Current Affairs Telugu Daily

జేమ్స్‌ అలిసన్‌, తాసుకు హోంజోలకు 2018 వైద్య నోబెల్‌ 
క్యాన్సర్‌ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అమెరికా పరిశోధకుడు జేమ్స్‌ అలిసన్‌, జపాన్‌ శాస్త్రవేత్త తాసుకు హోంజోకు 2018 సం॥నికి గాను వైద్య నోబెల్‌ దక్కింది.
 • క్యాన్సర్‌ వ్యాధిపై పోరాడేలా రోగనిరోధక వ్యవస్థను క్రియాశీలం చేయడంపై వీరు చేపట్టిన పరిశోధనకు స్వీడిష్‌ అకాడమీ  అవార్డును ప్రకటించింది. సంప్రదాయ చికిత్సల్లో నేరుగా క్యాన్సర్‌ కణాలనే వైద్యులు లక్ష్యంగా చేసుకుంటుంటారు.
 • రోగనిరోధక వ్యవస్థను క్రియాశీలం చేయడం ద్వారా వేగంగా వ్యాధికి కళ్లెం వేయడంపై ఈ ఇద్దరు దృష్టి కేంద్రీకరించారు.
 • అలిసన్‌, హొంజోలు ఇమ్యునోథెరపీ అనే కొత్త విధానంలో మరింత వేగంగా కేన్సర్‌ను తగ్గించేందుకు రోగి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి ఎలా సాయపడుతుందనే అంశంపై పరిశోధనలు చేసి విజయం సాధించారు.
 • వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు ఉత్పత్తి చేసే ప్రొటీన్లను చికిత్సలో లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కేన్సర్‌ కణాలను వేగంగా చంపేసే విధానాన్ని జేమ్స్‌ అలిసన్‌, తసుకు హొంజోలు అభివ ృద్ధి చేశారు.
 • బహుమతులను ప్రకటించిన అనంతరం నోబెల్‌ అసెంబ్లీ సభ్యులు మాట్లాడుతూ ‘వీరి చికిత్సా విధానం కేన్సర్‌ను నయం చేయడంలో విప్లవాత్మక మార్పు తెచ్చింది.
 • రోగనిరోధక కణాలు కొన్ని ప్రొటీన్లు ఉత్పత్తి చేస్తుంటాయి. ఒక్కోసారి ఇవే రోగనిరోధక వ్యవస్థ చేతిలో క్యాన్సర్‌ కణాలు హతం కాకుండా అడ్డుకుంటాయి.
 • ఈ పరిణామాన్నే ‘బ్రేక్‌’గా పిలుస్తున్నారు. బ్రేక్‌ సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనావేస్తూ.. రోగనిరోధక వ్యవస్థను క్రియాశీలం చేయడంలో అలిసన్‌ విజయం సాధించారు. ఇదే సమయంలో బ్రేక్‌గా పనిచేస్తున్న కొత్త ప్రొటీన్లు లైజండ్‌ పీడీ-1ను హోంజో కనుగొన్నారు.
 • ‘‘క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా రోగనిరోధక శక్తిపై గత వంద ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అలిసన్‌, హోంజో ముందువరకూ  గుర్తించదగిన పురోగతి కనిపించలేదనే చెప్పాలి’’అని అకాడమీ వేలదించింది.
 • అలిసన్‌ పరిశోధన ఆధారంగా తయారుచేసిన ఔషధానికి ఇప్పటికే అమెరికా ఆహార, ఔషధ పరిపాలన విభాగం ఆమోదం తెలిపింది. మెనోమాపై చికిత్సకు వైద్యులు దీన్ని సూచిస్తున్నారు.
 • అలిసన్‌ టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో, హోంజో క్యోటో వర్సిటీలో ప్రొఫెసర్లుగా వ్యవహరిస్తున్నారు. తమ పరిశోధనకు గాను వీరిద్దరూ 2014లో ‘ఆసియా నోబెల్‌’గా పరిగణించే టాంగ్‌ ప్రైజ్‌ను గెలుచుకున్నారు.
 • 2018 డిసెంబర్‌ 10న విఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతిని పురస్కరించుకొని స్టాక్‌హోంలో జరిగే ఒక వేడుకలో వీరికి నోబెల్‌ పురస్కారాన్ని అందిస్తారు. పురస్కారం కింద అందే రూ.7.35 కోట్లను వీరిద్దరికీ పంచుతారు.
 • 1995లో టీ-కణాల చర్యను నియంత్రించే సీటీఎల్‌ఏ-4 గ్రాహకాలను గుర్తించిన ఇద్దరు పరిశోధకుల్లో అలిసన్‌ కూడా ఒకరు. ఒక రకమైన తెల్లరక్త కణాలే ఈ టీ-కణాలు. ఇవి వ్యాధులపై పోరాటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
 • ఈసారి స్వీడిష్‌ అకాడమీ సాహిత్య విభాగంలో పురస్కారాన్ని ప్రకటించడంలేదు. 1949 తర్వాత ఇలాంటి పరిణామం జరగడం ఇదే మొదటిసారి. ‘మీటూ కుంభకోణం’, తీవ్రస్థాయి అంతర్గత కుమ్ములాట కారణంగా అకాడమీ పనితీరు అస్తవ్యస్తమైంది.
ఇమ్యునోథెరపీ....
 • కేన్సర్‌ చికిత్సకు అందుబాటులోకి వచ్చిన కొత్త పద్ధతే ఈ ఇమ్యునోథెరపీ. అడ్డూ అదుపూ లేకుండా విభజితమయ్యే కేన్సర్‌ కణాలను నాశనం చేసేందుకు ప్రస్తుతం కీమోథెరపీ, లేజర్‌ సహా పలు రకాల చికిత్సలు వాడతున్నాం.
 • ఇమ్యునోథెరపీలో శరీర రోగ నిరోధక వ్యవస్థలోని టీ-కణాలే (టీ-లింఫోసైట్స్‌ తెల్ల రక్తకణాల్లో ఓ రకం) కేన్సర్‌ కణాలను గుర్తించి నాశనం చేసేలా చేస్తారు. ఇమ్యునోథెరపీలో మూడు రకాలు ఉన్నాయి.
 • రోగ నిరోధక వ్యవస్థలోని టీ-కణాలు చెక్‌పాయింట్‌ ఇన్‌హిబిటర్స్‌ వీటిల్లో ఒకటి. ఆరోగ్యకరమైన కణాలు, కేన్సర్‌ కణాల మధ్య తేడాను టీ-కణాలు గుర్తించేందుకు కొన్ని ప్రత్యేకమైన ప్రొటీన్‌ రిసెప్టార్లను వాడతారు.
 • వీటిని చెక్‌పాయింట్స్‌ అంటారు. సాధారణంగా కేన్సర్‌ కణాలు కూడా మామూలు కణాల్లాగే టీ-సెల్స్‌కు సంకేతాలు పంపుతుంటాయి. దీంతో కేన్సర్‌ కణాలేవో, ఆరోగ్యకరమైన కణాలేవో టీ-సెల్స్‌ గుర్తించలేవు. ఇమ్యునోథెరపీలో కొన్ని ప్రత్యేకమైన మందుల ద్వారా ఈ సంకేతాలను నిలిపివేసి టీ-కణాలు కేన్సర్‌ కణాలను గుర్తించేలా చేస్తారు.  
 • రెండో రకం ఇమ్యునోథెరపీలో సైటోకైన్స్‌ను వాడతారు. రోగ నిరోధక వ్యవస్థ తయారు చేసే ప్రత్యేక రసాయనాలే ఈ సైటోకైన్స్‌. ఈ ప్రత్యేక రసాయనా ద్వారా టీ-సెల్స్‌ అధికమై అవి కేన్సర్‌ కణాలపై దాడి చేస్తాయని అంచనా.
 • మూడో పద్ధతి... వ్యాక్సిన్లు. కొన్ని కేన్సర్ల విషయంలో ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్లను ఉపయోగిస్తారు.
 • మిగిలిన వాటిల్లో వ్యాధి సోకిన తరువాత కూడా టీ-కణాల్లో కొత్త శక్తిని నింపి కేన్సర్‌ కణాలపై దాడి చేసేలా చేసేందుకు వ్యాక్సిన్లు ఉపయోగపడతాయి. ఈ పద్ధతిలో రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తారు కాబట్టి దాని ప్రభావం కొన్ని ఆరోగ్యకరమైన కణాలపై కూడా పడుతూంటుంది.
 • ఫలితంగా విపరీతమైన నీరసం, వికారం, ఆకలి మందగించడం, దగ్గు వంటి సమస్యలు ఉంటాయి.

views: 877

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams