Current Affairs Telugu Daily

జనగణనకు కేంద్రం ఆదేశాలు 
దేశవ్యాప్తంగా 2020-21 జనగణనకు ప్రతీ గ్రామం, మండలం లేదా తాలుకా, జిల్లా జనగణన పటాలను సిద్ధం చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వీటి ఆన్‌లైన్‌ నమోదుకు 2019 డిసెంబరు 31 గడువుగా నిర్ణయించింది. కొత్తగా ఏర్పడిన రెవెన్యూ గ్రామాల వారీగా జనాభా లెక్క సేకరణ పరిధిని నిర్ణయిస్తారు. ప్రతీ 120 నుంచి 150 ఇళ్లకు ఒక గణకుడిని నియమించేలా పటాలన్ని సిద్ధం చేయాలి. ప్రతీ 10 సం॥లకు ఒకసారి కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో జనగణన జరుగుతుంది. ఈసారి వెనుకబడిన కులాల(బీసీ) వివరాలను సేకరించాలని కేంద్రం యోచిస్తోంది. దీనివల్ల సేకరణ వివరాలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా. ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ కులాల వివరాలనే తీసుకుంటున్నారు. 2020-21 జనగణనకు ఇప్పటి నుంచే  తెలుగు రాష్ట్రాల్లో పనులు ప్రారంభించారు.
జనగణన ... 
  • ప్రతీ మండలం లేదా తాలుకా స్థాయిలో ఉండే తహసీల్దార్‌ను జనగణన అధికారిగా నిర్ణయిస్తారు. ఆ అధికారి పరిధిలో ఉండే రెవెన్యూ గ్రామాల పటాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. ప్రతీ 120 నుంచి 150 ఇళ్లకు ఒక గణకుడు, ప్రతీ ఆరేడు గణకులపై ఒక పర్యవేక్షకుడిని నియమిస్తారు. ఈ పనులు చేయడానికి ఉపాధ్యాయులను ఎక్కువగా వినియోగిస్తారు. వీరి గుర్తింపు వివరాలను సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని యోచిస్తున్నారు.
  • జనగణన రెండు దశలుగా ఉంటుంది. తొలుత 2020 ఆరంభంలో ఇళ్లు, భవనాలు, ఇతర కట్టడాల వివరాలన్నీ సేకరిస్తారు. వీటిలో ప్రజలు నివసిస్తున్న ఇళ్లు ఎన్ని, ఖాళీగా ఉన్నవి ఎన్ని, ఇళ్లు/కార్యాలయంగా కలిపి వాడుతున్నవి ఎన్ని, వాణిజ్య కట్టడాలెన్ని తదతర వివరాన్నిటినీ సమగ్రంగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ లెక్కన్నీ పక్కాగా తేలిన తరవాత అసలు అంకం ప్రజల వివరాలను సేకరించడం. ప్రతీ కుటుంబం, ప్రతీ వ్యక్తి వివరాలు వేర్వేరుగా సేకరిస్తారు.
CRS ... 
  • తెలుగు రాష్ట్రాల్లో 2016 చివరి నాటికే 8.85 కోట్లకు పైగా జనాభా ఉన్నట్లు పౌర నమోదు వ్యవస్థ(CRS) ద్వారా తేలింది. దేశంలో ప్రతీ జననం, మరణాన్ని అధికారికంగా నమోదు చేయడాన్ని CRSగా పిలుస్తారు. దీనిద్వారా ఏటా ఎంత జనాభా అదనంగా పెరుగుతోంది, నికరంగా ఎంత అనే ప్రాథమిక వివరాలను వెల్లడిస్తారు. 2021 ఏప్రిల్‌ తరవాత అధికారికంగా ప్రతీ ఒక్కరి వ్యక్తిగత వివరాలతో జనాభా లెక్కలు సేకరిస్తారు. 
CRS-Civil Registration System

views: 885

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams