ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్రాలకు రుణ పరిమితి పెంచాలని పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫార్సు
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో రాష్ట్రాల్లో జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్రం తగిన రీతిలో సాయం చేయడంలేదని వీరప్పమొయిలీ నేతృత్వంలోని ఆర్థికశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం పేర్కొంది. రాష్ట్రాలు అడిగినదానికి, కేంద్రం ఇచ్చే మొత్తానికి మధ్య చాలాతేడా ఉంటోందని స్పష్టం చేసింది. ఇటీవల కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో సంభవించిన వరదలు, గజ, తిత్లీ, పెథాయ్ తుపానులపై అధ్యయనం చేసిన స్థాయీసంఘం తన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. ఎస్డీఆర్ఎఫ్ కార్పస్ ఫండ్‌ను కేంద్రం సంవత్సరానికి 5% మాత్రమే పెంచుతోందని 2020-25 మధ్యకాలంలో ఏటా 15% పెంచుతూపోవాలని సిఫార్సు చేసింది. కేంద్ర బృందాలు పర్యటించి వచ్చేంతవరకూ వేచిచూడకుండా ఎన్డీఆర్ఎఫ్ నుంచి రాష్ట్రాలకు విడుదల చేయాలని పేర్కొంది. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 36 ఉంటే..వాటిలో 27 ప్రకృతివైపరీత్య ప్రమాదం అంచుల్లో ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలో అత్యధిక ముప్పును ఎదుర్కొంటున్న దేశాల్లో భారతదేశం ముందుందని అభిప్రాయపడింది.
వైపరీత్యాల పరిస్థితి ఇలా:
* దేశంలోని 58.6% భూభాగంలో ఓ మోస్తరు నుంచి భారీ భూకంపాలు సంభవించే పరిస్థితి ఉంది.
* 12% వరదలు, 5,700 కిలోమీటర్ల కోస్తాప్రాంతంలో తుపాన్లు, సునామీలకు అవకాశం. 4 కోట్ల హెక్టార్ల భూమి వరద పోటుకు గురవుతోంది.
* 68% వ్యవసాయ భూభాగం కరవు, మంచుతుపాన్లు, కొండచరియలు విరిగిపడే ముప్పు ముంగిట ఉంది.
తీసుకోవాల్సిన చర్యలివీ:
* ఎన్డీఆర్ఎఫ్కి నిధులు సమకూర్చడానికి కొన్ని ప్రత్యేక వస్తువులపై నేషనల్ కెలామిటీ కంటింజెన్సీ డ్యూటీ విధిస్తున్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత సమకూరే నిధులు తగ్గిపోతున్నాయి. 2015-16లో ఈ సుంకం కింద రూ.5,690 కోట్లు వసూలుకాగా, 2018-19 నాటికి అది రూ.2,500 కోట్లకు తగ్గిపోయింది. ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్ దృష్టిసారించాలి.
* ప్రకృతివైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న ఆస్తులను శాశ్వత పునరుద్ధరణకు వీలుగా కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 10% మొత్తాన్ని ఇందుకోసం అదనంగా కేటాయించాలి. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పాలకమండలి సిఫార్సులు చేసే పనులను ఈ మొత్తంతో చేపట్టాలి.
* వైపరీత్యాలకు గురైన రాష్ట్రాలకు తగిన ఆర్థిక వనరులు సమకూర్చడానికి వీలుగా వాటి రుణ శక్తిని పెంచాలి. దేశ, విదేశాలనుంచి వనరులను సమీకరించుకోవడానికి అవకాశం కల్పించాలి.
* కరవులాంటి రాష్ట్రస్థాయి వైపరీత్యాలకోసం ఎస్డీఆర్ఎఫ్లో 10% నిధులు మాత్రమే ఖర్చుచేయాలన్న నిబంధన ఎత్తేయాలి. రాష్ట్రస్థాయి వైపరీత్యాలన్నింటికీ నేరుగా ఎస్డీఆర్ఎఫ్ నుంచి పూర్తిగా ఖర్చుచేసేలా చూడాలి.
* ప్రకృతివైపరీత్యాల ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులతోపాటు, అన్నిరకాల ఆస్తులకు సమగ్ర బీమా వర్తింపచేయడంతో పాటు అన్ని క్లెయిమ్‌లను సకాలంలో పరిష్కరించాలి.
* తిత్లీ తుపానుకు వివిధ శాఖలకు సంబంధించి రూ.600.46 కోట్ల నష్టం జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ పేర్కొనగా..ఎన్డీఆర్ఎఫ్ నష్టాన్ని రూ.229.05 కోట్లగా మాత్రమే చూపింది
views: 828