Current Affairs Telugu Daily

మేధో సంపత్తి హక్కులకు భారత్‌లో IPE
భారతదేశంలో మేధో సంపత్తి హక్కు కొనుగోలు, అమ్మకం, లైసెన్సు జారీ ప్రక్రియలు ఇకపై మరింత పారదర్శకంగా, సులభతరంగా మారనున్నాయి. ఇందుకోసం స్టాక్‌ ఎక్స్చేంజ్‌ తరహాలో మేధో సంపత్తి ఎక్స్చేంజ్‌(IPE)ని ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుంది. తద్వారా ఇప్పటికే IPEలను కలిగి ఉన్న బ్రిటన్‌, హాంకాంగ్‌ వంటి దేశాల సరసన భారత్‌ చేరనుంది. జాతీయ పరిశోధన, అభివృద్ధి సంస్థ(NRDC) సాయంతో  IPE ఏర్పాటు ప్రక్రియను కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సాంకేతికతలపై దాఖలైన పేటెంట్లకు సంబంధించిన సమాచారాన్ని NRDC సేకరిస్తోంది. 2018 ప్రథమార్థంలో IPE ప్రారంభం కానుంది. భారత్‌తో పాటు విదేశాల్లో వ్యక్తులు, వాణిజ్య సంస్థలు పలు రంగాలకు సంబంధించిన మేధో సంపత్తి హక్కులను పారదర్శకంగా, సులభంగా విక్రయించడానికి, కొనుగోలు చేయడానికి IPE వేదికగా నిలుస్తుంది. సొంత ఆలోచనలు, ప్రణాళికలు, అదృశ్య ఆస్తులపై కనీసం కొంత నిర్దిష్ట కాలంపాటు వ్యక్తులు, సంస్థలకు విశిష్ట హక్కులను మేధో సంపత్తి హక్కులు కల్పిస్తాయి. వీటిలో కాపీరైట్‌ హక్కులు, పేటెంట్‌లు, ట్రేడ్‌మార్క్‌లు, భౌగోళిక సూచికలు వంటివి భాగంగా ఉంటాయి. ప్రస్తుతం మేధో హక్కులను విక్రయించుకునేందుకు సరైన వేదిక లేకపోవడంతో నష్టపోతున్న భారతీయులకు IPE ప్రయోజనకరంగా మారనుంది. మన దేశంలో మేధోసంపత్తి హక్కులను కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్‌, డిజైన్స్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్స్‌(CGPDTM) ద్వారా అందజేస్తుంటారు. CGPDTM నివేదిక ప్రకారం 2015-16లో మేధోహక్కుల కోసం 3,41,086 దరఖాస్తులు వచ్చాయి.
IPE-Intellectual Property Exchange
NRDC-National Research Development Corporation 
CGPDTM-Controller General of Patents, Designs and Trade Marks

views: 982

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams