Current Affairs Telugu Daily

ఖాట్మండులో నాలుగో బిమ్స్‌టెక్ స‌ద‌స్సు 
ఉగ్రవాదం స‌హా వేళ్లూనుకున్న వ్య‌వ‌స్థీకృత నేర‌వ్య‌వ‌స్థ‌ ప్రపంచ శాంతికి పెను విఘాతం కలిగిస్తున్నాయని, ఉగ్ర‌వాదానికి మద్దతుగా నిలుస్తున్న అన్ని దేశాల‌ను ఉగ్ర హింసకు బాధ్యుల్ని చేయాలని BIMSTEC (The Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation) దేశాలు పిలుపునిచ్చాయి. నేపాల్‌ రాజధాని ఖాట్మండులో ఆగ‌స్టు 31న జ‌రిగిన నాలుగో బిమ్స్‌టెక్‌ సదస్సులో 7 స‌భ్య‌దేశాలు ఈ మేర‌కు ఏకాభిప్రాయంతో ఖాట్మండు డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. భారత్‌ నుంచి ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరయ్యారు.
స‌ద‌స్సు సంద‌ర్భంగా స‌భ్య‌దేశాలు మ‌రియు భార‌త్ మ‌ధ్య ప‌లు ఒప్పందాలు కుదిరాయి. బీహార్‌లోని ర‌క్సౌల్ నుంచి నేపాల్ రాజ‌ధాని ఖాట్మండు వ‌ర‌కు వ్యూహాత్మ‌క రైలు మార్గం (strategic railway link) ను నిర్మించ‌డానికి భార‌త్, నేపాల్ మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం కుదిరింది. 2018 ఏప్రిల్ లో నేపాల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భార‌త ప్ర‌ధాని మోదీ, నేపాల్ ప్ర‌ధాని కేపీ ఓలి శ‌ర్మ మ‌ధ్య ఈ మార్గం నిర్మాణంపై చ‌ర్చ‌లు జ‌రిగాయి. దీంతో పాటు ఇంధ‌న రంగంలో బిమ్స్‌టెక్‌ సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి 'బిమ్స్‌టెక్‌ గ్రిడ్‌ ఇంటర్‌కనెక్షన్‌' ఏర్పాటుకు కూడా అవగాహనా ఒప్పందం కుదిరింది. అలాగే నేపాల్‌లోని పశుపతినాథ్‌ ఆలయ పరిసరాల్లో యాత్రికుల కోసం కొత్తగా నిర్మించిన ‘భారత్‌ నేపాల్‌ మైత్రి ధరమ్‌శాల’ను నేపాల్‌ ప్రధాని ఓలితో కలసి మోదీ ప్రారంభించారు. తదుపరి బిమ్స్‌టెక్‌ సదస్సుకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. 
ఖాట్మండు డిక్లరేషన్‌ ముఖ్యాంశాలు..
► ఉగ్రభూతం, సీమాంతర నేరాలపై పోరాటానికి గట్టి ప్రయత్నాలు జరగాలి. సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పోత్సహించే సమగ్ర విధానాలు అవలంబించాలి.
► సభ్య దేశాల పోలీసులు, నిఘా వర్గాలు, న్యాయ వ్యవస్థ మధ్య సమన్వయం పెంచాలి.
► హోం మంత్రులు, జాతీయ భద్రతా అధికారుల సమావేశాలు తరచుగా నిర్వహించాలి.
► పరస్పర ఆర్థికాభివృద్ధి నిమిత్తం బహుళ రంగాల్లో సభ్యదేశాల మధ్య అనుసంధానత పెరగాలి.
► అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు న్యాయబద్ధంగా, అన్ని దేశాలకు ఒకే విధంగా వర్తించేలా ఉండాలి.
► దక్షిణ, ఆగ్నేయాసియాకు వారధిగా ఉన్న బిమ్స్‌టెక్‌ను ప్రాంతీయ సర్వతోముఖాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలి.
► అభివృద్ధి లక్ష్యాల సాధనకు పేదరికం పెద్ద అడ్డుగోడగా ఉంది. సుస్థిరాభివృద్ధికి 2030 ఎజెండాను అమలుచేయడానికి కృషి జరగాలి.
► వాతావరణ మార్పుపై అంతర ప్రభుత్వ నిపుణుల కమిటీ నియామకానికి అవకాశాలను పరిశీలించాలి.
► చివరగా, శాంతియుత, సుస్థిర, బలోపేత బిమ్స్‌టెక్‌ సాధనకు సభ్యదేశాలు కలసికట్టుగా పాటుపడాలి.

బిమ్స్‌టెక్ నేప‌థ్యం
దక్షిణాసియా, ఆగ్నేయాసియాలలోని ఏడు దేశాలు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ సంస్థ BIMSTEC. 1997, జూన్ 6న బ్యాంకాక్‌లో జరిగిన ఒక సమావేశంలో మొదట బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనమిక్ కోఆపరేషన్ (బిస్టెక్) అనే కూటమిగా ఏర్పడ్డాయి. అదే ఏడాది డిసెంబర్‌లో మయన్మార్ అయిదో సభ్య దేశంగా చేరింది. ఆ తర్వాత ఈ కూటమి పేరును బిమ్‌స్టెక్‌గా మార్చారు. నేపాల్, భూటాన్‌లు 2003లో కూటమిలో చేరాయి.
 బిమ్స్‌టెక్ స‌భ్య‌దేశాలు
భార‌త్, బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌, భూటాన్, నేపాల్‌
టిట్ బిట్స్‌:
ఏమిటి : నాలుగో బిమ్స్‌టెక్ స‌ద‌స్సు 2018
ఎప్పుడు: ఆగ‌స్టు 30 - 31, 2018
ఎక్క‌డ : ఖాట్మండు, నేపాల్‌
ఎవ‌రు : భార‌త్, బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌, భూటాన్, నేపాల్‌

views: 805

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams