Current Affairs Telugu Daily

 గత నాలుగున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి
శాసనసభలో బడ్జెట్‌ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు,కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులను సీఎం తులనాత్మకంగా    వివరించారు. గత నాలుగున్నరేళ్లలో సాధించిన ప్రగతిని శాఖల వారీగా ప్రస్తావించారు
  • ఆర్థిక పరిస్థితి
* అప్పుడు: సమైక్య పాలనలో చివరి రెండేళ్లలో అంటే 2012-13, 2013-14లలో తెలంగాణ ప్రాంత జీఎస్‌డీపీ వృద్ధి రేటు దేశ సగటు కంటే తక్కువ. ఆ రెండేళ్లలో దేశ సగటు వృద్ధి రేటు 5.9 శాతం కాగా, తెలంగాణ ప్రాంత సగటు వృద్ధి రేటు కేవలం 4.2 శాతం. 
* ఇప్పుడు: 2017-18లో వృద్ధిరేటు 10.4 శాతం కాగా, 2018-19లో 10.6 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలను స్వయానా కేంద్ర గణాంక సంస్థ వెల్లడించింది. ఐదు సంవత్సరాల అనతి కాలంలో ఈ చెప్పుకోదగ్గ అభివృద్ధి, మా ప్రభుత్వ విధానాలకు, పనితీరుకు నిదర్శనం.
  • ఆసరా పింఛన్లు
* అప్పుడు: ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం అనేకమందిని అసహాయులుగా మార్చింది. వారికి గత ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద కొన్నాళ్లు రూ.75, మరికొన్నాళ్లు రూ.200 మాత్రమే ఇచ్చేవారు. అది ఎవరికీ సరిపోయేది కాదు. 
* ఇప్పుడు: ఇది సరైన విధానం కాదని భావించి, తెలంగాణ ఏర్పడిన వెంటనే వృద్ధులు, వితంతులకు ఇచ్చే పింఛన్లను రూ.200 నుంచి రూ.1000కు పెంచాం. దివ్యాంగుల పింఛన్‌నురూ.1500కు పెంచాం.
ప్రతి ఒక్కరికీ బియ్యం
  • ప్రతి ఒక్కరికీ బియ్యం
* అప్పుడు: రేషన్‌ దుకాణాల ద్వారా అందించే బియ్యంపై గత ప్రభుత్వాలు కోటా పరిమితిని అమలుచేసేవి. 
* ఇప్పుడు:  మేము కోటా పరిమితిని ఎత్తేసి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి రూపాయికి కిలో చొప్పున రేషన్‌ బియ్యాన్ని అందజేస్తున్నాం. విద్యార్థులందరికీ వసతిగృహాల్లో, మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో వండిన అన్నాన్ని పెడుతున్నాం.
  • నీటిపారుదల
* అప్పుడు:  సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి విషయంలో జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. 
* ఇప్పుడు: నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న వాటాను సమర్థంగా వినియోగించుకొని 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తోంది. గతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి దశాబ్దాల కాలం పట్టేది. మా ప్రభుత్వం నాలుగేళ్లలోనే 90 శాతం నిర్మాణ పనులు పూర్తి చేసింది. తలపెట్టిన అన్ని ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, పరిపాలనా అనుమతులను వివిధ కేంద్ర ప్రాధికారిక సంస్థల నుంచి పొందింది.
  • గోదాముల నిర్మాణం
* అప్పుడు:  తెలంగాణ ఏర్పడే నాటికి: రాష్ట్రంలో 4.17 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాములే ఉండేవి. 
* ఇప్పుడు: పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. కొత్తగా 364 గోదాములు నిర్మించి, 22.50 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములను అందుబాటులోకి తెచ్చింది.
  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్ఠి
* అప్పుడు: ఉమ్మడి పాలనలో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం, కులవృత్తుల పట్ల అనాదరణ కారణంగా గ్రామీణ జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. వృత్తి నైపుణ్యం ఉన్న తెలంగాణ బిడ్డలు పట్టణాలు, పరదేశాలు వెళ్లి బతకాల్సిన దుస్థితి నెలకొంది. 
* ఇప్పుడు: ఈ పరిస్థితుల్లో మార్పు రావడం కోసం  తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక    కార్యాచరణ రూపొందించింది. వివిధ కులవృత్తులకు ఆర్థిక ప్రేరణ అందించి, వాటికి పునరుత్తేజం కలిగించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది.
  • గురుకులాలు
* అప్పుడు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకోసం కేవలం 296 గురుకులాలు మాత్రమే అరకొర వసతులతో ఉండేవి. 
* ఇప్పుడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అన్ని హంగులతో, రికార్డు స్థాయిలో 542 కొత్త గురుకులాలు ఏర్పాటు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీసీలకోసం మరో 119 రెసిడెన్షియల్‌ స్కూళ్లను  ప్రారంభించబోతోంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకోసం 51 డిగ్రీ గురుకులాలను కూడా ప్రారంభించింది.  
  • ప్రజారోగ్యం
* అప్పుడు: సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని పది జిల్లాల్లోగల ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించే మందుల కొనుగోలు కోసం కేవలం రూ.146 కోట్లు మాత్రమే ఇచ్చేవారు.
* ఇప్పుడు: తెలంగాణ రాష్ట్రంలో ఈ మొత్తాన్ని మూడింతలు పెంచి ఏటా రూ.440 కోట్లు మందుల కొనుగోలు కోసం వ్రెచ్చిస్తోంది. 40 ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎంఆర్‌ఐ, సీటీస్కాన్‌, డిజిటల్‌ రేడియాలజీ, టూడిఎకో తదితర అత్యాధునిక పరికరాలను వివిధ దవాఖానాలలో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జిల్లా, ఏరియా ఆసుపత్రులలో ఐసీయూ కేంద్రాల సంఖ్య కూడా పెంచాం. దేశవ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సేవలందించే మూడు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.
  • హరితహారం
* అప్పుడు: గత పాలకుల నిర్వాకం వల్ల తెలంగాణలో అడవులు క్షీణించాయి. పచ్చదనం బాగా తగ్గిపోయింది. పర్యావరణ సమస్యలు తీవ్రమయ్యాయి. 
* ఇప్పుడు: తెలంగాణ భూ భాగంలో 33 శాతం పచ్చదనం సాధించేందుకు ప్రభుత్వం తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తోంది.

views: 976Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams