Current Affairs Telugu Daily

జమిలి ఎన్నికల ప్రతిపాదనకు న్యాయ కమిషన్‌ ఆమోదం
ఎన్నికల వ్యయప్రయాసలను తగ్గించే దిశగా ప్రధాని నరేంద్రమోడి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన జమిలి ఎన్నికల ప్రతిపాదనకు న్యాయ కమిషన్‌ ఆమోదం తెలిపింది.
  • ‘జమిలి’తో ప్రజాధనం పొదుపు సాధ్యమవుతుందని సూచించింది. పరిపాలనా యంత్రాంగం నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించేందుకు మార్గం సుగమమవుతుందని పేర్కొంది. ‘జమిలి’పై తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు.. ప్రజా వేదికపై విస్తృత జరగాల్సిన ఆవశ్యకత ఉందని వెల్లడించింది. జమిలి ఎన్నికల నిర్వహణకు 3 ఐచ్ఛికాలను సూచించింది.
  • ప్రస్తుత న్యాయ కమిషన్‌ పదవీకాలం 2018 ఆగస్టు 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కీలకమైన ‘జమిలి’ అంశంపై ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి కమిషన్‌ సమర్పించింది.
  • ‘‘జమిలి ఎన్నికలతో ప్రజాధనాన్ని పొదుపు చేయొచ్చు. పరిపాలనా యంత్రాంగం, భద్రతా బలగాలపై భారం తగ్గించొచ్చు. ప్రభుత్వ విధానాలను మెరుగ్గా అమలుపర్చవచ్చు. ‘జమిలి’ జరిగితే.. పరిపాలనా యంత్రాంగం ఎన్నికల ప్రక్రియలపై కాకుండా.. నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించవచ్చు’’ అని నివేదికలో కమిషన్‌ పేర్కొంది. ముసాయిదా నివేదికతోపాటు ఓ అప్పీలను ప్రజల ముందు ఉంచింది.
  • లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీకు(జమ్ముకశ్మీర్‌ మినహా) ఏకకాలంలో ఎన్నికలు జరిపే అంశంపై అభిప్రాయాలు కోరింది.
  • రాజ్యాంగంలో ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని కమిషన్‌ సూచించింది. చట్టసభల నిర్వహణ, వాటి పదవీకాలానికి సంబంధించి సవరణలు అనివార్యమని తెలిపింది. మరోవైపు, ‘జమిలి’ నిర్వహణకు సంబంధించి న్యాయ కమిషన్‌ 3 ఐచ్చికాలను సూచించింది.
1) తొలుత 12, ఆపై 16 రాష్ట్రాలను కలిపి.. 
  • ఇందులో సూచించిన ప్రకారం చేస్తే.. 2019 లోక్‌సభ ఎన్నికలను 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలతో కలిసి ఒకేసారి నిర్వహించవచ్చు.
  • ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోనే కలిపి జరుగుతున్నాయి. రాజకీయ సంకల్పం, ఏకాభిప్రాయం తోడైతే.. హర్యానా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, డిల్లీ ఎన్నికలను కూడా వాటితో కలిపి నిర్వహించవచ్చు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం, రాజస్థాన్‌లో 2018 ఆఖర్లోగానీ, 2019 జనవరిలోగానీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
  • వాటి అసెంబ్లీ పదవీకాలాన్ని 6 నెలల పాటు పొడిగిస్తే.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే వాటికీ ఎన్నికలు జరిపించవచ్చు. అసెంబ్లీ పదవీకాలాన్ని పొడిగించాలంటే రాజ్యాంగంలోని అధికరణం-172ను సవరించడం అనివార్యం.
  • మిగతా 16 రాష్ట్రాలు, పుదుచ్చేరి విషయంలో 2019లోనే జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి, 2021 చివర్లో వాటికి ఎన్నికలు జరపాలి. అప్పటికి 17వ లోక్‌సభ పదవీకాలం(2019 మధ్యలో మొదలైతే) దాదాపు సగం ముగుస్తుంది.  
  • 2021 మధ్యలో 16 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే.. 2024 జూన్‌ నాటికి వాటి పదవీకాలం 30 నెలలవుతుంది. అప్పుడు వాటిని రద్దు చేసి.. అదే ఏడాది నుంచి మొత్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చు.
2) 5 సం॥లో రెండు సార్లు ఎన్నికలు 
  • ఈ విధానంలో.. 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలను 2019 లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహించాలి. 2021 చివర్లో మిగతా 16 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి జరపాలి. ఇదే విధానాన్ని కొనసాగిస్తే.. ప్రతి ఐదేళ్లలో రెండుసార్లు ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుంది.
3) ఏడాదిలో జరగాల్సినవన్నీ ఒకేసారి 
  • తొలి రెండు ఐచ్ఛికాల్లో సూచించిన తరహాలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోతే.. ఓ క్యాండర్‌ సంవత్సరంలో జరగాల్సిన రాష్ట్రాల ఎన్నికలన్నింటినీ ఒకేసారి నిర్వహించాలి. అన్ని రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న సమయాన్ని అందుకు ఎంచుకోవాలి. ముందుగా రద్దు చేస్తే.. లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహించాలి.

views: 909



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams