Current Affairs Telugu Daily

స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ ఆవిష్కరణ
ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా తీరాన కేవడియా వద్ద 182 మీటర్ల ఎత్తున నిర్మించిన ఐక్యతా విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) పటేల్‌ 143వ జయంతి సందర్భంగా 2018 అక్టోబర్‌ 31న ప్రధాని నరేంద్రమోడి ఆవిష్కరించారు. 
 • 182 మీటర్ల ఎత్తున విగ్రహాన్ని నిర్మించడానికి రూ.2989 కోట్లు ఖర్చు చేశారు
 • పటేల్‌ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఐక్యత పరుగును నిర్వహించారు.
 • దీనిలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. డిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తదితరులు పాల్గొని పటేల్‌కు నివాళుర్పించారు. ‘రాష్ట్రీయ ఏక్తా దివస్‌’ను దేశమంతటా పాటించారు.
నిర్మాణం 
 • పటేల్‌ విగ్రహాన్ని అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించారు. అక్కడ నివసించే స్థానికులకు ఇబ్బంది లేకుండా, సందర్శకులు ప్రశాంతంగా చూసేలా ఏర్పాటు చేశారు. కాంస్యంతో నిర్మించడం వల్ల చూడటానికి అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది.
 • విగ్రహం ఛాతి వరకు వెళ్లి పరిసరాలను చూసేలా లోపలి నుంచి రెండు లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. కాంక్రీట్‌తో నిర్మించిన రెండు కాళ్ల లోపలి నుంచి ఈ రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు.
 • వాటిద్వారా 157 మీటర్ల ఎత్తు వరకూ సందర్శకులు వెళ్లవచ్చు. అంటే పటేల్‌ ఛాతి దగ్గర నుంచి ప్రక ృతి అందాలను వీక్షించే అవకాశం ఉంది.
హంగులు.. 
 • రోడ్డు, రైలు అనుసంధానంతో మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. విగ్రహం ఉన్న సాధు ఐలాండ్‌ను వంతెన నిర్మించి హైవేతో కలిపారు. గిరిజనుల అభివృద్ధికి ఇక్కడ పాఠశాలలు, విశ్వవిద్యాలయం ఏర్పాటవుతాయి. 
మెమోరియల్‌, సందర్శకుల కేంద్రం. 
విద్యా పరిశోధనాల కేంద్రం, నాలెడ్జ్‌ సిటీ. 
గరుడేశ్వర్‌ నుంచి బద్‌బుత్‌ వరకూ పర్యాటక కారిడార్‌. 
క్లీన్‌ టెక్నాలజీ పరిశోధనా కేంద్రం, వ్యవసాయ శిక్షణా కేంద్రం
ఇక్కడే ఎందుకంటే... 
సర్దార్‌ సరోవర్‌ డ్యాం ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. అది ప్రపంచంలోనే అత్యధిక కాంక్రీట్‌ వాడిన రెండో డ్యాంగా ప్రసిద్ధి చెందింది. 1210 మీటర్ల పొడవైన కాంక్రీట్‌ గ్రావిటీ డ్యాం ఇది. 121 మీటర్ల ఎత్తున ఉంది. విగ్రహం నుంచి చూస్తే డ్యాం అందాలు కనువిందు చేస్తాయి.
ప్రాజెక్టు లక్ష్యం 
 • పటేల్‌ విగ్రహం ఏర్పాటుకు గుజరాత్‌ ప్రభుత్వం సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ రాష్ట్రీయ ఏక్తా ట్రస్టును (ఎస్‌వీపీఆర్‌ఈటీ) ఏర్పాటు చేసింది.
 • ఈ సంస్థ విగ్రహం ఏర్పాటుతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి గల అవకాశాలను అధ్యయనం చేసింది.
 • 2010లో విగ్రహం ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోడి శ్రీకారం చుట్టారు. అప్పటికే ఏర్పాటై ఉన్న సర్దార్‌ సరోవర్‌ నర్మదా నిగం లిమిటెడ్‌ ఇందులో పాలుపంచుకుంది.
సాంకేతికత
 • నాలుగు అంచెల్లో నిర్మాణం. త్రీ డైమెన్షనల్‌ స్కానింగ్‌ టెక్నిక్‌, కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ ప్రొడక్షన్‌ టెక్నిక్‌ను ఉపయోగించారు. టర్నర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రధాన నిర్మాణదారులుగా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంది.
 • దానికి మెయిన్‌హార్డ్‌, మైఖేల్‌ గ్రేవ్స్‌, ఎల్‌అండ్‌టీ సంస్థలు సహకరించాయి. స్ట్రక్చర్‌ డిజైన్‌, ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌, కాంక్రీట్‌ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఎల్‌అండ్‌టీ చేపట్టింది.
 • విగ్రహ నిర్మాణం కోసం దేశంలోని లక్షా 69 వేల గ్రామాల నుంచి ఇనుమును సేకరించారు.
స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ విశేషాలు..
విగ్రహం ఎత్తు: 182 మీటర్లు (సుమారు 597 అడుగు) 
నిర్మాణ ప్రదేశం: సాధు బెట్‌ ఐలాండ్‌. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌కు 3.5 కిలోమీటర్ల దూరం. వింధ్యాచల్‌, సాత్పూర పర్వత సానువు మధ్య. 
విగ్రహ నిర్మాణానికి వాడిన సామగ్రి: 70 వేల టన్నుల సిమెంట్‌, 24,500 టన్నుల ఉక్కు, 1,700 మెట్రిక్‌ టన్నుల కంచు   
నిర్మాణ వ్యయం: రూ. 2,989 కోట్లు
విగ్రహం ప్రాజెక్టు విస్తీర్ణం: 20,000 చదరపు మీటర్లు
పర్యాటకు సమీపంలోని ప్రకృతి అందాల్ని చూసేందుకు విగ్రహం లోపల 135 మీటర్ల ఎత్తులో గ్యాలరీ ఏర్పాటు
ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తయిన చైనాలోని స్ప్రింగ్‌ టెంపుల్‌ బుద్ధ విగ్రహం ఎత్తు 153 మీటర్లు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహం కన్నా పటేల్‌ విగ్రహం రెట్టింపు ఎత్తయినది.
పెద్ద రాయిని తొలిచి విగ్రహాన్ని చెక్కాలని భావించినా, అంతటి కఠినమైన రాయి లభించకపోవడంతో సిమెంట్‌, స్టీల్‌, కంచుతో నిర్మించారు.
గుజరాత్‌ సీఎంగా ఉండగా పటేల్‌కు భారీ విగ్రహం నిర్మించాలని మోడి సంకల్పించారు. 2013లో దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
లార్సెన్‌ అండ్‌ టుబ్రో సంస్థ రికార్డు స్థాయిలో 33 నెలల్లో కట్టింది.
విగ్రహం గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకోగలదు. 6.5 తీవ్రతతో వచ్చే భూకంపాలనూ తట్టుకుని నిలవగలదు.
2 వేల రకాల పటేల్‌ ఫొటోల్లో ఒకదాని ఓకే చేసి దానిలా విగ్రహాన్ని మలిచారు.
విగ్రహాన్ని మొత్తం 5 జోన్లుగా విభజించారు. ఒకటో జోన్‌లో మోకాళ్ల కింది భాగం, రెండో జోన్‌లో తొడులు(149 మీటర్లు), మూడో జోన్‌లో పర్యాటలకు గ్యాలరీ(153 మీటర్లు), నాలుగో జోన్‌లో మెయింటెనెన్స్‌, ఐదో జోన్‌లో తల, భుజాలు ఉన్నాయి. 4, 5 జోన్లలోకి ప్రవేశం నిషేధం.
విగ్రహంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ సెకనుకు 4 మీటర్ల వేగంతో సందర్శకులను 135 మీటర్ల ఎత్తులోని గ్యాలరీకి తీసుకెళ్తుంది.
పర్యాటకుల గ్యాలరీలోకి ఒకేసారి 200 మంది వెళ్లొచ్చు.
సందర్శకు గ్యాలరీ నుంచి సర్దార్‌ సరోవర్‌ డ్యాంతో పాటు 12 కి.మీ పొడవైన గరుడేశ్వర రిజర్వాయర్‌ను వీక్షించవచ్చు.
విగ్రహం దగ్గరికి వెళ్లాంటే రూ.120, విగ్రహం లోపల 135 మీటర్ల ఎత్తులోని గ్యాలరీలోకి వెళ్లాలంటే టికెట్‌ రూ.350 చెల్లించాలి.
విగ్రహ ప్రవేశంలోని మ్యూజియంలో పటేల్‌ జీవిత విశేషాలు, స్థానిక గిరిజన ప్రజల జీవన విధానాలపై ప్రదర్శనను ఏర్పాటుచేశారు.
ఒక మనిషి 5.6 అడుగు ఉన్నాడనుకుంటే అలాంటి 100 మంది వ్యక్తులను నిలువుగా ఒకరిపై ఒకరిని నిలిపితే ఎంత ఎత్తు ఉంటారో అంత ఎత్తున విగ్రహం ఉంటుంది.

స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీకి జీవం పోసింది..ఒక వడ్రంగి
ప్రపంచంలోనే ఎత్తైన పటేల్‌ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి 93 సంవత్సరాల రామ్‌ వంజి సుతార్‌. ఆయన పద్మభూషణ్‌, పద్మశ్రీ  అవార్డు గ్రహీత. ఏడు దశాబ్దాలుగా దాదాపు 8వేల పైచిలుకు విగ్రహాలకు జీవం పోసిన ఘనత ఆయనది. 182 మీటర్ల ఎత్తు కలిగిన పటేల్‌ ఐక్యతా విగ్రహం ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు.
 • మహారాష్ట్రలోని థూలే జిల్లా పరిధిలోకి వచ్చే గొండురు గ్రామానికి చెందిన సుతార్‌ 1925లో జన్మించారు. ఆయన తండ్రి ఒక వడ్రంగి. చిన్నతనం నుంచే చిత్రాలు గీయడంలో సుతార్‌ ఆసక్తి కనబరుస్తూ వచ్చేవారు. పెన్సిల్‌తో కాగితాలు, గోడపై చిత్రాలు గీయడం ప్రారంభించారు.
 • ఇదే సమయంలో ఆయన రాళ్లను చెక్కుతూ... గులకలతో బొమ్మను తయారు చేయడం ద్వారా తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ వచ్చారు.
 • అనంతరం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పొట్ట చేతపట్టుకొని ఆయన ముంబయికు వెళ్లి అక్కడ విభిన్న ఉద్యోగాలను చేశారు. తద్వారా సంపాదించి దాచుకున్న డబ్బుతో జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చేరి తన కళ కలను సాకారం చేసుకోవడంలో తొలి అడుగు వేశారు.
 • అక్కడ చదువు పూర్తి చేసుకున్న తర్వాత 1959లో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖలో కొన్నాళ్లు పని చేశారు. అనంతరం స్వతంత్రంగా శిల్పాలను రూపొందించడం ప్రారంభించారు.
 • నోయిడాలోని శిల్పకళా కేంద్రం నుంచి తన కుమారుడు అనిల్‌ రామ్‌ అందిస్తున్న సహకారంతో తన శిల్పకళా చాతుర్యాన్ని చాటుతూ స్మారక విగ్రహాకు రూపకల్పన చేస్తున్నారు. 
సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జీవనయానం
పూర్తి పేరు: వల్లభ్‌భాయ్‌ జవేరీభాయ్‌ పటేల్‌ 
పుట్టిన తేదీ: 1875 అక్టోబరు 31 
తల్లిదండ్రు: లాడ్‌భాయి, జవేరీభాయ్‌. 
జన్మస్థలం: నడియాద్‌, గుజరాత్‌
1893లో 18ఏళ్ల వయసులోనే జవేర్బాను పటేల్‌ పెళ్లి చేసుకున్నారు. 
1901 నుంచి గోద్రా జిల్లా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు.
1903లో కుమార్తె మణిబెన్‌, 1905లో కుమారుడు దహ్యాభాయ్‌ జన్మించారు. 
1910లో మిడిల్‌ టెంపుల్‌ వర్సిటీలో న్యాయవిద్య పై చదువుకు లండన్‌ వెళ్లారు.
1914లో క్రిమినల్‌ లాయరుగా అహ్మదాబాద్‌లో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 
1915లో గుజరాత్‌ సభలో సభ్యుడిగా నియమితులయ్యారు. ముంబయిలో జరిగే భారత జాతీయ కాంగ్రెస్‌ సభకు ప్రతినిధిగా ఎంపికయ్యారు.
1917 జనవరి 5న అహ్మదాబాద్‌ మున్సిపాలిటీలోని దరియాపూర్‌ వార్డు సభ్యుడిగా గెలిచారు. అదే ఆయన రాజకీయ ప్రవేశం.ఈ ఎన్నికలను కొందరు సవాలు చేయడంతో రద్దైంది. మే 14న మళ్లీ ఎన్నిక నిర్వహించగా తిరుగులేని విజయం సాధించారు.
1931లో భారత జాతీయ కాంగ్రెస్‌కు పోటీ ద్వారా ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. 
1947లో దేశ విభజనపై జరిగిన సమావేశంలో పాల్గొన్న పటేల్‌ విభజనకు అంగీకరించారు.
1950 డిసెంబరు 15న ముంబయిలో మృతి చెందారు. 
1991లో భారతరత్న లభించింది.

గుజరాత్‌ గవర్నర్‌ - ఒ.పి.కోహ్లి
గుజరాత్‌ ముఖ్యమంత్రి - విజయ్‌ రూపానీ

ప్రపంచంలో ఎత్తైన విగ్రహాలు.. 
1     స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ (భారత్‌) 
597 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం రెండో అతి పెద్ద విగ్రహమైన చైనాలోని బుద్ధ విగ్రహం కంటే  100 అడుగు ఎత్తైనది. పటేల్‌ విగ్రహం అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ కంటే రెట్టింపు ఎత్తులో ఉంటుంది. రోజుకు 15వేల మంది పర్యాటకులు విగ్రహ సందర్శనకు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 
2     స్ప్రింగ్‌ టెంపుల్‌ బుద్ధ (చైనా)
2002లో నిర్మించిన ఈ బుద్ధ విగ్రహం చైనాలోని హెనెన్‌ ప్రావిన్సులో 503 అడుగుల ఎత్తున ఉంటుంది. ఇందులో 66 అడుగు లోటస్‌ నిర్మాణం ఉంటుంది. ఈ విగ్రహం సందర్శనకు ఏటా 10లక్షల మంది వస్తున్నారని హాంకాంగ్‌ చెబుతోంది. 
3     మయన్మార్‌ 
మయన్మార్‌లో ప్రపంచంలోనే మూడో ఎత్తైన విగ్రహం ఉంది. ఇదీ బుద్ధ విగ్రహమే. లెక్యూన్‌ సెట్క్యార్‌ పేరుతో ఉన్న దీని ఎత్తు 427 అడుగు. దీని కంటే పటేల్‌ విగ్రహం 173 అడుగు అధిక ఎత్తు ఉంటుంది.
4     జపాన్‌ 
నాలుగో అతిపెద్ద బుద్ధ విగ్రహం జపాన్‌లోని ఉషుకిలో ఉంది. దీని ఎత్తు 394 అడుగు. ఇందులో 30 అడుగు బేస్‌, మరో 30 అడుగు లోటస్‌ ఉంటాయి. సందర్శకులు 250 అడుగుల ఎత్తువరకూ వెళ్లొచ్చు. 
5     చైనా  
గునియన్‌ ఆఫ్‌ ద సౌత్‌  సీ ఆఫ్‌ సాన్యా. ఈ విగ్రహం చైనాలోనే ఉంది. దీని ఎత్తు 354 అడుగులు.

views: 846

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams