Current Affairs Telugu Daily

ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్‌ మృతి 
ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్‌(80) మృతి చెందారు. స్వల్ప అస్వస్థత కారణంగా స్విట్జర్లాండ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ 2018 ఆగస్టు 18న అక్కడే తుదిశ్వాస విడిచారు.
 • ఈ విషయాన్ని అన్నన్‌ ఫౌండేషన్‌ ట్విట్టర్‌లో ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పదవిని అంకరించిన తొలి నల్లజాతీయునిగా, ఆ పదవిని చేపట్టిన సంస్థ తొలి ఉద్యోగిగా కోఫి అన్నన్‌ చరిత్ర సృష్టించారు.
 • 1997-2006 మధ్య వరుసగా రెండు పర్యాయాలు జనరల్‌ సెక్రటరీగా సేవలందించారు. ఆయన ఉద్యోగ జీవితమంతా ఐక్యరాజ్యసమితితోనే ముడిపడి ఉంది.
 • అసాధారణ దౌత్యప్రతిభ, సుహృద్భావం, అంతర్జాతీయ రాజనీతిజ్ఞత ఆయనను ప్రపంచ నాయకునిగా నిలబెట్టింది. ఇరాక్‌ యుద్ధ సమయాన, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ విజృంభిస్తున్న సమయంలో సమితి మండలిని పునరుజ్జీవింపజేసినందుకు ఆయనకు  2001లో నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది. 
 • ఘనాలోని కుమాసికు చెందిన ఉన్నత కుటుంబంలో 1938, ఏప్రిల్‌ 8న కవల సోదరి ఏఫుయాతో కలిసి అన్నన్‌ జన్మించారు. ఆయన పూర్తిపేరు కోఫి అటా అన్నన్‌. తండ్రి ప్రావిన్సియల్‌ గవర్నర్‌.
 • 1961లో మాంచెస్టర్‌ కళాశాల నుంచి ఎకనామిక్స్‌లో పూర్వస్నాతక విద్య. జెనీవాలో అంతర్జాతీయ వ్యవహారాలపై స్నాతక విద్య. ఆఫ్రికన్‌ భాషతో పాటు ఆంగ్లం, ఫ్రెంచ్‌పైనా పట్టు.
 • నైజీరియాకు చెందిన టితి అలకిజాతో 1965లో వివాహం. కుమార్తె అమా, కుమారుడు కిజో జననం. 1970లో వైవాహిక జీవితం విచ్ఛిన్నం. 1971లో అమెరికాలోని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చేరి మాస్టర్స్‌ అభ్యాసం. స్వీడన్‌కు చెందిన న్యాయవాది లెగెగ్రాన్‌తో 1984లో పెళ్లి.
 • ఇథియోపియాలో ఐక్యరాజ్యసమితి ఆర్థిక సంస్థ (ఆఫ్రికా)లో ఉద్యోగ జీవితం ఆరంభం. ఈజిప్ట్‌లో యూఎన్‌ అత్యవసర దళంలో, జెనీవాలో శరణార్థుల విభాగ హైకమిషనర్‌గా బాధ్యతలు. తర్వాత న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయానికి బదిలీ.
 • మానవవనరూల, ఆర్థిక, బడ్జెట్‌, సిబ్బంది భద్రతా విభాగాల్లో వివిధ హోదాల్లో సేవలు. 1997లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు.
 • 1990లో ఇరాక్‌ కువైట్‌ను ఆక్రమించినప్పుడు ప్రత్యేక బాధ్యతలు. ఇరాక్‌ నుంచి 900 మందికిపైగా అంతర్జాతీయ సిబ్బందిని వారివారి దేశాలకు తిరిగి రప్పించారు. బందీ విడుదలకు కృషి. మానవతా సాయానికి బదులుగా చమురును విక్రయించాలంటూ ఇరాక్‌తో చర్చలు.
 • ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు నేతృత్వం వహించారు. నైజీరియాలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు కృషి  చేశారు. 11 ఆఫ్రికా దేశాల్లో శాంతి చర్యలకు చొరవ చూపారు. 28 ఆఫ్రికా దేశాలకు ఐక్యరాజ్యసమితి సాయంలో కీలక పాత్ర పోషించారు
 • కోఫి అన్నన్‌ ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచ దేశాల శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ధి, మానవ హక్కుల సాధనకు కృషి చేశారు
 • కెన్యాలో అధికార విపక్షాల మధ్య సయోధ్యకు కృషి చేసి 41 రోజుల చర్చల ద్వారా శాంతి స్థాపన చేశారు
 • సిరియాలో అంతర్యుద్ధ నివారణకు ఐక్యరాజ్యసమితి అరబ్‌ లీగ్‌ రాయబారిగా విశేష సేవలు అందించారు

views: 870



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams