రాష్ట్రంలో 1 గిగా వాట్ సామర్థ్యంగల డేటాసెంటర్ హబ్ ఏర్పాటుకు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆదానీ గ్రూప్‌తో చేసుకున్న ఒప్పందం ఆచరణలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి పరుగులు తీసే అవకాశముంది. డేటాసెంటర్ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. దీనివల్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 20శాతం పెరుగుతుందని ఒక అంచనా. పూర్తిస్థాయిలో ఆపరేషన్లోకి వస్తే రాష్ట్రానికి రూ.1.75 లక్షల కోట్ల లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.
అపారమైన అవకాశాలు
భారీ ఎత్తున డేటా నిల్వ చేసే కేంద్రాలనే డేటాసెంటర్లుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం వాణిజ్య, వ్యాపార, సేవారంగాల్లో కంప్యూటర్లు, డేటాతో ముడిపడే నడుస్తున్నాయి. అవి ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగాంటే ‘బ్యాకప్’ వ్యవస్థ ఉండాలి.
* ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరగడం, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక విధానాలు వచ్చిన నేపథ్యంలో వివిధ మార్గాల్లో డేటా ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. భారతదేశం డేటా గోప్యత, రక్షణ హక్కుల్ని పక్కాగా అమలు చేయనుంది. మన దేశంలో ఉత్పత్తయిన డేటాను ఇక్కడే నిల్వ చేయాలని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముసాయిదా నివేదికలో పేర్కొంది. ఇది చట్టంగా మారితే మన దేశంలో భారీ డేటా సెంటర్ల అవసరం చాలా ఏర్పడుతుంది.
* ప్రస్తుతం మన దేశంలోని డేటా సెంటర్ల సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యంలో 2 శాతం కంటే తక్కువే.
* మెగా డేటా సెంటర్ల ఏర్పాటుకు భారీ పెట్టుబడితోపాటు, పునరుత్పాదక ఇంధన వనరులు, సముద్ర జలాలు, చౌక విద్యుత్ అవసరం. అవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలంగా ఉన్నాయి. సముద్రగర్భంలో కేబుల్స్ వేయడం ఇక్కడ తేలిక.
పెట్టుబడులు: రూ.68,000 కోట్లు
రాష్ట్రంలో ఒక గిగావాట్ సామర్థ్యంగల డేటా సెంటర్ (డీసీ) ఏర్పాటు చేస్తే డీసీ డెవలపర్ ద్వారా రూ.7వేలకోట్లు, డీసీ వినియోగదారుల ద్వారా రూ.10వేల కోట్లు, దానికి అనుబంధ కార్యకలాపాల ద్వారా రూ.51వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా.
ఉద్యోగాలు: 88,200
డీసీ డెవలపర్ ద్వారా 8,050, వినియోగదారుల ద్వారా 14 వేలు, అనుబంధ కార్యకలాపాల వల్ల 66,150 ఉద్యోగాలు వస్తాయి.
జీఎస్డీపీ కంట్రిబ్యూషన్ రూ.1,72,000 కోట్లు
* డెవలపర్ ద్వారా రూ.17,800 కోట్లు, వినియోగదారుల ద్వారా రూ.25,200 కోట్లు, అనుబంధ కార్యకలాపాల వల్ల రూ.1,29,000 కోట్లు.
మూడు చోట్ల స్థలం
* ఆదాని డేటా సెంటర్ కోసం విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద 300, కాపులుప్పాడ వద్ద 100, విజయనగరంలో 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయిస్తుంది.
* డేటా సెంటర్ నిర్వహణకు అవసరమైన పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తికి రాయలసీమలో 10 వేల ఎకరాలు కేటాయించనున్నారు.
* ఆదానీ గ్రూపు రూ.10 కోట్ల వ్యయంతో 2 వేల మంది విద్యార్థుల కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేయనుంది.
* రూ.15 కోట్లతో 50 పడకల ఆసుపత్రి, రూ.25 లక్షల వ్యయంతో మొబైల్ హెల్త్‌కేర్ సదుపాయం కల్పించనుంది.
ప్రయోజనాలు
* డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఐటీ పెట్టుబడులన్నీ డేటా సెంటర్ల చుట్టూనే కేంద్రీకృతమవుతున్నాయి. విశాఖకు భారీగా ఐటీపరిశ్రమలు రావడానికి ఇది దోహదం చేస్తుంది.
views: 660