ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న అమెరికా జీపీఎస్ దిక్సూచి వ్యవస్థకు పోటీగా చైనా తెచ్చిన ‘బీడో వ్యవస్థ’ (బీడీఎస్) అంతర్జాతీయ సేవలను ప్రారంభించింది.
బీడీఎస్-3 ప్రాథమిక వ్యవస్థ సిద్ధమైందని ఆ సంస్థ అధికార ప్రతినిధి రాన్ చెంగ్కి చెప్పారు. దీంతో ఇది ప్రపంచ వేదికపైకి అధికారికంగా ప్రవేశించినట్లయిందన్నారు. ప్రాంతీయ వ్యవస్థ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని తెలిపారు.
అంతర్జాతీయ సేవలకు సంబంధించి ఈ వ్యవస్థ 10 మీటర్ల మీటర్ల మేర కచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే అది అందించే డేటాలో తేడా 10 మీటర్ల లోపు ఉంటుంది.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇది 5 మీటర్ల కచ్చితత్వాన్ని అందిస్తోంది. చైనా తర్వాత బీడీఎస్లను ఉపయోగిస్తున్న మొట్టమొదటి దేశంగా పాకిస్థాన్ నిలిచింది.
బీడీఎస్ 2000 సంవత్సరం నుంచి చైనాలో సేవలు అందిస్తోంది. 2012లో ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి విస్తరించింది. జీపీఎస్ (అమెరికా), గ్లోనాస్ (రష్యా), గెలీలియో (ఐరోపా) తర్వాత వినియోగంలోకి వచ్చిన నాలుగో అంతరిక్ష ఆధారిత దిక్సూచి వ్యవస్థగా బీడీఎస్ గుర్తింపు పొందింది.
దీనికింద 33 ఉపగ్రహాలు సేవలు అందిస్తున్నాయి. వచ్చే రెండేళ్లలో మరో 11 ఉపగ్రహాలను చైనా ప్రయోగించానుకుంటోంది. దీనివల్ల బీడీఎస్ అంతర్జాతీయ సేవలు మరింత మెరుగుపడతాయి. ‘నావిక్’ పేరుతో భారత్ కూడా ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థను నిర్మిస్తోంది.