గవర్నర్ పాలన కొనసాగుతున్న జమ్మూకశ్మీర్ రాష్ట్ర శాసనసభను గవర్నర్ సత్యపాల్ మాలిక్ 2018 నవంబర్ 21 రాత్రి రద్దు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతుతో పీడీపీ-కాంగ్రెస్ కూటమి సిద్ధమయిన సమయంలో గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పీపుల్స్ కాన్ఫరెన్స్ కూడా బీజేపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ రెండు పక్షాలు లేఖలు ఇచ్చిన కొద్ది గంటల్లోనే అసెంబ్లీని రద్దు చేస్తూ అధికారిక ప్రకటన వెలువడింది.
రాష్ట్ర రాజ్యాంగంలోని వివిధ నిబంధనల కింద అసెంబ్లీని రద్దుచేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది. పీడీపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగిన నేపథ్యంలో 2018 జూన్ 19 నుంచి 6 నెలల పాటు రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు.
అప్పటినుంచి అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉండగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. గవర్నర్ తాజా నిర్ణయంతో జమ్మూ-కశ్మీర్ 2018 డిసెంబరు 18 తర్వాత కేంద్ర పాలనలోకి వెళుతుంది. 2019లో సార్వత్రిక ఎన్నికతో పాటు కశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.