Current Affairs Telugu Daily

తెలంగాణ రాష్ట్ర ఓట్‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆర్థికశాఖ సిద్ధం
రాష్ట్ర ఓట్‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆర్థికశాఖ సిద్ధమైంది. పరిమిత కాలానికి ఆమోదించే బడ్జెట్‌ అయినా 2019-20వ సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌కు ప్రతిరూపంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌తోపాటు ఇతర తోడ్పాటు, పన్నుల వాటాకు సంబంధించిన సమగ్ర వివరాలు అందే అవకాశం లేకపోవడంతో ఈ అంశాలపై ప్రాథమిక అంచనాలతో బడ్జెట్‌ రూపొందించనున్నారు. రాష్ట్ర రాబడి అంచనాల్లో 19 శాతం, అంతకంటే ఎక్కువ వృద్ధిరేటు ఉంటుందని ఆర్థికశాఖ విశ్లేషిస్తోంది.
*బడ్జెట్‌ రెండు లక్షల కోట్ల రూపాయలు దాటనున్నట్లు అంచనా. ఈ నెల 22 నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరగనుండటం, మూడు రోజుల పర్యటనకుగాను 18న కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్‌పై కసరత్తును వేగవంతం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన బడ్జెట్‌ ప్రతిపాదనల ఆధారంగా ఆర్థికశాఖ బడ్జెట్‌ ప్రక్రియను పూర్తి చేస్తోంది.
*పూర్తి బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించినా నాలుగు నెలలకు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించనున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలలకు బడ్జెట్‌ను శాసనసభ ఆమోదించనుందని విశ్వసనీయ సమాచారం.
  • సాగునీరు.. సేద్యం.. సంక్షేమం 
*సాగునీటి రంగం, వ్యవసాయం, సంక్షేమం ఈ మూడు శాఖలకు ఈ సారి బడ్జెట్‌లో అత్యధికంగా నిధులు దక్కనున్నాయి. సాగునీటి రంగానికి కనీస మొత్తంగా రూ.25 వేల కోట్లను ప్రతిపాదించనున్నారు.  
* ఇప్పటికే వేగవంతమైన సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాగునీటి శాఖ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు పూర్తిస్థాయి నిధులను అందుబాటులోకి తీసుకురానుంది.  
* రైతుబంధు పథకం పెట్టుబడి రాయితీ ఎకరాకు ఐదువేల రూపాయలకు పెరిగిన నేపథ్యంలో ఈసారి ఈ పద్దు కింద రూ.14 వేల కోట్లకు పైగా కేటాయించనున్నారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమయంలోనే ఖరీఫ్‌కు పెట్టుబడి రాయితీ పూర్తిగా అందించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది.  
* లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేయనున్నట్లు తెరాస ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీన్ని ఎలా అమలు చేసేది ప్రభుత్వం బడ్జెట్‌లో స్పష్టం చేస్తుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. గతంలో లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీని నాలుగు విడతల్లో అమలుచేసింది. 
* ఆసరా పింఛన్ల మొత్తం ఈ సారి పదివేల కోట్ల రూపాయలను దాటనుంది. గత బడ్జెట్‌లో ఆసరా పింఛన్లకు రూ.5,300 కోట్లను కేటాయించింది. ఈ సారి పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేసింది. దీంతో పాటు పింఛన్లు అందచేసే కనీస వయసును తగ్గించనున్నట్లు ప్రకటించింది. వీటిని ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసరా పింఛన్లకు రూ.11 వేల కోట్లకు పైగా కేటాయింపులు దక్కనున్నాయి.  
* ఈసారి బడ్జెట్‌లో వేతనాలకు సంబంధించి కేటాయింపులు పెరగనున్నాయి. వేతన సవరణ సంఘం నేపథ్యంలో ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఇవ్వడంతోపాటు వేతన సవరణ ఒప్పందం అమలు వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టిసారించింది. వేతనాలకు బడ్జెట్‌లో రూ.24,500 కోట్లు కేటాయించగా ఫిట్‌మెంట్‌తోపాటు సాధారణ పెరుగుదల అంశాలను పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు చేయనున్నారు. 
* రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంతోపాటు, గృహ నిర్మాణానికి ఈసారి బడ్జెట్‌లో నిధులు పెరగనున్నాయి. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయింపులు ఉండగా ఈసారి రూ.2500 కోట్లకు చేరనుంది.  
* గురుకుల విద్యకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈసారి నిధులను పెంచనున్నారు. స్కాలర్‌షిప్పులకు కేటాయింపులు సుమారు రూ.3600 వేల కోట్లకు చేరవచ్చని సమాచారం.  
* ఈసారి బడ్జెట్‌లో పట్టణాభివృద్ధికి కూడా కేటాయింపులు పెంచనున్నారు.

views: 880



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams