Current Affairs Telugu Daily

విస్తృత ధర్మాసనానికి హైకోర్టు కేసుల బదిలీ వ్యవహారం
ఏపీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ లేఖను సుమోటోగా తీసుకున్న తెలంగాణ హైకోర్టు
ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేసే వ్యవహారంపై విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయిస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 
ఏపీ స్థానికతకు చెందిన కేసులతోపాటు, ఏపీ ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్న కేసులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం రాసిన లేఖను విచారణ నిమిత్తం సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా తీసుకుంది. దీనిపై  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
 అప్పీళ్లు, కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు తదితరాలను బదిలీ చేసే విషయంలో చట్టపరంగా కీలకమైన అంశాలున్నాయని, దీనిపై విస్తృతధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉందని పేర్కొంది. దీంతో ఈ పిటిషన్‌ను ఫుల్‌ బెంచ్‌కు నివేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
ఉమ్మడి హైకోర్టు ఏర్పడేనాటికి దాఖలైన అప్పీళ్లు, కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు, పునఃసమీక్ష (రివ్యూ) పిటిషన్‌లపై విచారణ జరిపే పరిధి ఉమ్మడి హైకోర్టుకు ఉంటుందని ఏపీ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 40(3) చెబుతోందని, దీనివల్ల ఏపీ న్యాయవాదులు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం లేఖలో పేర్కొంది. 
విస్తృత ధర్మాసనం..అందులో న్యాయమూర్తులకు సంబంధించి పాలనాపరమైన నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి తీసుకోవాల్సి ఉంది.

views: 720

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams