21వ శతాబ్దం చివరినాటికి భూగోళం ముదురు నీలివర్ణంలోకి
వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్ల 21వ శతాబ్దం చివరి నాటికి సముద్ర ఉపరితలాల రంగు మారిపోతుందని, భూగోళంలోని కొన్ని ప్రాంతాలు నీలి రంగు నుంచి గాఢమైన నీలి రంగులోకి, మరికొన్ని ప్రాంతాలు ఆకుపచ్చ వర్ణం నుంచి ముదురు ఆకుపచ్చ వర్ణంలోకి మారిపోయేందుకు ఇది దారితీస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. వాతావరణ మార్పులు సముద్రాల్లోని సూక్ష్మజీవులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని, దీంతో సముద్ర ఉపరితలాల రంగు మారిపోయి కొన్ని ప్రాంతాలు గాఢమైన నీలి రంగులోకి, మరికొన్ని ప్రాంతా లు ముదురు ఆకుపచ్చ వర్ణంలో కనిపిస్తాయని ఎంఐటీ (మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) తమ అధ్యయనంలో తేల్చింది.
21వ శతాబ్దం చివరి నాటికి సముద్రాల రంగులో గుర్తించదగిన తేడా 50శాతం మేరకు ఉంటుందని ఎంఐటీ ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్టు స్టెఫానీ డట్కివిజ్ పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లో కాంతిని సంగ్రహించే సూక్ష్మ జీవులు వాతావరణ మార్పుల వలన ఒక జాతి నుంచి మరో జాతిగా మారిపోతే వాటిపై ఆధారపడే జీవుల ఆహార అలవాట్లు కూడా మారిపోతాయని తెలిపారు.
ఇటువంటి మార్పుల వల్ల ప్రస్తుతం నీలి వర్ణంలో కనిపించే సమశీతోష్ణ మండలాలు గాఢమైన నీలి వర్ణంలోకి, ఆకుపచ్చ వర్ణంలో కనిపించే ధ్రువ ప్రాంతాలు ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయని ఆయన వివరించారు. వాతావవరణ మార్పులతో సముద్రాల్లోని సూక్ష్మజీవుల స్వరూపం ఇప్పటికే మారిపోతున్నదని, దీంతో సముద్రాలు, భూగోళం రంగు కూడా మారిపోతున్నదని తెలిపారు.
views: 896