏఏఎం (అడ్వాన్స్డ్‌ మీడియం రేంజ్‌ ఎయిర్‌ టు ఎయిర్‌ మిసైల్‌) క్షిపణులను ప్రయోగించాయి. ఇందులో ఒకటి అభినందన్‌ యుద్ధవిమానాన్ని ఢీ కొట్టింది. రెండోది ‘వింగ్‌మ్యాన్‌’ విమానం పక్కగా దూసుకెళ్లింది. దీంతో అభినందన్‌ పారాచూట్‌ సాయంతో బయటపడ్డారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దిగారు. ఆయనను పాక్‌ సైన్యం బందీగా తీసుకుంది.


views: 840

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams