Current Affairs Telugu Daily

55,343 కోట్లతో రాజధాని ఆర్థిక ప్రణాళిక

రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి, పరిపాలన నగర నిర్మాణానికి రూ.55,343 కోట్లతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) రూపొందించిన సమగ్ర ఆర్థిక ప్రణాళికను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మొత్తంలో రూ.51,687 కోట్లు మూలధన వ్యయం కాగా, రూ.3,656 కోట్లు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చెల్లించాల్సిన వడ్డీ. మూలధన వ్యయంలో ప్రధాన రహదారులు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి,రాజధాని మీదుగా వెళుతున్న హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్లను దారి మళ్లించడంవంటి పనులకు రూ.19,769 కోట్లు, రాజధాని రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్లలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.17,910 కోట్లు, అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయానికి రూ.14,008 కోట్లు ఖర్చవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది.
మొత్తంలో రూ.37,112 కోట్లను వివిధ ఆర్థిక సంస్థలు, వాణిజ్యబ్యాంకుల నుంచి సీఆర్‌డీఏ రుణాల రూపంలో సమకూర్చుకోనుంది. రాజధానిలో సీఆర్‌డీఏ వాటాకు వచ్చే భూమిలో వివిధ సంస్థలకు కేటాయించగా మిగిలిన 5020 ఎకరాలను తనఖాగా ఉంచి రుణం తెచ్చుకోవాలన్నది ప్రతిపాదన. రాజధాని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 2018-19 నుంచి 2025-26 వరకు రూ.12,600 కోట్లను ఈక్విటీ, గ్రాంటు రూపంలో సమకూర్చనుంది. రీటెయిల్‌ బాండ్ల ద్వారా సీఆర్‌డీఏ  రూ.500 కోట్లు సమీకరించేందుకూ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది.
రూ.4,900 కోట్లతో సచివాలయం, హెచ్‌వోడీ భవనాలుః
రాజధానిలోని పరిపాలన నగరంలో రూ.4,900 కోట్ల వ్యయంతో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల భవనాల నిర్మాణానికి సీఆర్‌డీఏకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల కోసం ఐదు టవర్ల పనులు ఇప్పటికే మొదలయ్యాయి. వాటి నిర్మాణ వ్యయం రూ.4,900 కోట్లుగా, తెచ్చిన రుణాలపై ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చెల్లించాల్సిన వడ్డీ రూ.504.20 కోట్లుగా సీఆర్‌డీఏ పేర్కొంది. ఈ మొత్తంలో 20 శాతం ప్రభుత్వ గ్రాంటుగా, మిగతా 80 శాతం రుణంగా పేర్కొంది.
ప్రపంచబ్యాంకు ప్రాజెక్టుకు ఆమోదంః
అమరావతిలో ప్రపంచబ్యాంకు ఆర్థిక సహకారంలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టు అమలుకు సీఆర్‌డీఏకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రపంచబ్యాంకు నుంచి సీఆర్‌డీఏ 50 కోట్ల డాలర్ల రుణం తీసుకుంటోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌గ్రాంటుగా 21.5 కోట్ల డాలర్లు సమకూర్చనుంది. ఇది విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టు(ఈఏపీ) కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వంనుంచి సీఆర్‌డీఏ అనుమతి కోరింది.


views: 1014

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams