Current Affairs Telugu Daily

ఆదిమ తెగ చేతిలో అండమాన్‌లో అమెరికన్‌ హత్య
అండమాన్‌ నికోబార్‌ దీవుల సమూహంలోని ఉత్తర సెంటినెల్‌ దీవిలో రక్షిత ఆదిమ తెగ వారిని కలుసుకోవడానికి వెళ్లిన అమెరికా జాతీయుడు జాన్‌ అలెన్‌(27)ను ఆ తెగ వారు హతమార్చారు.
 • బయటివారిని బద్ధ శత్రువులుగా పరిగణించే ‘సెంటినెలీస్‌’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. 2018 నవంబర్‌ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 • అమెరికన్‌ అయిన జాన్‌ అలెన్‌ (27) గతంలో ఐదుసార్లు అండమాన్‌, నికోబార్‌ దీవులను సందర్శించారు. తాజా పర్యటనలో ఆయన సెంటినెలీస్‌ తెగ వారితో ముచ్చటించాలని భావించారు.
 • జాన్‌ క్రైస్తవ మతబోధకుడని, ఆ ఆదివాసీ తెగవారికి కూడా మత బోధన చేయాన్నది ఆయన ఉద్దేశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే సెంటినెలీస్‌ తెగవారు బయటివారితో సంబంధాలను ఏ మాత్రం సహించరు. దగ్గరకు వస్తే బాణాలు వేస్తారు. 
 • ఈ తెగవారిని కలిసేందుకు జాన్‌ నవంబర్‌ 14న ఒకసారి విఫలయత్నం చేశారు. 16న ఆయన పూర్తి సన్నద్ధతతో మరోసారి ప్రయత్నించారు.
 • ఆ రోజున మత్స్యకారులకు రూ.25వేలు చెల్లించి, చిదియాతాపు ప్రాంతం నుంచి వారి పడవలో సెంటినెల్‌ దీవి సమీపం వరకూ వెళ్లారు. అక్కడి నుంచి ఆయన.. మడతపెట్టేసే వీలున్న ఒక చిన్న పడవలో తీరం దిశగా పయనమయ్యారు. మత్స్యకారుల కథనం ప్రకారం.. దీవిలో కాలు మోపగానే జాన్‌పై బాణాల వర్షం కురిసింది.
 • అయినా ఆయన ముందుకు నడుచుకుంటూ వెళ్లి, కుప్పకూలారు. ఆదిమ తెగ వారు ఆయన మెడకు తాడు కట్టి తీరం వద్దకు ఈడ్చుకెళ్లారు. ఆయన మ ృతదేహాన్ని సగం మేర ఇసుకలో పూడ్చిపెట్టారని, ఇదంతా తాము తిరుగు ప్రయాణంలో చూశామని మత్స్యకారులు వివరించారు. మరుసటి రోజు  చూసినప్పుడు కూడా జాన్‌ మృతదేహం అక్కడే ఉందన్నారు.
సెంటినలీస్‌ నేపథ్యం...
 • సెంటినలీస్‌లు డబ్బు వాడరు, దుస్తుల స్థానంలో ఆకులు చుట్టుకుని జీవనం సాగిస్తారు. సెంటినలీస్‌ను సంప్రదించేందుకు సాధారణ మానవుడు ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. దండోపాయం మినహా సామ, దాన ఉపాయాలు అన్నీ వాడారు. అయినా ఇప్పటివరకూ వాళ్లు లొంగలేదు.
 • దూరం నుంచి గమనించిన దాని ప్రకారం.. సెంటినలీస్‌కు పడవలు తయారు చేయడం వచ్చు. లోతు తక్కువ ఉన్న ప్రాంతాల్లో చేపలు పడతారు. 2004లో వచ్చిన సునామీతో సర్వం కోల్పోయినా.. భారత ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా జారవిడిచిన ఆహారాన్ని కూడా సెంటినలీస్‌లు ముట్టుకోలేదు.
 • అప్పట్లో దారి తప్పి ఆ దీవిలోకి అడుగు పెట్టిన ఇద్దరు జాలర్లను చంపేశారు. ఆ తరువాత భారత ప్రభుత్వం వీరి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. అప్పుడప్పుడూ కోస్ట్‌గార్డ్‌కు చెందిన పడవలు నార్త్‌ సెంటినెల్‌ ద్వీపం వద్ద కాసేపు లంగరేసి నిలబడతాయి.
 • బ్రిటిష్‌ మిలటరీ 1880లో సెంటినలీస్‌పై దాడి చేసి వృద్ధ దంపతులు, నలుగురు సంతానాన్ని పోర్ట్‌బ్లెయిర్‌కు తీసుకొచ్చింది. కొన్ని రోజులకే దంపతులు చనిపోవడంతో ఆ సంతానాన్ని మళ్లీ అడవుల్లో వదిలేశారు.
 • 1967లో టి.ఎన్‌.పండిట్‌ అనే పురాతత్వ శాస్త్రవేత్త సెంటినలీస్‌ను సంప్రదించే ప్రయత్నం చేస్తే.. వాళ్లు అడవుల్లోకి పారిపోయారు. ఆ తరువాత భారత నౌకాదళం ఈ దీవి సమీపంలో కొన్ని బహుమతులు విడిచిపెట్టి.. ఎవరైనా వాటిని తీసుకెళతారా అని వేచిచూసింది. కానీ వారు బాణాలు ఎక్కుపెట్టి అందరినీ తరిమేశారు.
 • 1974లో నేషనల్‌ జియోగ్రఫిక్‌ చానల్‌ సిబ్బంది ఓ డాక్యుమెంటరీ తీద్దామని నార్త్‌ సెంటినలీస్‌ ద్వీపానికి వెళ్లారు. అల్యూమినియం పాత్రలు, కొబ్బరిబోండాలు, ఓ పందిని బహుమతులుగా తీసుకుని వెళ్లారు. తీరంలో అడుగుపెట్టారో లేదో.. వారిపై బాణాల వర్షం కురవడం మొదలైంది.
 • బహుమతులన్నీ అక్కడే వదిలేసి పరుగు లంకించుకున్నారు. సెంటినలీస్‌లు కొబ్బరిబోండాలు, కొన్ని పాత్రలు తీసుకెళ్లారుగానీ, ఆ పందిని మాత్రం అక్కడికక్కడే చంపి పాతిపెట్టేశారు.  
 • 1991లో టి.ఎన్‌.పండిట్‌ మరోసారి వారిని సంప్రదించే ప్రయత్నం చేసి పాక్షిక విజయం సాధించారు. కొంతమంది పండిట్‌ పడవలోకి ఎక్కడమే కాకుండా అక్కడున్న వస్తువులను ఆసక్తిగా తడిమి చూశారు.
 • ఆ తరువాత సెంటినలీస్‌లు అంటువ్యాధుల బారిన పడటంతో భారత ప్రభుత్వం వారి గురించి ఆరా తీయడానికి స్వస్తి పలికింది.

views: 879Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams