Current Affairs Telugu Daily

వ్యాధుల భారంపై ది గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ అధ్యయనం
1990-2016 మధ్యన ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల భారం(జీబీడీ)పై ది గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ అధ్యయనం గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నట్లు వెల్లడైంది.
 • ఈ అధ్యయనం ప్రకారం భారతదేశంలో 18 శాతం మంది శ్వాసకోశ వ్యాధి పీడితులు ఉన్నారు. మొత్తం వేర్వేరు రకాల దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో మంచాన పడుతున్నవారి సంఖ్య 1990లో 4-5 శాతం, 2016లో 6.4 శాతానికి పెరిగింది.
 • 2016 గణాంకాల ప్రకారం దీర్ఘకాలిక శ్వాస కోశ వ్యాధులతో మృతిచెందినవారు 10.9శాతం. దీనివల్ల మంచానపడినవారు 6.4శాతం. ఈ వ్యాధుల్లో దీర్ఘకాలంగా శ్వాసకు అడ్డుపడే వ్యాధి(క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌-సీఓపీడీ), ఆస్థమా బాధితుల సంఖ్య అధికంగా ఉంది.
 • 2016 గణాంకాల ప్రకారం తెలంగాణలో ప్రతి లక్ష జనాభాలో 4250-4749 మంది సీఓపీడీ వ్యాధిగ్రస్తులే కాగా, రాష్ట్రంలో ఆస్థమా బాధితులు 2750-3249గా నమోదయ్యారు.  పరిసరాల గాలి కాలుష్యం కారణంగా మహిళలు, పురుషుల్లోనూ దాదాపు 33.5శాతం మంది సీఓపీడీ బారిన పడుతున్నారు. ఇళ్లలో గాలి కాలుష్యం వల్ల 30.1 శాతం మంది మహిళలు సీఓపీడీ బారినపడి అవస్థలు పడుతున్నారు. 2016లో 9వ స్థానంలో ఉన్న దీర్ఘకాలంగా శ్వాసకు అడ్డుపడే వ్యాధి 2040 నాటికి 4వ స్థానానికి ఎగబాకిందని అధ్యయనం వెల్లడించింది. 
అధ్యయనంలోని ప్రధానాంశాలు
 • మొత్తం దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల్లో అత్యధికంగా సీఓపీడీ కారణంగా 75.6 శాతం మంది దీర్ఘకాలంగా మంచానికే పరిమితమవుతుండగా.. ఆస్థమాతో 20 శాతం మంది మంచాన పడుతున్నారు. 
 • సీఓపీడీ మరణాలు 1990లో మన దేశంలో 6.24 లక్షలు కాగా, 2016లో 8.48 లక్షలుగా నమోదైంది. 
 • సీఓపీడీ కేసుల సంఖ్య గత 25 ఏళ్లలో గణనీయంగా పెరిగింది. 1990లో 28.1 మిలియన్ల మంది ఈ వ్యాధికి గురవగా, 2016కు వచ్చేసరికి ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య 55.3 మిలియన్లకు పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీనివల్ల దీర్ఘకాలంగా మంచానపడినవారు 4.8శాతం. ఇలా మంచాన పడడానికి ధూమపానం నాలుగోవంతు కారణమవుతోంది.
 • 1990లో ఆస్థమాతో మరణాలు అంత గుర్తింపులేని సంఖ్యలో ఉండగా, 2016లో మాత్రం 1.83 లక్షలుగా గుర్తించారు. దీనివల్ల  మంచానపడేవారు 1.3శాతం. 
 • తెలంగాణలో సీఓపీడీ 1990లో ప్రతి లక్ష జనాభాకు 2750-3249 మంది ఉండగా, 2016లో ఈ సంఖ్య 4250-4749కి పెరిగింది. 
 • రాష్ట్రంలో ఆస్థమా 1990లో ప్రతి లక్ష జనాభాకు 2250-2749 మందిలో ఉండగా, 2016లో 2750-3249కి పెరిగింది. 
 • ఆస్థమా కేసులు సిక్కిం, త్రిపుర, నాగాలాండ్‌, కేరళల్లో ఎక్కువగా గుర్తించారు. 
 • దేశం మొత్తమ్మీద సీఓపీడీ కేసులు అత్యధికంగా జమ్ముకశ్మీర్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, డిల్లీ రాష్ట్రాల్లో నమోదు కాగా, 2వ అత్యధిక కేసులు నమోదైన జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, మిజోరాం రాష్ట్రాలున్నాయి.

views: 637

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams