Current Affairs Telugu Daily

తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న పీయూష్‌ గోయల్‌
ఓటర్లను ఆకర్షించేందుకు చివరి ప్రయత్నంగా పలు రాయితీలు, పథకాలతో మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను రూపొందించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ బడ్జెట్‌ను 1 ఫిబ్రవరి 2019 న తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని గుణపాఠంగా చేసుకొని తాయిలాలకు రూపకల్పన చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించిన రుణమాఫీ, కనీస ఆదాయం వంటి పథకాలను పరిగణనలోకి తీసుకొంది.
తాత్కాలిక బడ్జెట్‌ పరిధిని అతిక్రమించి గ్రామీణ, పట్టణ మధ్య తరగతికి ప్రయోజనం కలిగించే ప్రకటనలు ఉంటాయని సమాచారం. ఆర్థిక రంగంలో ప్రగతి కనిపిస్తున్నా అందుకు తగ్గట్టుగా ఉద్యోగాల సృష్టి జరగడం లేదన్న విమర్శలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు జరపనున్నట్టు తెలిసింది. గ్రామీణాభివృద్ధిలో కీలకమైన ఉపాధి హామీ పథకంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఈ పథకానికి 2019-20లో రూ.60 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది. గత ఏడాదితో పోల్చితే 9 శాతం అధికంగా నిధులు ఇవ్వనుంది. దేశ వ్యాప్తంగా 7 కోట్ల మంది లబ్ధిదారులకు వంద రోజుల పాటు పని కల్పించడంతో పాటు, వారి కూలీ రేటును కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి.
  • గ్రామీణాభివృద్ధికే రూ.1.30 లక్షల కోట్లు
  • పింఛన్ల నిధులు మూడింతలు పెంపు!
  • రూ.లక్ష కోట్ల రైతు ప్యాకేజీ! 
  • రూ.లక్ష కోట్ల రైతు ప్యాకేజీ! 
  • పేదలకు నెలవారీ కనీస ఆదాయం 
    పేదలకు ప్రతి నెలా కనీస ఆదాయం కల్పించేలా పథకాన్ని వెలువరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2016-17 ఆర్థిక సర్వేలోనే ప్రభుత్వం సార్వత్రిక ప్రాథమిక ఆదాయం(యూబీఐ) గురించి ప్రస్తావన చేసింది. అన్ని రాయితీలను సమ్మిళితం చేసి నగదు రూపంలో ఇవ్వాలన్న ఆలోచన ఉంది. అయితే ఆచరణలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ప్రస్తుతానికి ఆ విధానంలో కాకుండా పాక్షిక సార్వత్రిక ప్రాథమిక ఆదాయ పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిని దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న అందరికీ కాకుండా నిరుపేదలుగా తేలిన 40 శాతం (12 కోట్లు) మందికి వర్తింప చేయవచ్చు. వారికి నెలకు రూ.700 నుంచి రూ.1,200 వరకు ఇవ్వాలనుకుంటే రూ.1లక్ష కోట్లు ఖర్చవుతుందన్న అంచనాలు ఉన్నాయి.

ఆదాయపు పన్నులో మినహాయింపులు:

మధ్య తరగతి వారిని ఆకర్షించేందుకు ఆదాయపు పన్నులో పలు మినహాయింపులు ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. 
* 60 ఏళ్లలోపు వయసు ఉన్నవారికి పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడం 
* 60-80 ఏళ్ల వయసు ఉన్నవారికి మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచడం 
* సీనియర్‌ సిటిజన్లు, మహిళలకు ఇచ్చే మినహాయింపులను మరింతగా పెంచడం 
* ఇంటి రుణం వడ్డీపై ఇచ్చే మినహాయింపును రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షలకు పెంచడం 
* పన్ను శ్లాబులను కూడా మార్చే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది.

views: 825



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams