Current Affairs Telugu Daily

మరో సారి అమెరికాకు  కిమ్‌ హెచ్చరికలు
అణ్వాయుధ సామర్థ్యం గల ఉత్తరకొరియా ఇటీవల అమెరికాతో వైరాన్ని తగ్గించుకొని కాస్త నెమ్మదిగా ఉంటోంది. అయితే తాజాగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌  నూతన సంవత్సర ప్రసంగంలో భాగంగా అమెరికాను హెచ్చరించారు. ఒకవేళ అమెరికా తన హామీలను నిలుపుకోకపోతే, తమపై ఆంక్షలు విధిస్తూ ఒత్తిడి చేస్తే తమ పద్ధతిని మార్చుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేశారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని, ఆసక్తులను కాపాడుకోవడానికి తమకు మరో అవకాశం ఉండదని అన్నారు.
అలాగే తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను మరోసారి కలవడానికి సిద్ధంగా ఉన్నానని కిమ్‌ తెలిపారు. ఉత్తర కొరియాపై ఆంక్షలు సడలించాలని కిమ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య చర్చల్లో పురోగతి లేకపోవడంపై కిమ్‌ ప్రసంగంలో అసహనం కనిపిస్తోందని దక్షిణ కొరియా మంత్రి ఒకరు తెలిపారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత ఏడాది సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇరువురు నేతలు కొరియా ద్వీపాన్ని అణురహితంగా మార్చే ఒప్పందంపై సంతకం పెట్టారు. ఈ సమావేశం తర్వాత అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలను కూడా నిలిపేశారు.

views: 755

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams