Current Affairs Telugu Daily

2019 బడ్జెట్ లో విద్యారంగానికి రూ.93,847 కోట్లు

విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో రూ.93,847.64 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం కేటాయించిన రూ.85,010 కోట్లతో పోలిస్తే ఇది 10% ఎక్కువ. ప్రస్తుత కేటాయింపుల్లో పాఠశాల విద్యకు రూ.56,386.63 కోట్లు, ఉన్నత విద్యకు రూ.37,461.01 కోట్ల నిధులను నిర్దేశించారు.
* ‘2022 నాటికి విద్యావిధానం, మౌలిక వసతులను పునరుత్తేజితం’ చేసే దిశగా ఒక పథకాన్ని ప్రతిపాదించారు. రానున్న నాలుగేళ్లలో ఈ పథకం కోసం రూ.లక్ష కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. విద్యా, వైద్య రంగాల్లో ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పరిశోధన, మౌలిక వసతుల పెట్టుబడులకు ఈ నిధులను వ్యయం చేస్తారు.
*  పరిశోధన, ఆవిష్కరణలకు తాజాగా కేంద్రం 608.87 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి కేటాయింపు గణనీయంగా పెరిగింది. నిరుడు ఈ రంగానికి రూ.350 కోట్లు కేటాయించారు.
*  రెండు పూర్తిస్థాయి ‘స్కూల్స్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (స్పా)’లను ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు గోయల్‌ చెప్పారు.
*  దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థలుగా అదనంగా 18 ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ స్కూళ్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా ఆయా సంస్థల డైరెక్టర్లను, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను కోరినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
*  పాఠశాలల్లో విద్య నాణ్యతను పెంచేందుకు నిర్దేశించిన ఆపరేషన్‌ డిజిటల్‌ బోర్డ్‌ కార్యక్రమ విధివిధానాలను రూపొందించేందుకు ఉన్నత విద్యాశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు. ‘బ్లాక్‌ బోర్డ్‌ నుంచి డిజిటల్‌ బోర్డు’ దిశగా విద్యారంగాన్ని, ఉపాధ్యాయులను సంసిద్ధం చేసేందుకు ‘దీక్ష’ పేరుతో డిజిటల్‌ పోర్టల్‌ను ప్రారంభించడాన్ని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని గణనీయంగా వినియోగించుకోనున్నట్లు చెప్పారు.
ఐఐటీ ఐఐఎం ఐసర్‌ల నిధుల్లో కోత
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఐఐఎంలు, ఐసర్‌లు.. చట్టబద్ధ సంస్థలైన యూజీసీ, ఏఐసీటీఈల కేటాయింపుల్లో కేంద్రం కోత విధించింది. 2019 నుంచి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న నేపథ్యంలో అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో 25% సీట్లు పెంచనున్నారు. ఈ క్రమంలో నిధుల కేటాయింపులు తగ్గడం గమనార్హం. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లకు తాజాగా 415.41 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయింపులు రూ.1,036 తో పోలిస్తే ఇది 59.9% తక్కువ. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లకు ఈసారి 6,223 కోట్లు కేటాయించారు. క్రితం ఏడాది ఇచ్చిన నిధులు రూ.6,326 కోట్లు. గత సంవత్సరం కూడా అంతకుముందు ఏడాదితో పోలిస్తే నిధుల్లో కోత విధించడం గమనార్హం.


views: 720

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams