Current Affairs Telugu Daily

విశాఖలో క్లౌడ్‌ సిటీ 
విశాఖ నగరంలోని కాపులుప్పాడలో 1350 ఎకరాల్ని డేటా రంగానికి చెందిన కంపెనీలకు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. దీనికి క్లౌడ్‌సిటీగా పేరుపెడుతున్నట్లు ప్రకటించారు. కాపులుప్పాడలో ఏర్పాటుచేస్తున్న అదాని డేటా సెంటర్‌, టెక్నాలజీ పార్క్‌లకు  మంత్రులు నారా లోకేష్‌, గంటాశ్రీనివాసరావు, కిడారి శ్రావణ్‌కుమార్‌లతో కలిసి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అదానీ సంస్థ ఇక్కడ రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెడుతోందని, ఒప్పందం కుదుర్చుకున్న 35 రోజుల్లో పునాదిరాయి వేశామని తెలిపారు.
  • మిలీనియం టవర్స్‌ ప్రారంభోత్సవం 
ఐటీహిల్‌-3లోని మిలీనియం టవర్స్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.  అలాగే అలీప్‌ ఇండియా ఆధ్వర్యంలో 55 ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్న హరిత పారిశ్రామికవాడ, స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.75.84కోట్లతో మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌పై 15మెగావాట్‌ తెలియాడే సోలారు ప్లాంటు, రూ.530కోట్లతో 33ఎంఎల్‌డీ వ్యర్థజలాల సేకరణ, శుద్ధి ప్లాంటు, ఆనందపురం మండలం గంగసాని గ్రామంలో ఏర్పాటుచేయబోయే అబ్దుల్‌కలామ్‌ ముస్లిం కల్చరల్‌ సెంటర్‌,  పాండ్రంగి బ్రిడ్జి, తాటితూరు కాజ్‌వేలకు శంకుస్థాపన చేశారు. 
వచ్చే ఐదేళ్లలో 500శాతం డేటా అవసరం
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ బావుందని,  అందుకే తాము ఇక్కడ డేటా కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని అదానీ గ్రూపు ఎండీ రాజేష్‌ అదానీ తెలిపారు. ఇక్కడి విధానాలను ఇతర రాష్ట్రాలూ అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.. రానున్న ఐదేళ్లలో 500 శాతం డేటా అవసరమవుతుందని,  దీర్ఘకాలిక ప్రణాళికలతో తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు
  • ఇక ‘తెలుసుకునే’ టెక్నాలజీ
భవిష్యత్తులో ట్రాకింగ్‌ టెక్నాలజీ రాబోతోందని ముఖ్యమంత్రి  చెప్పారు. మనం ఏం తింటున్నాం, ఎలా జీవిస్తున్నాం.. వాటిలో ఎలాంటి పోషకాలున్నాయి.. ఇలా ప్రతీదీ లెక్కచూడగల  సాంకేతికత అవసరముందని చెప్పారు. భవిష్యత్తులో దీనిపై కూడా దృష్టిపెడతామని అన్నారు. రాష్ట్రప్రభుత్వంమీద ప్రజల్లో 80శాతం సంతృప్తి ఉందని, దీన్ని 90 శాతానికి చేరేలా కృషిచేస్తున్నామని, ఓటు బ్యాంకు కూడా 80శాతం ఉండేలా చూసుకోవడం తనకున్న కల అని తెలిపారు.
  • డేటా కేంద్రంతో 1 శాతం వృద్ధిరేటు 
అదానీ గ్రూప్‌ తమ డేటా కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయడమే కాదు దాని విద్యుత్తు అవసరాల కోసం ఇక్కడే సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటు నెలకొల్పుతుందని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు.  ఈ గ్రూపు ఇక్కడ 28 వేల ఉద్యోగాలివ్వబోతోంది. డేటా కేంద్రాలపరంగా ఇదో సరికొత్త విప్లవమని పేర్కొన్నారు. రూ. 70 వేల కోట్ల భారీ పెట్టుబడి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది. దీనివల్ల రాష్ట్ర వృద్ధిరేటు ఒక శాతం పెరుగుతుందని చెప్పారు.

views: 828

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams