Current Affairs Telugu Daily

లోక్‌పాల్ నియామకమెప్పుడు?:సుప్రీంకోర్టు
కేంద్రంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి
-అభ్యర్థుల పేర్లను సిఫార్సు చేయాలంటూ సెర్చ్ కమిటీకి ఆదేశం
-ఫిబ్రవరి నెలాఖరు వరకు జాబితా సమర్పించాలంటూ గడువు
ప్రథమ లోక్‌పాల్‌ నియామకానికి ఫిబ్రవరిలోగా అర్హుల పేర్లను సూచించాలని అన్వేషణ సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయి ఆధ్వర్యంలో ఈ సంఘం ఏర్పాటయింది. ఇది అర్హుల పేర్లతో జాబితాను రూపొందించి ప్రధాని అధ్యక్షతన ఏర్పాటయ్యే ఎంపిక సంఘానికి అందజేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ మాట్లాడుతూ తగిన సౌకర్యాలు కల్పించకపోవడం, సిబ్బందిని నియమించకపోవడం వల్లనే అన్వేషణ సంఘం (సెర్చి కమిటీ) ఇంకా చర్చలను కూడా ప్రారంభించలేకపోయిందని తెలిపారు. (Jan16)బుధవారమే తొలి సమావేశం జరిగిందని చెప్పారు. నిధుల కొరత లేదని, రూ.4.39 కోట్లు కేటాయించారని తెలిపారు. వ్యాజ్యం దాఖలు చేసిన కామన్‌ కాజ్‌ స్వచ్ఛంద సంస్థ తరఫున న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ అన్వేషణ సంఘం సభ్యుల పేర్లను ప్రభుత్వం బయటపెట్టలేదని, వారి వివరాలు వెబ్‌సైట్‌లో లేవని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కర్తవ్య నిర్వహణకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి ఏడో తేదీకి వాయిదా వేసింది.
అన్వేషణ సంఘం ఏర్పాటులోనే జాప్యం 
లోక్‌పాల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, మొదటి లోక్‌పాల్‌ నియామకం ఇంకా జరగలేదంటూ కామన్‌కాజ్‌ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అన్వేషణ సంఘం ఏర్పాటుపై కేంద్రం గత ఏడాది జులై 24న ప్రమాణ పత్రాన్ని సమర్పించగా వివరాలు సరిగ్గా లేవంటూ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్వేషణ సంఘంలో ఎవరిని నియమించాలన్న విషయమై ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, ప్రముఖ న్యాయకోవిదుడు ముకుల్‌ రోహత్గీ ఆధ్వర్యంలోని ఎంపిక సంఘం చర్చలు జరిపింది. ఛైర్‌పర్సన్‌ సహా కనీసం ఏడుగురు సభ్యులు ఉండాలని నిర్ణయించింది. అనంతరం సెప్టెంబరు 27న కేంద్ర ప్రభుత్వం ఎనిమిది మంది సభ్యులతో అన్వేషణ సంఘాన్ని నియమించింది. జస్టిస్‌ దేశాయి అధ్యక్షతన ఏర్పాటయిన ఈ సంఘంలో ఎస్‌బీఐ మాజీ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య, ప్రసార భారతి ఛైర్మన్‌ ఎ.సూర్యప్రకాశ్‌, ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఎ.ఎస్‌.కిరణ్‌ కుమార్‌, అలహాబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శాఖారాం సింగ్‌ యాదవ్‌, గుజరాత్‌ మాజీ డీజీపీ షబ్బీర్‌హుస్సేన్‌ ఖండ్వావాలా, రాజస్థాన్‌ కేడర్‌ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లలిత్‌ కె పన్వర్‌, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌ సభ్యులుగా నియమితులయ్యారు

views: 919

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams