Current Affairs Telugu Daily

కాంగో వైద్యుడు మక్వీజ్‌, ఇరాక్‌ యువతి నదియాకు నోబెల్‌ శాంతి పురస్కారం
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరుగుతున్న కల్లోలిత ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న లైంగిక హింసలపై అలుపెరుగని పోరు జరుపుతున్న కాంగోకు చెందిన వైద్యుడు డెనిస్‌ మక్వీజ్‌(63), ఇరాక్‌లోని యాజిది తెగకు చెందిన యువతి నదియా మురాద్‌(25)కు 2018 నోబెల్‌ శాంతి పురస్కారం దక్కింది.
  • యుద్ధాల్లో లైంగిక హింసను ఒక ఆయుధంగా వాడుకోకుండా నిరోధించేందుకు ఈ ఇద్దరు ఎంతో పోరాడారని నోబెల్‌ ఎంపిక కమిటీ ప్రశంసించింది.
  • కాంగోలో యుద్ధ సమయాల్లో లైంగిక హింసకు గురైన మహిళలు శారీరక, మానసిక క్షోభ నుంచి కోలుకునేలా మక్వీజ్‌ గత రెండు దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. 1999లో తాను స్థాపించిన ఆసుపత్రిలో వేలాది మంది బాధితులకు చికిత్స అందించారు. ‘డాక్టర్‌ మిరాకిల్‌’గా పిలిచే మక్వీజ్‌..యుద్ధ సమయాల్లో మహిళపై దాష్టీకాను నిర్మొహమాటంగా ఖండించారు. 
  • హాలీవుడ్‌ను కుదిపేసిన ‘మీటూ’ ఉదంతం వెలుగు చూసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా లైంగిక నేరాలపై పోరాడిన వారికి నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది
నదియా మురాద్‌
  • 2014లో ఐఎస్‌ ఉగ్రవాదుల చేతిలో అపహరణకు గురైన మురాద్‌..3 నెలల తరువాత వారి చెర నుంచి తప్పించుకుంది. ఉగ్రవాదుల లైంగిక బానిసలుగా చేసుకున్న వేలాది మంది యాజిది మహిళలు, చిన్నారుల్లో మురాద్‌ కూడా ఒకరు. నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్న ఇరాక్‌కు చెందిన యాజిదీ యువతి మురాద్‌ నదియా (25)ది పోరాట గాథ.
  • 2014లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల ఉత్తర ఇరాక్‌లోని ఓ గ్రామంపై తెగబడ్డారు. మైనారిటీలైన కుర్దుండే ఈ గ్రామంపై దాడిచేసి.. కనబడ్డ మగవారిని చంపేశారు. మహిళలు, చిన్నారులను ఎత్తుకెళ్లారు.
  • వారిలో మురాద్‌ నదియా (25) ఒకరు. వీరిని తీసుకెళ్లిన ఐఎస్‌ ఉగ్రవాదుల మహిళలు, చిన్నారులని తేడా లేకుండా అందరిపై దారుణంగా, కిరాతకంగా వ్యవహరించారు. లైంగిక బానిసలుగా తమ వద్ద పెట్టుకుని దారుణమైన అకృత్యాలకు పాల్పడ్డారు.
  • మూడు నెలలపాటు వీరి అరాచకాలను భరించిన నదియా.. అతికష్టం మీద తప్పించుకున్నారు. ఐసిస్‌ నుంచి తప్పించుకుని శరణార్థుల శిబిరానికి చేరుకున్న తర్వాత.. ఆమె జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలైంది.
  • తన లాగా మరెవరూ ఈ కిరాతక కూపంలో ఉండకూడదని నిశ్చయించుకున్నారామె. శిబిరంలో బ్రిటీష్‌ లాయర్‌, హక్కు కార్యకర్తలు అమల్‌ క్లూనీ పరిచయం ఆమె ఆశయానికి మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. అదే.. యాజిదీకు జరుగుతున్న అన్యాయం ప్రపంచానికి వివరించేలా చేసింది.
  • ఐక్యరాజ్య సమితి వంటి వేదికపై నదియా.. తన గళం విప్పే అవకాశాన్ని కల్పించింది. దీని ఫలితంగానే.. దాదాపు నాలుగున్నర లక్షల మంది బాధితులకు ఐసిస్‌ నరకకూపం నుంచి విముక్తి లభించింది.  
  • తన తోటి యాజిదీలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల గురించి ‘ద లాస్ట్‌ గర్ల్‌’ పేరుతో నదియా ఒక పుస్తకాన్ని రాశారు. 2017లో ఈ పుస్తకం ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి అమల్‌ క్లూనీ ముందుమాట రాసి మరోసారి నదియాకు మద్దతుగా నిలిచారు.
  • ఇరాక్‌లో ఐసిస్‌ దురాగతాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించడం నదియా పోరాట ఫలితమే. 
డాక్టర్‌ మక్వీజ్‌
  • డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో.. రాజకీయ హింస, అధికార, ప్రభుత్వ వ్యతిరేక దళాల మధ్య అంతర్యుద్ధంతో రావణకాష్టంలా మారింది. దశాబ్దాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా లెక్కలేనన్ని కుటుంబాలు అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇది చాదన్నట్లు రెండు వర్గాలు మహిళలను తమ ఆయుధాలుగా వాడుకుంటున్నాయి.
  • ఈ సంఘర్షణలో లెక్కలేనంత మంది మహిళలు లైంగిక హింసకు గురయ్యారు. లైంగిక హింస బాధితులను ఆదుకునేందుకు డాక్టర్‌ డెనిస్‌ మక్వీజ్‌ రెండు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు.
  • 1999లో దక్షిణ కివూలో పంజీ హాస్పిటల్‌ను స్థాపించి.. అత్యాచార బాధితులకు అండగా నిలిచారు. తన వద్దకు వచ్చే బాధితులను ఆదుకునేందుకు ఈ డాక్టర్‌ రోజుకు 18 గంటల పాటు పనిచేసిన సందర్భాలు లెక్కలేనన్ని.
  • తిరుగుబాటుదారులు ఎంత క్రూరంగా అత్యాచారాలు చేసే వారంటే  కొందరు మహిళలకు ఒకటి కంటే ఎక్కువసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చేది. కాంగో మహిళలకు మక్వీజ్‌ అందిస్తున్న సేవల గురించి ‘ద గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌’ పత్రిక ద్వారా ప్రపంచానికి తెలిసింది.
  • తమ చేతుల్లో అత్యాచారానికి గురైన మహిళలకు డాక్టర్ అండగా నిలుస్తున్నాడనే కక్షతో ఉగ్రవాదులు ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారు. 2012లో తన ఇంటిపై దాడి చేసినపుడు అక్కడి నుంచి తప్పించుకుని యూరోప్‌ వెళ్లారు.
  • ఆయన లేని సమయంలో పంజీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు జరగక బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆరునెలల తర్వాత తిరిగి వచ్చిన మక్వీజ్‌కు బుకావ్‌ విమానాశ్రయం 21 మైళ్ల దూరమున్న పంజీ ఆసుపత్రి వరకు ప్రజలు.. ముఖ్యంగా మహిళలు స్వాగతం పలికారు.
  • యూరప్‌లో ఉన్న సమయంలోనే మక్వీజ్‌.. ఐక్యరాజ్యసమితి వేదికగా కాంగో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ప్రపంచానికి వెల్లడించారు. ‘డాక్టర్‌ మిరాకిల్‌’గా సుపరిచితుడైన ఆయన.. మహిళలపై లైంగిక దాడిని ‘భారీ విధ్వంసక ఆయుధం’గా అభివర్ణించారు. 

views: 761

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams