Current Affairs Telugu Daily

అన్నదాతల కోసం ‘పీఎం-కిసాన్‌’ పథకం

తాజా బడ్జెట్‌లో రైతుల సంక్షేమం కోసం కొత్త పథకం తీసుకొచ్చారు. విత్తనాలు, ఎరువులు, పనిముట్లు, కూలీలు వంటి పెట్టుబడి వ్యయాలు సమకూర్చుకునేందుకు పేద రైతులకు ఆదాయ మద్దతు కల్పించాల్సిన అవసరం నెలకొన్న పరిస్థితుల్లో ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పేరిట ప్రత్యేక పథకాన్ని రూపొందించారు. రైతులు అప్పుల బారిన పడకుండా పరిహరించడం, రుణదాతల వలలో చిక్కుకోకుండా చూడటం ఈ పథకం ఉద్దేశం. 
ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) :
చిన్న, మధ్యతరహా రైతులకు ఆర్థిక సహకారం అందజేయడమే ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకం లక్ష్యం. ఈ కార్యక్రమం కింద 2 హెక్టార్ల దాకా సాగుభూమి ఉండే రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందజేస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకే బదిలీ చేస్తారు. విడతకు రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అందిస్తారు. 
ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది. 
* సుమారు 12 కోట్ల మంది సన్న, మధ్యతరహా రైతు కుటుంబాలకు ప్రయోజనం అందుతుంది. 
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే వర్తిస్తుంది. 
* 2018 డిసెంబరు 1 నుంచి అమలవుతుంది. 
* మొదటి విడతలో రూ.2 వేలు మార్చినెల లోపు రైతుల ఖాతాలకు జమ. 
* ఈ పథకంతో కేంద్ర ప్రభుత్వంపై 75 వేల కోట్ల రూపాయల భారం పడనుంది. 
* పీఎం-కిసాన్‌ పథకం బాధిత రైతు కుటుంబాలకు అదనపు ఆదాయ హామీని ఇవ్వడమే కాకుండా పంట సీజన్‌కు ముందే అత్యవసర ఖర్చులకు చేదోడుగా నిలుస్తుంది. ఈ పథకం రైతులు డబ్బులు సంపాదించుకోవడానికి, గౌరవంగా జీవించేందుకు మార్గం సుగమం చేస్తుంది. 
* పీఎం-కిసాన్‌ పథకానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల కోట్లు కేటాయించారు. 
* 2018-19 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల కింద ఈ పథకం కోసం రూ.20 వేల కోట్లు అదనంగా కేటాయించారు. 
* 22 గుర్తించిన పంటలకు కనీస మద్దతు ధరను పంట ఉత్పత్తి వ్యయంకన్నా 50 శాతం ఎక్కువగా నిర్ణయం. 

వడ్డీ రాయితీలు 
* మత్స్య రంగం అభివృద్ధి కోసం నిరంతరంగా, నిర్దిష్టంగా దృష్టిసారించేందుకు వీలుగా ప్రత్యేకంగా మత్స్యశాఖ ఏర్పాటు 
* పశుపోషణ, చేపల పెంపకం చేపట్టిన రైతులకు 2 శాతం వడ్డీ రాయితీ. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా రుణాలు పొందిన వారికి ఇది వర్తిస్తుంది. 
* సకాలంలో రుణాలు చెల్లించిన వారికి అదనంగా 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. 
* రుణప్రక్రియను సరళతరం చేయడం, రాయితీలతో కూడిన రుణాల్ని అందించడం కోసం రైతులందరినీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పరిధిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా సరళతరమైన దరఖాస్తు సమగ్ర కార్యక్రమాన్ని చేపడతారు. 
* తీవ్రస్థాయి ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు జాతీయ విపత్తు సహాయ నిధి(ఎన్డీఆర్‌ఎఫ్‌) ద్వారా సహాయం అందజేయాలని నిర్ణయం. 
* ప్రకృతి విపత్తు బాధిత రైతులకు 2 శాతం వడ్డీ రాయితీ. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి 3 శాతం అదనపు రాయితీ ప్రయోజనాన్ని కల్పించారు.

2019-20 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులిలా

* వ్యవసాయ, అనుబంధ రూ.1,49,981 కోట్లు రంగాలకు 
* ఎరువుల సబ్సిడీ రూ.74,986 కోట్లు 
 

4 రాష్ట్రాల్లో కౌలు రైతు చట్టాల మార్పు

 కౌలు రైతులకు ఉపయోగపడేలా నూతన భూ కౌలుదారు చట్టం-2016 ప్రకారం ఇప్పటికే 4 రాష్ట్రాలు అమలు చేశాయని కేంద్రం కొత్త బడ్జెట్‌లో ప్రకటించింది. గతేడాది ఇచ్చిన హామీల అమలుకు తీసుకున్న చర్యలను పేర్కొంది. కొత్త చట్టం ముసాయిదాను నీతి ఆయోగ్‌ అన్ని రాష్ట్రాలను సంప్రదించి గతంలో విడుదల చేసింది. దీనిప్రకారం కౌలు రైతులకు పంట రుణాలు అందే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కేంద్రం గత బడ్జెట్‌లో పేర్కొంది. ఆ మేరకు ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు నిబంధనలను సవరించాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేసేందుకు శాసనసభల్లో బిల్లులను ఆమోదించాయి. మిగతా రాష్ట్రాలను ఇలాగే చేయాలని కోరినట్లు కేంద్రం వివరించింది. 
కేంద్రం వెల్లడించిన ఇతర అంశాలు 
* దేశవ్యాప్తంగా 22 వేల గ్రామ సంతలను ‘గ్రామీణ వ్యవసాయ మార్కెట్‌’లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించాం. 9477 గ్రామాల్లో ఇప్పటికే అధ్యయనం పూర్తయింది. వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయాల వృద్ధికి రూ.2 వేల కోట్ల నిధి ఏర్పాటు చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. 
* ఉద్యాన పంటల అభివృద్ధికి దేశవ్యాప్తంగా 99 క్లస్టర్లు ఏర్పాటయ్యాయి. పంటల సాగు, శుద్ధి, మార్కెటింగ్‌ వంటివన్నీ ఈ క్లస్టర్‌లో ఉంటాయి. సేంద్రియ పంటల సాగును, ఈ పంటల అమ్మకాలను చేపట్టేందుకు మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఏడాది 28 రాష్ట్రాల్లోని 23,679 గ్రామాల్లో 1646 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 5816 మహిళా సంఘాల్లోని 52,270 మంది మహిళలను సేంద్రియ పంటల సాగుకు ఎంపిక చేశారు. ఔషధ, అలంకరణ మొక్కల సాగుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం


views: 884Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams