Current Affairs Telugu Daily

ప్రారంభం కానున్న ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌’ పథకం 
అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.3 వేల పింఛను ఇచ్చే ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌’ పథకం ఫిబ్రవరి 15న ప్రారంభం కానుంది. జీవిత చరమాంకంలో సామాజిక భద్రత, పనిచేసే శక్తి లేక నిస్సహాయులుగా ఉంటున్న అసంఘటితరంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో దాదాపు 1.30 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర కార్మికశాఖ అంచనా. ఈ పథకంలో దరఖాస్తు చేసుకునేందుకు 18 నుంచి 40 ఏళ్ల లోపు కార్మికులు అర్హులు.
  • ఎవరు అర్హులు 
* ఇళ్లల్లో పనిచేసే వారు 
* రోజు కూలీలు, వ్యవసాయ కూలీలు 
* బీడీ, చేనేత, నిర్మాణరంగ కార్మికులు 
* నెలవారీ వ్యక్తిగత ఆదాయం రూ.15 వేల లోపు ఉన్నవారు (ఈ మేరకు స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలి) 
* ఒక కుటుంబంలో ఎంతమందైనా చేరవచ్చు 
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇతర పథకాల లబ్ధితో సంబంధం ఉండదు
  • వీరు అనర్హులు 
* ఆదాయపు పన్ను చెల్లించేవారు 
* ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చేవారు 
* పీఎఫ్‌ ఖాతాలు ఉన్నవారు
  • వయసును బట్టి ప్రీమియం 
18 ఏళ్ల వయసున్న కార్మికుడు ఈ పథకంలో చేరితే ప్రతి నెలా రూ.55 చెల్లించాలి. 29 ఏళ్ల వారు రూ.100, 40 ఏళ్లున్న వారు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. కార్మికులు చెల్లించేదానికి సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం జమచేస్తుంది. ఇలా 60 ఏళ్ల వరకూ చెల్లించిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేల చొప్పున పింఛనుగా ఇస్తుంది.
  • ఈ పథకంలో ఎలా చేరాలి 
ఈ పథకం దరఖాస్తుల సేకరణకు రాష్ట్ర కార్మికశాఖ ప్రయోగాత్మకంగా జిల్లాకు రెండు చొప్పున ఉమ్మడి సేవల కేంద్రాలు (కామన్‌ సర్వీస్‌ సెంటర్‌) ఏర్పాటు చేసింది. అనంతరం వీటిని మండల కేంద్రాలకు విస్తరించే యోచనలో ఉంది. కార్మికులు ఈ కేంద్రాల్లో ఆధార్‌కార్డు, బ్యాంకు  పాసు పుస్తకాల నకలు ఇచ్చి వివరాలు నమోదు  చేసుకోవాలి. మొదటి నెల చెల్లించాల్సిన ప్రీమియం నగదు రూపంలో చెల్లించాలి. ఆ తర్వాత నెల నుంచి నమోదు చేసిన బ్యాంకు  ఖాతా నుంచి కట్‌ అవుతుంది.
  • మధ్యలో మానేస్తే 
* ప్రీమియం చెల్లింపు మధ్యలో మానేస్తే అప్పటివరకూ చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇస్తారు. 
* పథకంలో చేరిన కార్మికులు 60 ఏళ్ల లోపు మరణించినా లేక శాశ్వతవైకల్యానికి గురైనా.. వారి జీవిత భాగస్వామి కొనసాగించవచ్చు. ఆసక్తి లేకుంటే అప్పటివరకూ చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు. 
* కార్మికులు పింఛను తీసుకుంటూ మరణిస్తే.. జీవిత భాగస్వామికి 50 శాతం పింఛను    చెల్లిస్తారు.

views: 1029

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams