ఏడేళ్ల జైలుశిక్ష అనుభవించిన తర్వాత నిర్దోషిగా ప్రకటించిన సుప్రీం
సమీప బంధువైన 15 ఏళ్ల బాలికపై 2001లో అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో పదేళ్ల జైలుశిక్ష పడిన షాంసింగ్ అనే వ్యక్తిని సుప్రీంకోర్టు ఇప్పుడు నిర్దోషిగా ప్రకటించింది. ఇప్పటికే ఆయన ఏడేళ్ల పాటు కారాగార శిక్షను అనుభవించి ఉన్నాడు. నేర నిర్ధారణ జరగలేదంటూ జస్టిస్. ఎన్వీ రమణ, జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
2001లో ఫరీదాబాద్‌లో సదరుబాలికపై షాంసింగ్ అత్యాచారానికి పాల్పడ్డారంటూ అంతక్రితం కిందికోర్టు ప్రకటించి ఉన్న తీర్పును 2011లో గట్టిగా పంజాబ్ హర్యానా హైకోర్టు సమర్ధించింది. దీనిపై షాంసింగ్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అంతక్రితం పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.