Current Affairs Telugu Daily

చిత్రా ముద్గల్‌ , ఎం.లీలావతి లకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-  2018 
కన్నతల్లిని కలుసు  కోవాలనే ఆశతో ఓ వ్యక్తి ఉత్తరాల్లో నింపిన వేదనే ‘పోస్ట్‌ బాక్సు నెం.203 - నల సోపర’ నవల. హిందీ రచయిత్రి చిత్రా ముద్గల్‌ రాసిన ఈ  నవలను తాజాగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-  2018  వరించింది.
 అలాగే ‘శ్రీమద్‌ వాల్మీకి రామాయణం’ను సంస్కృతం నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించిన డాక్టర్‌ ఎం.లీలావతి కూడా ఈ  అవార్డుకు ఎంపిక కావడం విశేషం.
చిత్రాముద్గల్‌:
దిల్లీ నుంచి ముంబయికి వెళుతున్న ఓ రైలు పెట్టెలోకి అనుకోకుండా ఓ వ్యక్తి ఎక్కాడు. అక్కడే ఉన్న మరో ప్రయాణికురాలికి తన కథ చెప్పాడు.
 ఆ కథే పోస్ట్‌ బాక్సు నెం.203 నల సోపర’. ఆ ప్రయాణికురాలే చిత్రా ముద్గల్‌.
సామాజికపరమైన అంశాలే చిత్రాముద్గల్‌ రచనల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ‘నేను రాసిన పోస్ట్‌ బాక్సు నెం.203 - నల సోపరకు స్ఫూర్తి రైల్లో పరిచయమైన వ్యక్తే. అతను ఓ హిజ్రా. అతని బాధే ఈ రచనకు కారణమైంది. అది 1980. దిల్లీ నుంచి పశ్చిమ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ముంబయికి వెళుతున్నా. మేమున్న పెట్టెలో ఓ హిజ్రా కూర్చున్నాడు.  
అతని పేరు నరోత్తం అని, తనది గుజరాతీ కుటుంబ నేపథ్యమని చెప్పాడు. చిన్నప్పుడే కుటుంబానికి దూరమై హిజ్రాగా మారి, ఆ తరువాత అమ్మను కలవడానికి అతడు పడిన తపన వివరించాడు.
అతని మాటలు విన్నాక...  ఆ కష్టాన్నే నవలగా రాయాలని అనిపించింది. 2010లో మొదలుపెట్టి, మూడేళ్లకు పూర్తి చేశా. కథానాయకుడి పేరు బిన్నీ. సమాజంలో... వాళ్లూ మనలాంటివారే అనే భావనను అందరిలో తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నవలను పూర్తిచేశా. అదే నాకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును తెచ్చింది. ఇది అతనికే అంకితం...’ అని చెబుతుంది చిత్రాముద్గల్‌. ఆమెది చెన్నై. ముంబయిలో ఎస్‌ఎన్‌డీటీ మహిళావిశ్వవిద్యాలయంలో హిందీ సాహిత్యంలో ఎంఏ పీహెచ్‌డీ చేశారు. చిత్ర రాసిన రచనలెన్నో ప్రముఖుల ప్రశంసలను, అవార్డులను దక్కించుకున్నాయి.
రచయిత్రి డాక్టర్‌ ఎం.లీలావతి:
ఆమెది కేరళలోని త్రిశూర్‌. లీలావతి ప్రభుత్వ కళాశాలకు ప్రిన్సిపల్‌గా చేసి పదవీ విరమణ పొందారు. 
1980లో ఈమె రచన ‘వర్ణరాజీ’ కేరళ సాహిత్య అకాడమీ,  1986లో ‘కవితధ్వని’ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను దక్కించుకున్నాయి. 2009లో మలయాళం సాహిత్యానికి చేసిన సేవకుగానూ ఈమెను పద్మశ్రీ అవార్డు వరించింది. 
ఇప్పుడు సంస్కృతం నుంచి ‘శ్రీమద్‌ వాల్మీకి రామాయణం’ను ఇంగ్లిష్‌లోకి ఆమె చేసిన అనువాదమే అవార్డును తెచ్చిపెట్టింది. ఈ అవార్డును ఈమె అందుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం.

views: 820



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams