Current Affairs Telugu Daily

పట్టు ఉత్పత్తిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా జాతీయ పురస్కారానికి ఎంపిక 
మేలైన (బైఓల్టిన్‌ రకం) పట్టు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ  అగ్రస్థానంలో ఉందని..ఇందుకు ఉత్తమ రాష్ట్రంగా జాతీయ పురస్కారానికి ఎంపికైనట్లు ఉద్యానశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, ఉద్యాన సంచాలకుడు వెంకట్రాంరెడ్డి వెల్లడించారు. ఈ రకం పట్టుకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర ఉందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఇక్కడ పట్టు ఉత్పత్తి పెద్దగా లేదు. కానీ పట్టు పరిశ్రమ శాఖ ద్వారా చేపట్టిన పనులు, ప్రోత్సాహకాలతో గతేడాది 2,807 టన్నుల పట్టుగూళ్ల ఉత్పత్తి జరిగింది. ఇందులో 1106 టన్నుల గూళ్ల నుంచి 158 టన్నుల పట్టుదారం తీసినట్లు పార్థసారథి చెప్పారు. మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో బైఓల్టిన్‌ పట్టు ఉత్పత్తి కాలేదని ఆయన పేర్కొన్నారు.
కిలో పట్టుగూళ్లకు రూ.75, కిలో పట్టుదారంపై రూ.105 చొప్పున రాష్ట్ర ఉద్యానశాఖ ప్రోత్సాహకాన్నిస్తోందన్నారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న పట్టును పోచంపల్లి, నారాయణపేట, కొత్తకోటలోని మగ్గాల వారికి అందజేస్తున్నట్లు వివరించారు. ప్రైవేటురంగంలో ఇప్పటికే 10 రీలింగ్‌ పరిశ్రమలున్నట్లు తెలిపారు. చైనా వ్యాపారులు గద్వాల ప్రాంతంలో అతిపెద్ద రీలింగ్‌ పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ నెల 9న దిల్లీలోని విజ్ఞానభవన్‌లో ‘సర్జింగ్‌ సిల్క్‌’ పేరుతో ప్రదర్శన, సదస్సు ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర సిల్క్‌ మండలి సమాచారం ఇచ్చిందన్నారు. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర పట్టుశాఖకు జాతీయ పురస్కారాన్ని అందజేస్తారని పార్థసారథి వివరించారు.

views: 836

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams