Current Affairs Telugu Daily

గుజరాత్‌ పోర్టుకు చేరిన ‘బాహుబలి’..!
నేడు భారత వాయుసేన దృష్టి మొత్తం గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయంపైనే ఉంది. దీనికి కారణం లేకపోలేదు. భారత్‌ వాయుసేన ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న షినుక్‌ -47ఎఫ్‌(ఐ) హెవీ లిఫ్ట్‌ హెలికాప్టర్లు ఈ నౌకాశ్రయానికి చేరుకొన్నాయి. 
వీటిని అమెరికాలో ఫిలడేల్పియాలోని బోయింగ్‌ కర్మాగారంలో తయారు చేసి విడిభాగాలుగా భారత్‌ చేర్చారు. 
ఇక్కడ వాటిని అసెంబుల్‌ చేసి వాయుసేనకు అప్పజెప్పనున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హెలీకాప్టర్లలో షినుక్‌  కూడా ఒకటి.
చైనాకు చెక్‌ పెట్టేందుకు..
ఒక పక్క టిబెట్‌.. అరుణాచల్‌ సరిహద్దుల్లో చైనా మోహరింపులు పెరిగిపోవడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. సంక్షోభ సమయంలో సరిహద్దులకు బలగాలను తరలించడం ప్రధాన సమస్యగా మారుతుందని ప్రభుత్వం గుర్తించింది. 
ఈ నేపథ్యంలో సరిహద్దులకు చేరేందుకు ఉన్న రవాణా మార్గాలను, సౌకర్యాలను వీలనంత మెరుగు పర్చుకొనే పనిలో పడింది. 
ఈ క్రమంలో 2015లో భారత్‌ 15 షినుక్‌ హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేసింది.  
ఫిరంగులు.. విమానాలు ఏవైనా సరే..
 రెండు రొటేటర్ల విభిన్నంగా  కనిపించే ఈ హెలికాప్టర్‌ చాలా శక్తివంతమైంది. దాదాపు 10 టన్నులకు పైగా పేలోడ్‌ను ఇది తీసుకెళ్లగలదు. అంటే ఎం777 శతఘ్నులు, జీపులను  ఒక చోట నుంచి మరో చోటుకు తేలిగ్గా తరలించగలదు.
 సైనిక దళాలను వేగంగా పర్వతాలతో కూడిన సరిహద్దులకు చేర్చడానికి ఇటువంటి హెలికాప్టర్లు బాగా ఉపయోపడతాయి. 
ఎం777 శతఘ్నులను భారత సైన్యం చైనా సరిహద్దుల్లో మోహరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి షినుక్‌  రాకతో మరింత బలం చేకూరింది. ఇంధన సరఫరా, సహాయ కార్యక్రమాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఎంఐ26 ఉండగా షినుక్‌  దేనికంటే..
ఇప్పటి భారత వాయుసేనలో రష్యా తయారు చేసిన ఎంఐ26 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవి కూడా అత్యంత శక్తివంతమైనవి. ఇప్పటి వరకు భారత్‌ వీటినే హిమాలయ ప్రాంతాల్లో వినియోగిస్తోంది. 
శక్తి పరంగా చూసుకుంటే షినుక్‌  కంటే వీటి ఇంజిన్లు చాలా పెద్దవి. కానీ ఇదే పెద్ద లోపంగా మారింది. ఈ హెలికాప్టర్లు ఇంధనాన్ని విపరీతంగా వాడుకొంటాయి. ఖాళీ ఎంఐ 26 హెలికాప్టర్‌ బరువు దాదాపు 28 టన్నులు.. 
అదే సమయంలో షినుక్‌  ఖాళీ హెలికాప్టర్‌ బరువు 10 టన్నులు. దీంతో షినుక్‌కు ఇంధన వినియోగం కూడా చాలా తగ్గుతుంది. ఎంఐ26హెలికాప్టర్ల శక్తిలో 15శాతం తోకభాగంలో  ఫ్యాన్‌ కారణంగా వృథా అవుతుంది. 
షినుక్‌లో ఈ సమస్యలేదు. అంతేకాకుండా ఎంఐ26 హెలికాప్టర్లు విడిభాగాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. అందుకే భారత్‌ ప్రభుత్వం దీనివైపు మొగ్గు చూపింది.

views: 853

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams