Current Affairs Telugu Daily

కట్నం వేధింపులపై సుప్రీం తీర్పు సవరణ
మహిళలకు ఒక రక్షణ కవచంగా భావించే ఐపీసీ సెక్షన్‌ 498-ఏను సుప్రీంకోర్టు మళ్లీ పదునుదేల్చింది.
  • వరకట్న వేధింపులకు పాల్పడే అత్తింటి వారిని తక్షణం అరెస్టు చేసేందుకు అడ్డంకిగా ఉన్న నిబంధనను తొలగించింది. 2018 జూలైలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు సవరణలు చేస్తూ 2018 సెప్టెంబర్‌ 14న మరో తీర్పును వెలువరించింది.
  • వరకట్న వేధింపులకు సంబంధించిన కేసుల్లో భర్త లేదా అతని సంబంధీకులు అరెస్టుపై ఇక పోలీసు దర్యాప్తు అధికారిదే తుదినిర్ణయం. 
  • ముందస్తు బెయిల్‌కు సదరు నిందితులు ఎంతవరకూ అర్హులన్నది స్థానిక కోర్టు తేల్చాలని తీర్పు చెప్పింది. ఇన్నాళ్లూ 498-ఏ ఫిర్యాదును మొదట కుటుంబ సంక్షేమ కమిటీ పరిశీలనకు పంపేవారు.
  • ఆ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా పోలీసు చర్యలు ఉండేది. ఇక మీదట ఆ కమిటీలు ఉండవు. ఆ కమిటీలు న్యాయవ్యవస్థ విధులను చేపట్టజాలవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎఎం ఖాన్విల్కర్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
పాత తీర్పు..
  • వివాహితను కట్నం కోసం, ఇతరత్రా పెట్టుపోతల కోసం హింసించే భర్తలు, అత్తమాములు, బంధువులు హింసలు పెట్టే దృష్టాంతాలు నానాటికీ ఎక్కువ కావడంతో 498-ఏను 1983లో తెచ్చారు.
  • ఈ సెక్షన్‌ దుర్వినియోగమవుతోందని ఆరోపణలు రావడంతో- జస్టిస్‌ ఏకే గోయెల్‌, జస్టిస్‌ లిత్‌తో కూడిన బెంచ్‌ 2017 జూలై 27న ఇచ్చిన తీర్పులో కొన్ని మార్గదర్శకాలిచ్చింది. 
దాని ప్రకారం..
1) కుటుంబ హింస కేసును పరిశీలించడానికి పారాలీగల్‌ వంటీర్లు, సామాజిక పెద్దలు, రిటైరైన ప్రముఖులు, ఆఫీసర్ల భార్యలు తదితరులతో జిల్లా న్యాయసేవా సంస్థ ఓ కమిటీ వేయాలి. కమిటీలో ముగ్గురే ఉండాలి.
2) ఇరుపక్షాలతో మాట్లాడి తమ సిఫారసుతో కూడిన నివేదికను దర్యాప్త అధికారికి అప్పగించాలి.
3) ఈ నివేదిక వచ్చే దాకా సదరు దర్యాప్తు అధికారి ఎలాంటి అరెస్టులూ చేయరాదు.
4) ఈ కేసు దర్యాప్తు కోసం ఓ ప్రత్యేక అధికారిని నియమించాలి.
5) ఒకవేళ రెండు పక్షాలూ రాజీకొస్తే జిల్లా లేదా సెషన్స్‌ జడ్జి ఆ కేసును కొట్టేయవచ్చు.
6) అరెస్టయిన వారు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే సాధ్యమైనంత తొందరగా, వీలైతే అదే రోజు బెయిలిచ్చేసే అవకాశాన్ని పరిశీలించాలి. ఈ సవరణపై దేశవ్యాప్తంగా నిరసన రేగింది. ఈ తీర్పు 498-ఏను నీరుగార్చేట్లుగా ఉందని, వివాహితకు రక్షణ కాబోదని 16 మహిళా సంఘాలు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖలో నిరసన వ్యక్తం చేశాయి.
తాజా తీర్పు
1) సెక్షన్‌ 498-ఏను పార్లమెంట్‌ చట్టంగా చేసింది. దానిని మారుస్తూ కోర్టు (ద్విసభ్య బెంచ్‌) మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదు. దాన్ని కోర్టు మార్చలేవు.
2) నాటి తీర్పులోని 19(1) ప్రకారం కుటుంబ సంక్షేమ కమిటీ ఏర్పాటు జరగాలి. ఇది కుదరదు. దీన్ని అనుమతించలేం.
3) కేసు మంచి చెడ్డను చూసి తన విచక్షణ ఉపయోగించి - పోలీసు అధికారి వారిని అరెస్టు చేయాలా? వద్దా? అన్న నిర్ణయం తీసుకోవాలి. ఇందులో ఆ అధికారిదే తుదినిర్ణయం.
4) వరకట్న వేధింపులకు సంబంధించిన కేసుల్లో ఏడేళ్ల దాకా శిక్ష పడుతుంది. దర్యాప్తు అధికారులు- ఒక వ్యక్తి తీవ్రమైన నేరానికి పాల్పడ్డట్లు సంతృప్తి చెందిన తర్వాతే అరెస్టు చేయాలి. సదరు వ్యక్తుల సాక్షులు బెదిరింపులకు, సాక్ష్యాల విధ్వంసానికి పాల్పడవచ్చని భావిస్తేనే అరెస్టు చేయాలి.
5) దర్యాప్తు అధికారులకు 498-ఏ గురించి మిగిలిన సెక్షన్ల గురించి పూర్తి శిక్షణను ఇచ్చే అంశాన్ని డీజీపీలు పరిశీలించాలి
6) పార్టీలు సెటిల్మెంట్‌కు వస్తే కేసును జిల్లా లేదా సెషన్స్‌ జడ్జి కొట్టేయవచ్చన్న తీర్పు సరికాదు.

views: 779Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams