Current Affairs Telugu Daily

సర్కారు దవాఖానలకు ర్యాంకింగ్స్‌
రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును మెరుగుపరిచేందుకుగాను వాటిలో పోటీతత్వం పెంచేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రతినెలా వివిధ జిల్లాల్లోని ఆస్పత్రులు ప్రజలకు అందించే వైద్యసేవల ఆధారంగా ఆయా జిల్లాలకు ర్యాంకింగ్స్‌ ఇవ్వాలని నిర్ణయించింది.
*జిల్లాల్లోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రుల్లో 17 అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకింగ్స్‌ ఇవ్వనున్నారు. ప్రతినెలా 12వ తేదీ వరకు నిర్దేశించిన అంశాల్లో పనితీరును ఇందుకు ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ అంశంపై వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితా రాణా ఇటీవలే అన్ని జిల్లాల వైద్యాధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
*వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా మెరుగైన సేవలందించిన సర్కారు ఆస్పత్రులకు స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కింద కాయకల్ప అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ అవార్డులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులను ఎంపిక చేస్తారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ అవార్డులను ఇస్తున్నారు.
*అయితే ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ఇకనుంచి 33 జిల్లాలకు హెల్త్‌ ర్యాంకింగ్స్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్‌ కిట్‌ నుంచి టీబీ పరీక్షల వరకు 17 రకాల అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రతి అంశానికి సంబంధించి మెరుగైన పనితీరు ఆధారంగా మార్కులిస్తారు.
  • అంశాలు.. మార్కులు
మొత్తం 100 మార్కులుంటాయి. కేవలం కేసీఆర్‌ కిట్‌కే 35 మార్కులు ఇవ్వనున్నారు. కేసీఆర్‌ కిట్‌లో 5 అంశాలున్నాయి. యాంటీనాటల్‌ చెకప్‌, రిజిష్ట్రేషన్‌కు 10 మార్కులు, నాలుగో ఏఎన్‌సీకి 5 మార్కులు ఇస్తారు. ప్రసవాల శాతం ఆధారంగా 15 మార్కులు, సాధారణ ప్రసవాలకు 5 శాతం మార్కులు కేటాయిస్తారు.
ఇక క్షయ నివారణకు 10 మార్కులు, ఆర్బీఎ్‌సకే స్ర్కీనింగ్‌, ఐయూసీడీకి 5 చొప్పున కేటాయిస్తారు. కాగా ఓపీడీ, ఇమ్యునైజేషన్‌, దంతపరీక్షలు, కుటుంబ నియంత్రణ, ఎన్‌హెచ్‌ఎం నిధుల వినియోగానికి 15 మార్కుల చొప్పున ఇస్తారు.
జనవరిలో వంద మార్కులకుగాను కామారెడ్డి జిల్లా 76.9 శాతం మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం రెండోస్థానం, ఆదిలాబాద్‌ మూడో స్థానం, పెద్దపల్లి నాలుగో స్థానం, వరంగల్‌ అర్బన్‌ ఐదో స్థానంలో నిలిచాయి. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కేవలం 50 శాతం మార్కులతో చిట్టచివరిగా 33వ స్థానం పొందింది

views: 976



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams