Current Affairs Telugu Daily

తీర్పులను విమర్శించడం న్యాయ ధిక్కరణే: సుప్రీం
న్యాయమూర్తులను ప్రసార మాధ్యమాల ద్వారా న్యాయవాదులు విమర్శించడం అత్యంత సాధారణమైపోయిందని, తీర్పులకు రాజకీయ రంగులు ఆపాదించడం ముమ్మాటికీ న్యాయస్థాన ధిక్కరణేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడమనేది బ్రహ్మాస్త్రం వంటిదనీ, దానిని అరుదుగానే ఉపయోగించాలని పేర్కొంది. 
‘కేసును ఎలా పరిష్కరించాలనేదానిపై న్యాయవాదులకు, ధర్మాసనానికి ఒక యంత్రాంగం ఉంటుంది. ప్రసార మాధ్యమాలు చేసే సమాంతర విచారణ ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేం. వెలుపలి జోక్యాన్ని అనుమతించేది లేదు’ అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ల ధర్మాసనం స్పష్టీకరించింది.
విమర్శలను ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి మీడియాను ఆశ్రయించరాదని కూడా పేర్కొంది. 
నిష్పాక్షిక నిర్ణయ ప్రక్రియలో న్యాయవాదులు జోక్యం చేసుకోరాదంది. సైనికుల మాదిరిగా న్యాయవ్యవస్థ కూడా ఎన్నో త్యాగాలు చేస్తోందని న్యాయమూర్తులు తెలిపారు. 
రాజకీయ అంశాలపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం వెలువరించినా దానిని కొందరు విమర్శిస్తుననారని తెలిపారు.
మద్రాస్‌ హైకోర్టు వెలువరించిన ఒక తీర్పుపై ఈ నెల 28న ధర్మాసనం ఈ మేరకు 78 పేజీల తీర్పునిచ్చింది.

views: 729



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams