Current Affairs Telugu Daily

 ట్రేడింగ్‌లో 71.51 వద్ద కనిష్ఠానికి చేరిన రూపాయి విలువ 
రూపాయి కలవరం మళ్లీ మొదలైంది. గత ఏడాది చివర్లో బలపడి కుదుటపడినట్టే కనిపించిన భారత మారకం.. కొత్త ఏడాదిలో తిరిగి క్షీణిస్తూ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతోంది. ఒక పక్క చమురు ధరలు పెరగడం, మరో పక్క కశ్మీర్‌ ఉద్రిక్తతలు, రాబోయే సాధారణ ఎన్నికలు వంటి పరిణామాలు రూపాయి క్షీణతకు ఆజ్యం పోస్తున్నాయి. సమీప భవిష్యత్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి రూ.75కు పడిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం తప్పకపోవచ్చు.
*కొత్త ఏడాదిలో రూపాయి మారకం విలువ ఇప్పటికే 2.4 శాతం క్షీణించింది. 18 ఫిబ్రవరి 2019 న ట్రేడింగ్‌లో 71.51 వద్ద కనిష్ఠానికి చేరిన రూపాయి జనవరి ప్రారంభంలో 69.23 దగ్గర బలంగా ఉంది. డిసెంబరు త్రైమాసికంలో ఆసియాలోనే మెరుగ్గా రాణించిన కరెన్సీగా రూపాయి నిలిచింది. అయితే ఇంతలోనే పరిస్థితులు తలకిందులయ్యాయి. పెరిగిన ముడిచమురు ధరలతో రూపాయికి మళ్లీ కష్టకాలం మొదలైంది.
*తాజాగా మొదలైన కశ్మీర్‌ ఉద్రిక్తతలు సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీస్తున్నాయి. ఒకపక్క అమెరికా- చైనాల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలతో ప్రధాన కరెన్సీలు పరుగులు తీస్తుంటే రూపాయి మాత్రం ఉసూరుమనిపిస్తోంది.
*కశ్మీర్‌లో పరిస్థితులు మరింత దిగజారితే రూపాయి త్వరలోనే 73 తాకొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత వారం పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం.. భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. సౌదీ అరేబియా, రష్యా సహా ఒపెక్‌ దేశాలు ఉత్పత్తి కోతలతో ఈ ఏడాది ముడిచమురు ధరలు 20 శాతానికి పైగా దూసుకెళ్లాయి. వెనెజువెలా, ఇరాన్‌లపై అమెరికా ఆంక్షలతో సరఫరా సమస్యలు సైతం ఇందుకు తోడయ్యాయి.
  • రూపాయి×రూపియా
ఈ ఏడాది ఇండోనేషియా, భారత్‌ల కరెన్సీల పనితీరు పరిశీలిస్తే రూపియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు విదేశీ ఫండ్‌ సంస్థల నుంచి ఇండోనేషియా షేర్లు, బాండ్లు దాదాపు 3 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.21000 కోట్లు) సమీకరించాయి. ఇదే సమయంలో భారత్‌ నుంచి దాదాపు 100 మిలియన్‌ డాలర్లు (రూ.700 కోట్లు) వెనక్కి వెళ్లాయి. రెండో సారి మోదీ విజయం సాధించకుంటే రూపాయి 75 ఎగువకు బలహీనపడొచ్చని ఐఎన్‌జీ గ్రూప్‌ ఆర్థికవేత్త ప్రకాశ్‌ సక్పాల్‌ అంటున్నారు.
*మోర్గాన్‌ స్టాన్లీ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించింది. సాధారణ ఎన్నికలకు ముందు మరింత బలహీనపడొచ్చని, 74.6 లక్ష్యంగా విక్రయించొచ్చని సిఫారసు చేసింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపియాను చూస్తే.. ఈ ఏడాది దాదాపు 14,000 దరిదాపుల్లో కదలాడొచ్చని, ఎన్నికలకు ముందు 14,300- 14,400 వరకు బలహీనపడొచ్చని సక్పాల్‌ తెలిపారు. రెండోసారి జోకోవి విజయం సాధిస్తే మదుపర్లు భారీగా పెట్టుబడులు చొప్పించే అవకాశం ఉంది. ఫెడ్‌ రేట్ల పెంపు వేగాన్ని తగ్గించడం, డాలర్‌ జోరు తగ్గడం వల్ల రూపాయి, రూపియాలు రెండూ లబ్ది పొందనున్నాయి.

views: 864

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams