Current Affairs Telugu Daily

స్వలింగ సంపర్కం నేరం కాదు : సుప్రీంకోర్టు తీర్పు 
పరస్పర అంగీకారంతో ఇద్దరు వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం గానీ, స్త్రీ-పురుషుల మధ్య ప్రైవేటుగా జరిగే లైంగిక చర్య గానీ నేరం కాదని సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్‌ 6న తీర్పు వెలువరించింది.
 • చాలా ఏళ్లుగా వాదోపవాదనలు కొనసాగుతున్న ఈ అంశాలపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 493 పుటల్లో సవివరమైన, చరిత్రాత్మకమైన తీర్పును ఏకాభిప్రాయంతో ప్రకటించింది. వివక్షకు గురవుతున్న వర్గాల గురించి, బ్రిటిష్‌ కాలం  నుంచి కొనసాగుతూ వస్తున్న వివక్షపైనా సున్నితమైన వ్యాఖ్యలు చేసింది. అమల్లో ఉన్న చట్టంలో ఒక భాగాన్ని కొట్టివేసింది. సమానత్వ హక్కును, హుందాగా జీవించే హక్కును అది ఉల్లంఘిస్తోందని పేర్కొంది.
 • స్వలింగ సంపర్కంపై 17 ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి తెరదించడాన్ని స్వాగతిస్తూ స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.  నవతేజ్‌ జౌహర్‌ (డ్యాన్సర్‌), సునీల్‌ మెహ్రా (పాత్రికేయుడు), రీతూ దాల్మియా (పాకశాస్త్ర నిపుణులు), అమన్‌ నాథ్‌, కేశవ్‌ సూరి (హోటల్‌ వ్యాపారులు), ఆయేషా కపూర్‌ (వ్యాపారవేత్త)తో పాటు ఐఐటీకు చెందిన 20 మంది ప్రస్తుత, పూర్వ విద్యార్థులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లపై ఈ తీర్పు వచ్చింది. స్వలింగ సంపర్కం నేరమంటూ 158 ఏళ్ల క్రితం చేసిన నిబంధన చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా ప్రకటించాలని ఈ పిటిషన్లు కోరాయి. స్వలింగ సంపర్కానికి ప్రపంచంలో ఇంతవరకు 25 దేశాల్లో చట్టబద్ధత ఉంది.
 • స్వలింగ సంపర్కం నేరమని భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లో సెక్షన్‌-377 చెబుతోంది. ప్రకృతి విరుద్ధమైన లైంగిక చర్యకు పాల్పడినవారికి యావజ్జీవ శిక్ష కూడా విధించవచ్చని పేర్కొంటోంది. అయితే- పరస్పర అంగీకారంతో జరిపే లైంగిక చర్యను నేరమని చెప్పడం ‘సమర్థనీయం కాదు. అది అహేతుకం. పక్షపాత పూరితం’ అని ధర్మాసనం విశ్లేషించింది. జంతువులతో, బాలలతో జరిపే అసహజ లైంగిక చర్య, ‘‘పరస్పర ఆమోదం లేని’’ స్వలింగ సంపర్కం మాత్రం ఇకపైనా నేరంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ధర్మాసనం 4 విడివిడి తీర్పును ఏకీభావంతో వెలువరించింది. ఏకాభిప్రాయంతో చేసే అసహజ శృంగార చర్యను నేరంగా తిరిగి పరిగణిస్తూ 2013లో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును సీజేఐ ధర్మాసనం కొట్టివేసింది. స్వలింగ సంపర్కుల హక్కుల  పరిరక్షణలో జరిగిన ఆలస్యానికిగానూ చరిత్ర క్షమాపణలు చెప్పుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. శతాబ్దాలుగా వారు అవమానాలను, ఛీత్కారాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తుచేసింది.
 • ‘ఐపీసీలో సెక్షన్‌-377ని ఉపయోగించుకుని లెస్బియన్‌ (స్త్రీ స్వలింగ సంపర్కులు), గే (పురుష స్వలింగ సంపర్కులు), బై సెక్సువల్‌ (స్త్రీతో, పురుషులతో కూడా సంగమించేవారు), ట్రాన్స్‌జెండర్‌ (లింగ మార్పిడి చేయించుకున్నవారు), క్వీర్‌ (విపరీత/ వికృత స్వభావం ఉన్నవారు)... వర్గాలపై వివక్ష చూపించారు. ఈ ఎల్‌జీబీటీక్యూ వర్గాలను వేధించడానికి ఈ సెక్షన్‌ను ఒక అసహ్యకర అస్త్రంగా వాడుకుని వివక్ష చూపిస్తూ వచ్చారు’ అని ధర్మాసనం గట్టిగా అభిప్రాయపడింది. ఆ చీకటి నుంచి వెలుగులోకి పయనించాల్సిన సమయం ఆసన్నమయిందని తెలిపింది. ‘తగిన వయోజనుల నడుమ పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్యల్నీ సెక్షన్‌-377 ఒక నేరంగా చూస్తోంది. పరస్పరం అంగీకారం ఉన్న, లేని లైంగిక చర్య మధ్య విచక్షణ చూపడంలో ఇది విఫలమయింది. ప్రైవేటుగా జరిగే ఆ చర్యలు ఎవరికీ హానికరం కావు. సమాజానికి అంటుకునేవీకావు. రాజ్యాంగంలోని 14వ అధికరణం కింద లభిస్తున్న సమానత్వ హక్కును ఉల్లంఘించేలా ఉన్న ఈ సెక్షన్‌ను పాక్షికంగా కొట్టివేయాల్సిందే’నని చెప్పింది.
 • ఐపీసీలో సెక్షన్‌-377ను శిలా శాసనంగా భావించిందని, పిటిషన్లను కేంద్రం వ్యతిరేకించకపోయినా వాటిని కోర్టు వివేచనకే వదిలేసిందని ధర్మాసనం తెలిపింది. దీని బదులు ఈ సెక్షన్‌పై కేంద్రం విస్పష్టమైన ప్రకటన చేసి ఉంటే దానిని మెచ్చుకునేవారిమని పేర్కొంది. ఈ అంశంపై ప్రభుత్వానికి సొంత అభిప్రాయం లేకుండా న్యాయస్థాన తీర్పునకు కట్టుబడుతున్నట్లు అర్థమవుతోందని తెలిపింది. 
 • స్వీయ వ్యక్తీకరణను తిరస్కరించడమంటే మృత్యువును ఆహ్వానించడంతో సమానమని జస్టిస్‌ దీపక్‌మిశ్ర, జస్టిస్‌ ఖన్వ్కిర్‌లు పేర్కొన్నారు. జస్టిస్‌ ఖన్వ్కిర్‌తో కలిసి జస్టిస్‌మిశ్ర ప్రధానమైన తీర్పు రాశారు. లైంగిక చర్యకు సమ్మతి పూర్తి స్వచ్ఛందంగా ఉండాలనీ, ఎలాంటి బలవంతం ఉండకూడదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ‘సామాజిక నైతికత పేరుతో నైతికతను బలి తీసుకోలేం. చట్టం ప్రకారం కేవం రాజ్యాంగపరమైన నైతికతే చెల్లుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరి అనుమతి లేకపోయినా అది నేరమే అవుతుంద’ని తెలిపారు. ఇతర పౌరుల మాదిరిగానే ఈ వర్గాలకూ రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. తీర్పు సారాంశాన్ని ధర్మాసనం తరఫున ఆయన చదివి వినిపించారు. స్వలింగ సంపర్కుల హక్కుపై అంతర్జాతీయ ఒప్పందాల్లో మనదేశం కూడా భాగస్వామిగా ఉందనీ, వాటికి కట్టుబడి ఉండాలనీ ధర్మాసనం పేర్కొంది. 
 • స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన వెంటనే- గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి దిగ్గజ సంస్థలు తమ వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌- తన వెబ్‌సైట్‌పై ఇంద్రధనుస్సు రంగులతో కూడిన పతాకాన్ని ఉంచింది. జాతీయంగా, అంతర్జాతీయంగా జరిగే పరిణామాలకు అనుగుణంగా ఈ సంస్థ తన వెబ్‌సైట్‌పై డూడుల్స్‌ను ఎప్పటికప్పుడు మారుస్తుంటుంది. ఇలా స్వలింగ సంపర్కులకు చిహ్నంగా మారిన ఇంద్రధనుస్సు రంగులతో కూడిన జెండాను ప్రదర్శించింది. దానిపై మౌస్‌ కర్సర్‌ను ఉంచితే ‘సమాన హక్కు సాధన వేడుక’ అన్న సందేశాన్నిస్తోంది. సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ సైతం తన భారతీయ వెబ్‌సైట్‌పై లోగోను బహువర్ణ శోభితంగా తీర్చిదిద్దింది.
 • ఉభయుల సమ్మతితో జరిగే లైంగిక సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదనడంతో, చట్టబద్ధతకు సంబంధించి 25 దేశాల సరసన భారత్‌ చేరినట్లయింది.అమెరికా, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇంగ్లండ్‌-వేల్స్‌, దక్షిణాఫ్రికా, స్పెయిన్‌, స్వీడన్‌, బ్రెజిల్‌, కెనడా, న్యూజిలాండ్‌, నెదర్లాండ్స్‌ వంటి దేశాల్లో స్వలింగ వివాహాలు చట్టబద్ధమే. ఆ మేరకు ప్రథమంగా చట్టరూపం కల్పించిన దేశం- నెదర్లాండ్స్‌. పాతిక దేశాల్లో పది దేశాలు ఆయా సర్వోన్నత న్యాయస్థానాల తీర్పు అనంతరమే స్వలింగ సంపర్కాలకు చట్టసమ్మతి కలిగించాయి.
స్వలింగ సంపర్కం చట్టబద్ధమైన తీరు..
 • 2001: పరస్పర సమ్మతితో కూడిన స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతూ ‘నాజ్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ డిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేసింది.
 • 2004 సెప్టెంబరు: పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. స్వలింగ సంపర్క హక్కుల కార్యకర్తలు సమీక్షా పిటిషన్‌ దాఖలు చేశారు. వారి పిటిషన్‌నూ హైకోర్టు కొట్టివేసింది.
 • 2006 ఏప్రిల్‌ 3: కేసును పునఃపరిశీలించాల్సిందిగా దిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
 • 2008 సెప్టెంబరు 26: స్వలింగ సంపర్కం అనైతికమని కేంద్రం పేర్కొంది. అది నేరమేమీ కాదని చెప్తే.. సమాజం నైతికంగా నీరుగారిపోతుందని అభిప్రాయపడింది.
 • 2009 జులై 2: పరస్పర సమ్మతితో కూడిన స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
 • 2013 డిసెంబరు 11: స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేస్తూ డిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
 • డిసెంబరు 20: తీర్పును పునఃపరిశీలించాంటూ సుప్రీంకోర్టులో కేంద్రం సమీక్షా పిటిషన్‌ దాఖలు చేసింది.

views: 915

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams