Current Affairs Telugu Daily

జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వంలో లోక్‌పాల్‌ అన్వేషణ కమిటీ 
కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వంలో లోక్‌పాల్‌ అన్వేషణ కమిటీని ఏర్పాటు చేసింది.
  • ఎస్‌బీఐ మాజీ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య, ప్రసారభారతి ఛైర్‌పర్సన్‌ ఎ.సూర్యప్రకాశ్‌, ఇస్రో మాజీ అధిపతి ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌, అహాబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శఖరాంసింగ్‌యాదవ్‌, గుజరాత్‌ పోలీస్‌ మాజీ అధిపతి షబ్బీర్‌హుస్సేన్‌ ఎస్‌ ఖాండ్వావాలా, రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి లలిత్‌ కె.పన్వర్‌, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌ ఈ కమిటీలో సభ్యులు.
  • ప్రభుత్వంలో అవినీతిని కట్టడి చేసి, జవాబుదారీతనం పెంచడానికి లోక్‌పాల్‌ను ఉద్దేశించారు. లోక్‌పాల్‌, లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. లోక్‌పాల్‌, లోక్‌పాల్‌ వ్యవస్థలోని సభ్యుల నియామకానికి కొంత మంది పేర్లతో కూడిన జాబితాను అన్వేషణ కమిటీ సిఫార్సు చేయడం తప్పనిసరి.
  • ఈ కమిటీ సూచించిన జాబితా నుంచి ఎంపిక సంఘం.. లోక్‌పాల్‌ను, ఇతర సభ్యులను నియమిస్తుంది. ఎంపిక సంఘం సమావేశాలకు కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే గైర్హాజరవుతున్నా ప్రభుత్వం అన్వేషణ కమిటీని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
  • ఎంపిక సంఘంలో తనను పూర్తి స్థాయి సభ్యుడిగా పరిగణించడం లేదన్న అభ్యంతరంతో ఖర్గే ఈ కమిటీ సమావేశాలను బహిష్కరిస్తున్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా మాత్రమే ఆయనకు ఆహ్వానం వస్తోంది.
  • అందుకే ఆయన ఇప్పటి వరకు ఆరు సార్లు సమావేశాలను బహిష్కరించారు. లోక్‌సభలో ఏకైక పెద్ద విపక్ష పార్టీ నేతను ఎంపిక సంఘంలో సభ్యుడిని చేయడానికి చట్టాన్ని సవరించాలని ఖర్గే గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
  • చట్టం ప్రకారం విపక్ష నేత హోదా ఉన్నవారికే మాత్రమే ఎంపిక సంఘంలో అవకాశం ఉంటుంది. లోక్‌సభ బలంలో పదిశాతం స్థానాలు కానీ కనీసం 55 స్థానాలు కానీ వచ్చిన పార్టీ నేతకే విపక్ష నేత హోదా లభిస్తుంది.
  • కాంగ్రెస్‌.. లోక్‌సభలో ఏకైక అతిపెద్ద విపక్ష పార్టీయే కానీ విపక్ష నేత హోదా దక్కే స్థానాలు ఆ పార్టీకి లేవు. అందుకే ఖర్గేకు ఎంపిక సంఘ్శలో స్థానం దక్కలేదు. ఎంపిక సంఘానికి ప్రధాని నేతృత్వం వహిస్తారు. లోక్‌సభ స్పీకర్‌, లోక్‌సభలో విపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి నామినేట్‌ చేసే సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఈ సంఘంలో ఎవరైనా లేదా రాష్ట్రపతి నామినేట్‌ చేసే ప్రముఖ న్యాయకోవిదుడు సభ్యులుగా ఉంటారు.
  • ప్రముఖ న్యాయకోవిదుడిగా మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2018 ఏప్రిల్‌ 10న నామినేట్‌ చేశారు. అంతకు ముందు ఆయన స్థానంలో సీనియర్‌ న్యాయవాది పి.పి.రావు ఉండేవారు. ఆయన మరణంతో ఖాళీ అయిన స్థానంలో ముకుల్‌ రోహత్గీని నామినేట్‌ చేశారు.

views: 737Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams