Current Affairs Telugu Daily

అంతర్జాతీయంగా  విద్యా ప్రమాణాల లెక్కింపు కార్యక్రమం ‘పీసా’ లో భారత్‌
మన విద్యార్థుల ప్రమాణాలు అంతర్జాతీయంగా ఏ స్థాయిలో ఉన్నాయో మదింపు చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ‘పీసా’లో భారత్‌ చేరినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వెల్లడించారు.
‘ప్రోగ్రాం ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ అసెస్‌మెంట్‌’గా పిలిచే ఈ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై కేంద్ర మంత్రి నేతృత్వంలో మానవ వనరుల శాఖ అధికారులు, ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ప్రతినిధులు సంతకాలు చేశారు. 2021 నుంచి 10, 11, 12 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్ష జరుగుతుందని మంత్రి వివరించారు.
దీనిద్వారా ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల విద్యార్థుల ప్రమాణాలను లెక్కిస్తుండగా.. తాజాగా ఇందులో భారత్‌ కూడా చేరింది. దేశంలోని ఓ ప్రాంతాన్ని ఎంపికచేసి అక్కడున్న పాఠశాలల విద్యార్థులను ర్యాండమ్‌గా తీసుకొని ప్రశ్నపత్రాలు ఇచ్చి వారి విద్యాప్రమాణాల స్థాయిని అంచనా వేస్తారు.
విద్యార్థుల పఠనాశక్తి, లెక్కలు, సైన్స్‌ అర్థం చేసుకొనే సామర్థ్యం, ఉమ్మడిగా సమస్యలను పరిష్కరించే శక్తిసామర్థ్యాల ఆధారంగా విద్యార్థుల స్థాయిని అంచనా వేస్తారు. 
ఈ పరీక్షల ఆధారంగా భారత్‌కు అంతర్జాతీయ ర్యాంకింగ్‌ ఇస్తారని, తదనుగుణంగా మనం విద్యాప్రమాణాల రీత్యా ఏస్థాయిలో ఉన్నామో అంచనా వేసుకోవడానికి వీలవుతుందని మంత్రి చెప్పారు. దాని ప్రకారం ఉపాధ్యాయ విద్య, ఇన్‌సర్వీస్‌ శిక్షణ, పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొస్తామన్నారు.
ప్రస్తుతం జాతీయస్థాయిలో 3, 5, 8 తరగతుల విద్యార్థుల ప్రమాణాలను లెక్కిస్తున్నామని, ఇకమీదట అంతర్జాతీయస్థాయిలో అదే తరహా పరీక్ష ఉంటుందన్నారు.
పీసా -  ప్రోగ్రాం ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ అసెస్‌మెంట్‌ 

views: 741Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams