Current Affairs Telugu Daily

ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదు : న్యాయ‌ క‌మీష‌న్‌ 
దేశంలో ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో వివాహం, విడాకుల‌కు సంబంధించిన ఉమ్మడి పౌరస్మృతి (అందరికీ ఒకే చట్టం) అవసరం లేద‌ని, అది అంత ఆమోద యోగ్యం కాద‌ని కేంద్ర న్యాయ కమిషన్ అభిప్రాయ‌ప‌డింది. వివాహం, విడాకులు, జీవనభృతి, పురుషులు, మహిళలకు చట్టబద్ధ వివాహ వయస్సు తదితర అంశాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల్లో మార్పులు చాలా అవసరమని తెలిపింది. వివాహ వయసును స్త్రీ, పురుషులకు స‌మానంగా 18 ఏళ్లుగా మార్చాల‌ని పేర్కొంది. ఈ మేర‌కు ఆగ‌స్టు 31తో ప‌ద‌వీకాలం ముగిసిన నేప‌థ్య‌లో 21వ న్యాయ క‌మీష‌న్‌ పౌరస్మృతిపై సంప్రదింపుల పత్రం (consultation paper) విడుద‌ల చేసింది.
న్యాయ‌క‌మీష‌న్ అభిప్రాయాలు, సూచ‌న‌లు
- ఒక మహిళ సంపాదనతో నిమిత్తం లేకుండా విడాకుల సమయంలో ఆస్తిలో సమాన వాటా అందాలి. దీనికోసం హిందూ వివాహ చట్టం 1955,  ప్రత్యేక వివాహ చట్టం 1954,  పార్సీ వివాహ, విడాకుల చట్టం యాక్ట్‌ 1936, క్రైస్తవ వివాహ చట్టం 1972, ముస్లిం వివాహ రద్దు చట్టం 1939లను స‌వ‌రించాల‌ని పేర్కొంది.
- ప్రస్తుతం వివాహానికి పురుషుడికి 21 ఏళ్లు, మహిళకు 18 ఏళ్లు చట్టబద్ధ వయసుగా ఉంది. దీనికి ఇరువురికి సమానంగా 18 ఏళ్లకు మార్చాలి.
- మత సంప్రదాయాల ముసుగులో ట్రిపుల్‌ తలాఖ్, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలు అమలుకాకుండా చూడాలి.
- పార్సీ మతానికి చెందిన మహిళ వేరే మతస్తుడ్ని వివాహం చేసుకుంటే వారసత్వ ఆస్తిలో ఆమెకు వాటా ఉండాలి. (ప్ర‌స్తుతం అలా చేసుకున్న వారికి ఆస్తిలో వాటా ఇవ్వ‌రు)
- ప్రభుత్వాన్ని విమర్శించడం, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా అంశాలతో విభేదించడం రాజద్రోహం కాదని,  ఉద్దేశ పూర్వకంగా చట్టవిరుద్ధంగా, హింసాత్మకంగా ప్రభుత్వాన్ని కూలగొట్టే చర్యలకు పాల్పడితేనే రాజద్రోహంగా పరిగణించాలి. రాజ‌ద్రోహానికి సంబంధించిన ఐపీసీ సెక్ష‌న్ 124ఏ ను స‌మీక్షించాలి. ఈ సెక్ష‌న్‌ను బ్రిటన్‌ ప‌దేళ్ల కింద‌నే రద్దు చేసింది.
రాజ్యాంగంలోని పార్ట్ 4లో ఉన్న ఆదేశిక సూత్రాల్లో భార‌త‌దేశంలో ఉమ్మ‌డి పౌర‌స్మృతి గురించి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధిక‌ర‌ణ 44. 2016 జూన్ 16న కేంద్ర న్యాయ శాఖ ఉమ్మ‌డి పౌర‌స్మృతిపై నివేదిక అందించాల‌ని 21వ న్యాయ క‌మీష‌న్‌ను కోరగా రెండేళ్ల అధ్య‌యనం అనంత‌రం భార‌త‌దేశంలోని కుటుంబ చ‌ట్టాల‌పై కేవ‌లం సంప్ర‌దింపుల ప‌త్రంను మాత్ర‌మే విడుద‌ల చేసింది. ఈ క‌మీష‌న్ చైర్మ‌న్ బ‌ల్బీర్ సింగ్ చౌహాన్‌.
టిట్ బిట్స్‌:
ఏమిటి : ఉమ్మడి పౌరస్మృతిపై న్యాయ‌ క‌మీష‌న్ నివేదిక‌
ఎప్పుడు: ఆగ‌స్టు 31, 2018
ఎక్క‌డ : ఢిల్లీ
ఎందుకు: కేంద్ర న్యాయశాఖ ఉమ్మ‌డి పౌర‌స్మృతిపై నివేదిక ఇవ్వాల‌ని కోరినందుకు

views: 791

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams