Current Affairs Telugu Daily

జీశాట్‌-11 ప్రయోగం విజయవంతం 
భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో అత్యంత భారీ ఉపగ్రహం జీశాట్‌-11 విజయవంతంగా నింగిలోకి చేరింది. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరులో ఉన్న అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియాన్‌-5 రాకెట్‌ ద్వారా జీశాట్‌-11 దూసుకెళ్లింది.
 • భారత కామానం ప్రకారం 2018 డిసెంబర్‌ 4న ఈ ప్రయోగం జరిగింది. దీంతో దేశంలో బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలకు మరింత ఊతం లభించనుంది. ఇంటర్నెట్‌ వేగం భారీగా పెరగనుంది. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)కు చెందిన అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3కి కేవలం నాలుగు టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే మోసుకెళ్లే సామర్థ్యం ఉంది.
 • జీశాట్‌-11 బరువు 5 టన్నులకు పైబడి ఉండటం వల్ల విదేశీ వాహకనౌకపై ఇస్రో ఆధారపడింది.
 • నింగిలోకి లేచిన 33 నిమిషాల తర్వాత జీశాట్‌-11 ఉపగ్రహం ఏరియాన్‌-5 రాకెట్‌ నుంచి విడిపోయి, భూఅనువర్తిత బదిలీ కక్ష్యలోకి చేరింది.
 • అనంతరం కర్ణాటకలోని హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ.. ఈ ఉపగ్రహ నియంత్రణ బాధ్యతలను తీసుకుంది.
 • ఈ ఉపగ్రహంలోని ఇంజిన్‌ను మండించడం ద్వారా దీని కక్ష్యను దశలవారీగా పెంచి.. భూమధ్యరేఖకు ఎగువన 36వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెడతారు.
 • తుది కక్ష్యలోకి ప్రవేశించాక ఉపగ్రహాన్ని వినియోగంలోకి తీసుకొస్తారు.
 •  జీశాట్‌-11తోపాటు దక్షిణ కొరియాకు చెందిన 3507 కిలో జీయో-కోంప్‌శాట్‌-2ఏను కూడా ఏరియాన్‌ రాకెట్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
 • జీశాట్‌-11 ఇస్రో రూపొందించిన అత్యంత బరువైన, అధునాతన హైథ్రోపుట్‌ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం (హెచ్‌టీఎస్‌). ఇది భారతదేశానికి చెందిన ‘అత్యంత ఖరీదైన అంతరిక్ష ఆస్తి’గా ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ అభివర్ణించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ హెచ్‌టీఎస్‌లు ఇంటర్నెట్‌ తీరుతెన్నులను మార్చేశాయి. అనేక రెట్లు వేగంతో, సాఫీగా, చౌకగా ఇంటర్నెట్‌ సంధానతను కల్పించాయి.
 • భారత్‌ కూడా ‘డిజిటల్‌ ఇండియా’ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా సెకనుకు 100 గిగాబైట్ల (జీబీపీఎస్‌) వేగాన్ని అందించేందుకు 4 హెచ్‌టీఎస్‌ ఉపగ్రహాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. అందులోని జీశాట్‌-19, జీశాట్‌-29 ఇప్పటికే కక్ష్యలోకి చేరగా.. జీశాట్‌-11 2018 డిసెంబర్‌ 5న వాటికి తోడైంది. నాలుగోదైన జీశాట్‌-20ని 2019లో ప్రయోగిస్తారు.
 • ఈ నాలుగు ఉపగ్రహాలూ కలసి దేశంలో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలను అందిస్తాయి. ముఖ్యంగా కేబుల్‌ సౌకర్యంలేని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో విస్త ృత సేవలు అందిస్తాయి. అధునాతన టెలికం, డీటీహెచ్‌ సేవలను పొందవచ్చు.
 • ఇప్పటివరకూ భారత్‌ ప్రయోగించిన అన్ని కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు ఉమ్మడి సామర్థ్యం తాజా జీశాట్‌-11 ఒక్కదానిలోనే ఉంది. ఇది పాత తరానికి చెందిన 30 ఉపగ్రహాలతో సమానం. ఈ ఉపగ్రహం సెకనుకు 16 గిగాబైట్ల (జీబీపీఎస్‌) వేగాన్ని అందించగలదు. 2017లో ప్రయోగించిన జీశాట్‌-16కు 4 జీబీపీఎస్‌ సామర్థ్యమే ఉంది. 2019లో ప్రయోగించే జీశాట్‌-20 ద్వారా 70 జీబీపీఎస్‌ వేగాన్ని అందుకోవచ్చు.
 • జీశాట్‌-11 భారత భూభాగంతోపాటు చుట్టుపక్కల ఉన్న దీవుల్లోని వినియోగదారులకు హై డేటా ఇంటర్నెట్‌ సేవలను అందిస్తుంది. 
 • జీశాట్‌-11 ఇస్రో రూపొందించిన 34వ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం.
 • తొలిసారిగా ఏరియాన్‌ రాకెట్‌ ద్వారా ‘యాపిల్‌’ అనే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని భారత్‌ రోదసిలోకి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఇప్పటివరకూ 22 ఉపగ్రహాలను ప్రయోగించింది.
జీశాట్‌-11 వివరాలు.. 
బరువు: 5,854 కిలోలు 
ట్రాన్స్‌పాండర్లు:  40 (కేయూ, కేఏబ్యాండ్లలో) 
జీవితకాలం: 15 ఏళ్లు 
వ్యయం:రూ.1200 కోట్లు (ప్రయోగ ఖర్చుతో కలిపి)

views: 864Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams