Current Affairs Telugu Daily

పరమ వీర చక్ర,అశోక చక్ర,శౌర్య చక్ర అవార్డులు - వాటి ప్రాముఖ్యం
‘మా దగ్గరున్న బుల్లెట్లు అయిపోవచ్చు.. కానీ మాలో ఉన్న మంట ఆరిపోదు.నా దేశాన్ని కాపాడతానని కన్నతల్లి లాంటి నేల తల్లి మీద ఒట్టేసి చెప్పిన క్షణాన్ని మనసు మర్చిపోదు.’ 18 మంది సహచరులను పోగొట్టుకున్న ఓ జవాను మాటలివి.  ‘ఈ సమాజం మారుతుండొచ్చు కానీ మా కర్తవ్యదీక్ష ఎప్పటికీ నిలిచివుంటుంది’’ జవాను మాటల్లోని దేశభక్తికి తార్కాణమిది. 
విధి నిర్వహణలో ఉన్న దేశ సైనికులకు . పంచభక్ష పరమాన్నాలు అక్కర్లేదు. పట్టుపాన్పులతో పనేలేదు. కావల్సిందల్లా ఒక్కటే..వాళ్లు చేస్తున్న సేవలకు గుర్తింపు. జవాను వీర మరణ పొందితే బాధిత కుటుంబానికి కాసింత ఓదార్పు. విధి నిర్వహణలో జవాన్లు ఎండకు బెదరరు. జడిపించే చలినైనా సహించగలరు.
ఓ మహనీయుడు చెప్పినట్లు మనకున్న ఈ స్వేచ్ఛకు కారణమైన..మన ఆనందాలకు భరోసా ఇస్తున్న సైనికులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. అందుకే భారతావనికి బ్రిటిష్‌ చెర నుంచి విముక్తి కలిగిన తొలి నాళ్లలో భారత ప్రభుత్వం వీరి సేవలకు గుర్తుగా అవార్డులను ప్రకటించింది. రివార్డులతో, అవార్డులతో వీరిని సత్కరిస్తూ సేవలకు తగిన గుర్తింపునిస్తోంది. దేశ భద్రతలో కీలక పాత్ర వహిస్తున్న జవాన్లకు అవార్డులివ్వాలని 1950లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గాలంట్రీ(సాహస) అవార్డుల పేరిట ‘పరమవీర చక్ర’, ‘మహావీర చక్ర’, ‘వీర చక్ర’లను తీసుకొచ్చింది. 
1950 జనవరి 26 నుంచి ఈ అవార్డులను బహూకరిస్తూ ఉంది. ఆ తర్వాత రెండేళ్లకు మరో మూడు అవార్డులను తీసుకొచ్చింది. తొలుత వీటికి అశోక చక్ర క్లాస్‌-1, అశోక చక్ర క్లాస్‌-II, అశోక చక్ర క్లాస్‌-III పేర్లతో 1952 జనవరి 4న ఈ అవార్డులను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 
తర్వాత 1967లో వీటిని అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్రగా పేర్లు మార్చారు. ఈ అవార్డులను ఏడాదికి రెండు సార్లు ప్రకటిస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులను ఇస్తున్నారు.

అవార్డులు - వాటి ప్రాముఖ్యం: 

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన విధివిధానాల ప్రకారం వీటిలో అత్యున్నత పురస్కారం- పరమ వీర చక్ర, తర్వాత స్థానంలో మహా వీర చక్ర, వీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర ఉంటాయి.
  • పరమ వీర చక్ర: ఇది వృత్తాకారంలో ఉన్న కాంస్య పతకం. దీనిపై ఇంద్రుడి వజ్రాయుధం ఆకారంలో ఉన్న గుర్తులు నలుమూలలా ఉంటాయి. 
వీటి మధ్యలో భారత జాతీయ చిహ్నం ఉంటుంది. ఈ మెడల్‌ వెనక ‘పరమ వీర చక్ర’ అని హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో రాసి ఉంటుంది. యుద్ధ సమయాల్లో వీరోచితంగా పోరాడిన వారికి ఈ అవార్డును బహూకరిస్తారు.
 భారత దేశంలో ఇచ్చే పరమ వీర చక్ర..అమెరికాలో ఇచ్చే ‘విక్టోరియా క్రాస్‌’కు సమానం. ఇప్పటికి మన దేశంలో ఈ అవార్డను 21 మంది మాత్రమే అందుకున్నారు. 
ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి మేజర్‌ సోమ్‌నాథ్‌ శర్మ. 1950 రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా ఈయనకు ఈ అవార్డు బహూకరించారు. మరణానంతరం ఈయనకు పరమ వీర చక్ర ప్రకటించారు.
  • మహా వీర చక్ర: ఇది వృత్తాకారంలో ఉన్న వెండి పతకం. ఈ పతకం మొత్తాన్ని తాకుతున్నట్లు మధ్యలో నక్షత్రం ఉంటుంది. దాని మధ్యలో భారత జాతీయ చిహ్నం ఉంటుంది. 
దీని వెనక ‘మహా వీర చక్ర’ అని దేవనాగరి, ఇంగ్లీష్‌ భాషల్లో రాసి ఉంటుంది. ఈ పతకంతో పాటు ఆరంజ్‌, తెలుపు రంగులోని రిబ్బన్‌ను దీనికి జత చేస్తారు.
 సైన్యంలోశత్రు సైన్యంపై జవాన్లు ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గానూ ఈ అవార్డును అందజేస్తారు. భారత మిలిటరీలో ఇచ్చే రెండో అతి పెద్ద అవార్డు ఇది.
  • వీర చక్ర: ఇది కూడా వృత్తాకారంలో వెండి పతకం. కదనరంగంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఈ అవార్డును బహూకరిస్తారు. భారత దేశంలో ఇచ్చే సాహస అవార్డులో ఇది మూడో అత్యున్నత పురస్కారం. 
ఈ పతకానికి జతగా సగం నారింజ రంగు, మరో సగం ఊదారంగుతో ఉన్న రిబ్బన్‌ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ అవార్డును 1322 మందికి బహూకరించారు.ఈ పురస్కారాన్ని స్వీకరించిన తొలి జవాన్‌ హీరా నంద్.
  • అశోక చక్ర: పై మూడు పతకాల కంటే అశోక చక్ర, కీర్తి, శౌర్య చక్ర పతాల రూపంలో తేడా ఉంటుంది. 
అశోక చక్ర పురస్కారంలో భాగంగా ఇచ్చే పతకం వృత్తాకారంలో ఉంటుంది. దీని మధ్యలో ధర్మ చక్రం కనిపిస్తుంది. ఈ పతకం బంగారం పూతతో ఉంటుంది. తామర పువ్వులు చుట్టూతా ఉండి మధ్యలో ధర్మచక్రాన్ని అమర్చి ఉంటారు.
ఈ పతకం వెనకవైపు ‘అశోక చక్ర’ అని హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో రాసి ఉంటుంది. దీంతోపాటు ముదరుపచ్చ,నారింజ రంగు కలిసి ఉన్న రిబ్బన్‌ను జత చేస్తారు.
 శాంతికాలంలో ఇచ్చే అత్యున్నత సాహస పురస్కారం ఇది. ఇది అమెరికాలో ఇచ్చే మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌కు సమానం. బ్రిటీష్‌ రాజ్యంలో అయితే జార్జ్‌ క్రాస్‌కు సరిసమానమైంది. ఇప్పటి వరకు ఈ అవార్డును 83 మందికి అందించారు.
  • కీర్తి చక్ర: ఇది వృత్తాకార రజతం పతకం. కదన రంగంలో అమరులైన వారికిచ్చే పురస్కారం ఇది. ఇది మిలిటరీ వాళ్లతో పాటు పౌరులకు ఇవ్వవచ్చు. 
ఇది శాంతి కాలంలో ఇచ్చే రెండో అత్యున్నత పురస్కారం. ఈ పతకంతో పాటు ముదురు పచ్చ రంగు, నారింజ రంగు లైన్లతో ఉన్న రిబ్బన్‌ను జత చేసి ఇస్తారు.
ఈ పతకం మధ్యలో ధర్మ చక్రం ఉంటుంది. ఈ పతకం వెనకవైపు ‘కీర్తి చక్ర’ అని హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో రాసి ఉంటుంది. ఇప్పటి వరకు కీర్తి చక్ర అవార్డు 458 మందికి బహూకరించారు.
  • శౌర్య చక్ర: ఇది పతకం వృత్తాకారంలో ఉండే కాంస్య పతకం. మధ్యలో ధర్మచక్రం ఉండి దాని చుట్టూ తామర పువ్వుల వరుస ఉంటుంది. ఈ పతకం వెనుక భాగంలో ‘శౌర్య చక్ర’ అని ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో రాసి ఉంటుంది. దీంతో పాటు రిబ్బన్‌ను జత చేస్తారు. 
ఇది ముదురుపచ్చ రంగులో ఉన్న ఈ రిబ్బను నారింజ రంగు లైను నాలుగు భాగాలు విభజిస్తుంది. శాంతికాలంలో ఇచ్చే మూడో అత్యున్నత పురస్కారం ఇది. శాంతి పరిరక్షణలో ముఖ్య భూమిక పోషించిన పౌరులు, పోలీసు, మిలిటరీ సిబ్బందికి ఇస్తారు. 
ఈ పురస్కారాన్ని మరణానంతరం కూడా ఇవ్వవచ్చు. ఇప్పటి వరకు ఈ అవార్డును 1997 మందికి అందజేసారు.

views: 753

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams