Current Affairs Telugu Daily

ఎన్‌ఎస్‌సీ తాత్కాలిక ఛైర్మన్‌ పి.సి.మోహనన్‌, స్వతంత్ర సభ్యురాలు జె.వి.మీనాక్షి రాజీనామా 
జాతీయ ప్రాముఖ్యంగల మరో సంస్థ వ్యవహారం రాజకీయంగా వివాదాస్పదమయింది. జాతీయ గణాంక సంఘం (నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌-ఎన్‌ఎస్‌సీ) తాత్కాలిక ఛైర్మన్‌ పి.సి.మోహనన్‌, స్వతంత్ర సభ్యురాలు జె.వి.మీనాక్షి తమ పదవులకు రాజీనామా చేయడం కలకలం సృష్టించింది. ఇంతకుముందు రిజర్వుబ్యాంకు, సీబీఐలను నిర్వీర్యపరిచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొన్ని గణాంకాల వివరాలు వెల్లడించవద్దంటూ ఎన్‌ఎస్‌సీపై ఒత్తిడి తెస్తోందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కొన్ని అంశాలపై ప్రభుత్వంతో విభేదాలు ఏర్పడడంతో వారిద్దరు రాజీనామా చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. గత ఏడాదికి సంబంధించిన ఉద్యోగాల కల్పన సర్వేను ప్రచురించకపోవడం, యూపీఏ హయాం కన్నా ఎన్డీయే పాలనలోనే ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు వీలుగా స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)ని లెక్కించే ప్రామాణికాలను మార్చడంపై వీరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ''ఎన్‌ఎస్‌సీ నుంచి రాజీనామా చేశాను. ప్రస్తుతం ఈ సంఘం అంత ప్రభావశీలంగా ఏమీ లేదు. ఈ సంఘం బాధ్యతలను మేం నెరవేర్చలేకపోతున్నాం'' అని మోహనన్‌ చెప్పారు. వారిద్దరు 2017 జూన్‌లో నియమితులు కాగా, 2020 జూన్‌ వరకు పదవీ కాలం ఉంది. మరో జాతీయ సంస్థను కేంద్ర ప్రభుత్వం చంపేసిందని కాంగ్రెస్‌ నాయకుడు చిదంబరం విమర్శించారు. ఆర్‌బీఐ, సీబీఐల్లా దీనినీ నిర్వీర్యపరిచిందని మరో నాయకుడు అభిషేక్‌ సింఘ్వి అన్నారు.
వారెప్పుడూ అభ్యంతరాలు చెప్పలేదే: గణాంకాల మంత్రిత్వ శాఖ 
జాతీయ గణాంక సంఘం సమావేశాల్లో మోహనన్‌, మీనాక్షిలు ప్రభుత్వ విధానాలపై ఎప్పుడూ అభ్యంతరాలు చెప్పలేదని బుధవారం కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ఉద్యోగాల కల్పనకు సంబంధించి నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 2017 జులై- 2018 డిసెంబరు మధ్య కాలానికి చెందిన గణాంకాలను సేకరించిందని, దీని నివేదిక త్వరలో వెల్లడవుతుందని పేర్కొంది. జీడీపీ లెక్కింపునకు 2011-12ను ఆధార సంవత్సరంగా పరిగణించి నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్టు పేర్కొంది.

views: 780



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams